త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | ఇది ఉచితాల బ‌డ్జెట్ కాదు.. యువ‌త‌కు భ‌విష్య‌త్‌ను ఇచ్చే బ‌డ్జెట్ : కిష‌న్ రెడ్డి

Kishan Reddy | ఇది ఉచితాల బ‌డ్జెట్ కాదు.. దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించే బ‌డ్జెట్‌.. యువ‌త‌కు భ‌విష్య‌త్‌ను ఇచ్చే బ‌డ్జెట్ అని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విక‌సిత్ భార‌త్ కోసం వేస్తున్న అడుగులో మ‌రో అడుగే ఈ బ‌డ్జెట్ అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Feb 3, 2026, 5.14 pm IST

Kishan Reddy | ఇది ఉచితాల బ‌డ్జెట్ కాదు.. యువ‌త‌కు భ‌విష్య‌త్‌ను ఇచ్చే బ‌డ్జెట్ : కిష‌న్ రెడ్డి
Advertisement

బ‌డ్జెట్‌పై చెడు అభిప్రాయం క‌లిగించొద్దు..
ఉపాధి అవ‌కాశాల‌కు పెద్ద‌పీట వేశాం..
మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్ హ‌బ్‌గా హైద‌రాబాద్..
వీబీ జీ రామ్ జీ ప‌థ‌కానికి 9 శాతం అధిక నిధులు..
రాష్ట్రానికి 4 ల‌క్ష‌ల 30 వేల ఇండ్లు కేటాయింపు..
డేటా సెంట‌ర్ల‌కు ప్రోత్సాహ‌కాలు క‌ల్పిస్తున్నాం..
హైద‌రాబాద్‌కు రైల్వే క‌నెక్టివిటీని పెంచుతున్నాం..
కేంద్ర బ‌డ్జెట్‌పై కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఇది ఉచితాల బ‌డ్జెట్ కాదు.. దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించే బ‌డ్జెట్‌.. యువ‌త‌కు భ‌విష్య‌త్‌ను ఇచ్చే బ‌డ్జెట్ అని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విక‌సిత్ భార‌త్ కోసం వేస్తున్న అడుగులో మ‌రో అడుగే ఈ బ‌డ్జెట్ అని ఆయ‌న పేర్కొన్నారు. నాంప‌ల్లిలోని బీజేపీ కార్యాల‌యంలో కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ దేశ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసి చూపిస్తున్నాం. గ‌త 12 ఏళ్లుగా అన్ని వ‌ర్గాల‌కు మేలు జ‌రిగే విధంగా బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాం. కానీ ఆయా పార్టీలు బ‌డ్జెట్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో చెడు అభిప్రాయం క‌లిగిస్తున్నారు. బ‌డ్జెట్ అంటే ఉచితాలు ప్ర‌వేశ‌పెట్ట‌డమే అన్న విధంగా కొంద‌రు నేత‌లు ఆలోచ‌న చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకే బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతార‌నే ఆలోచ‌న గ‌తంలో ఉంది. ఆ ర‌కంగా కొన్ని పార్టీలు ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ మాత్రం దేశంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం, భావిత‌రాల భ‌విష్య‌త్ కోసం, 2047 నాటికి భార‌త‌దేశం ఒక విక‌సిత్ భార‌త్‌గా మార‌డం కోసం వేస్తున్న‌టువంటి అడుగులో మ‌రో అడుగు ఈ ఏడాది బ‌డ్జెట్ అని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

సుస్థిర‌మైన ఆర్థిక ప్ర‌గ‌తి కోసం ఆకాంక్షిస్తున్నాం..

ఈ బ‌డ్జెట్‌లో యువ‌త‌కు, గ్రామీణ ప్రాంతాల‌కు, ప‌రిశోధ‌న‌కు, పెట్టుబ‌డుల‌కు, ఉపాధి అవ‌కాశాల‌కు పెద్ద‌పీట వేశాం. దేశంలో ఒక సుస్థిర‌మైన ఆర్థిక ప్ర‌గ‌తి కోసం ఆకాంక్షిస్తున్నాం. ఆ దిశ‌గా ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక ప‌రిశోధ‌కులు, మేధావులు, రాజ‌కీయ విశ్లేష‌కుల మ‌న్న‌న‌లు పొందిన బ‌డ్జెట్ ఇది. ఈ బ‌డ్జెట్‌ను రాష్ట్రాల వారీగా కాకుండా.. ఒక దేశానికి సంబంధించిన‌టువంటి బ‌డ్జెట్‌గా చూడాలి. గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయం, పొదుపు సంఘాలకు భారీగా కేటాయింపులు చేశాం. రైల్వేలు, జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి కూడా పెద్దపీట వేశాం. మోదీ ప్ర‌భుత్వం తూచా త‌ప్ప‌కుండా అన్ని హామీల‌ను నెర‌వేర్చుతూ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతుంద‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్ హ‌బ్‌గా హైద‌రాబాద్

హైద‌రాబాద్ న‌గ‌రం హ‌బ్‌లకు కేంద్రంగా మార‌నుంది. ఐటీ హ‌బ్‌, ఎడ్యుకేష‌న‌ల్ హ‌బ్‌, డిజిట‌ల్ హ‌బ్‌, రైల్ స్పీడ్ కారిడార్, సెమీ కండక్ట‌ర్ హ‌బ్‌, డేటా సెంట‌ర్ హ‌బ్‌, ఫార్మా హబ్‌, హెల్త్ హ‌బ్‌, డిఫెన్స్ హ‌బ్‌, రీసెర్చ్ హబ్‌కు హైద‌రాబాద్ కేంద్రంగా మారింది. వీట‌న్నింటికి హైద‌రాబాద్ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఎంఎస్ఎంఈల‌కు దేశ వ్యాప్తంగా అనేక ర‌కాల ప్రోత్సాహ‌కాలు క‌ల్పించాం. దీంతో రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల‌కు కూడా లాభం జ‌రుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 23 ల‌క్ష‌ల ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఉన్నాయి. అదే విధంగా బ‌యో ఫార్మా శ‌క్తి పాల‌సీ.. హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతంది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నెట్ వ‌ర్క్‌కు సంబంధించి హైద‌రాబాద్ నైప‌ర్ ద్వారా రీసెర్చ్ అండ్ డెలవ‌ల‌ప్‌మెంట్ కెపాసిటీ పెరుగుతుంది. ఫార్మా రంగంలో హైద‌రాబాద్ నుంచి అధిక ఎగుమ‌తులు ఉన్నాయి. గ్లోబ‌ల్ స్టాండ‌ర్డ్స్‌కు అనుగుణంగా ప‌రిశోధ‌న‌లు, క్వాలిటీ కంట్రోల్‌ను, క్వాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలో గ్లోబ‌ల్ బ‌యో ఫార్మా మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్ హ‌బ్‌గా హైద‌రాబాద్ కీల‌క‌పాత్ర పోషిస్తుంది అని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

వీబీ జీ రామ్ జీ ప‌థ‌కానికి 9 శాతం అధిక నిధులు

వీబీ జీ రామ్ జీ ప‌థ‌కంపై కాంగ్రెస్ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేయ‌డం లేదు. గ‌తంలో కంటే ఈ ఏడాది 9 శాతం అధిక నిధులు బ‌డ్జెట్‌లో కేటాయించాం. ఫ‌ర్టిలైజ‌ర్స్ విష‌యంలో రేట్లు పెంచ‌కుండా కేంద్ర‌మే స‌బ్సిడీ భ‌రిస్తుంది. క‌రోనా కాలంలో అమెరికాతో స‌హా ప‌లు దేశాలు ఫర్టిలైజ‌ర్స్‌పై రేట్లు పెంచాయి. కానీ కేంద్రం పెంచ‌లేదు అని కిష‌న్ రెడ్డి తెలిపారు. ప్ర‌తి జిల్లాకు ఒక బాలికల వ‌స‌తి గృహం రాబోతోంది. అదే విధంగా 'స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్' (SASCI) ప‌థ‌కం కింద కేంద్రం ఇప్ప‌టికే సుమారు 9,502 కోట్లు ఇచ్చింది. దీంట్లో భాగంగా రామ‌ప్ప దేవాల‌యం అభివృద్ధి కోసం ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా రూ. 141 కోట్లు కేటాయింపులు చేశాం. సోమ‌శిల వెల్‌నెస్ సెంట‌ర్ కోసం రూ. 68 కోట్లు కేటాయించాం. త్వ‌ర‌లోనే అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ మినిస్ట్రీ ద్వారా హైద‌రాబాద్ న‌గరానికి నిధులు కేటాయించ‌బోతున్నాం అని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ‌కు 4 ల‌క్ష‌ల 30 వేల ఇండ్లు కేటాయింపు

అంతేకాకుండా ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద తెలంగాణ‌కు 4 ల‌క్ష‌ల 30 వేల ఇండ్లు కేటాయింపు జ‌రిగింది. వీటి నిర్మాణం కోసం రూ. 4350 కోట్లు కేటాయించాం. అంతేకాకుండా ఈ రోజు అటామిక్ మిన‌ర‌ల్స్ అండ్ డైరెక్ట‌రేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేష‌న్ రీసెర్చ్ సెంట‌ర్ కోసం రూ. 406 కోట్లు కేటాయింపులు చేశాం. ఏఆర్‌సీఐ, సీడీఎఫ్‌డీ, నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఎనిమ‌ల్ టెక్నాల‌జీ లాంటి కేంద్ర సంస్థ‌ల‌కు రూ. 3 వేల కోట్లు కేటాయింపులు చేశాం అని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

డేటా సెంట‌ర్స్‌కు ప్రోత్సాహ‌న్ని క‌ల్పించే దిశ‌గా..

ఐటీ రంగంలో క‌ర్ణాట‌క త‌ర్వాత మ‌న‌మే కీల‌క‌పాత్ర పోషిస్తున్నాం. ఈ క్ర‌మంలో ఐటీ రంగంలో ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్నాం. అంతేకుండా డేటా సెంట‌ర్స్‌కు ప్రోత్సాహ‌న్ని క‌ల్పించే దిశ‌గా ముందుకు వెళ్తున్నాం. అమెజాన్ లాంటి సంస్థ‌లు డేటా సెంట‌ర్ల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసుకుంటున్నాయి. అనేక కొత్త ఐటీ కంపెనీలు ఈ దిశ‌లో ఉన్నాయి. ఐటీ కంపెనీల‌కు ప‌న్ను మిన‌హాయింపు క‌ల్పిస్తున్నాం. ఈ డేటా సెంట‌ర్లు దేశాభివృద్ధిలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి అని కిష‌న్ రెడ్డి తెలిపారు.

జాతీయ ర‌హ‌దారుల విష‌యంలో తెలంగాణ‌కు పెద్ద‌పీట

జాతీయ ర‌హ‌దారుల విష‌యంలో గ‌తంలో మాదిరే ఈ సారి కూడా తెలంగాణ‌కు కేంద్రం పెద్ద‌పీట వేసింది. ఆర్మూర్ - జ‌గిత్యాల - మంచిర్యాల 63 కిలోమీట‌ర్ల ర‌హ‌దారి నిర్మాణానికి ప్యాకేజీ 1 కింద 2471 కోట్లు కేటాయించాం. ఫోర్ లేన్ రోడ్డు కోసం ప్యాకేజీ 2 కింద 68 కిలోమీట‌ర్ల‌కు రూ. 2700 కోట్లు కేటాయించాం. జ‌గిత్యాల - క‌రీంన‌గ‌ర్ ఫోర్ లేనింగ్ కోసం రూ. 2484 కోట్లు, చించోలి - పాల‌మూరు యూనివ‌ర్సిటీ ర‌హ‌దారి కోసం రూ. 3175 కోట్లు, గ్రీన్ ఫీల్డ్ రీజ‌న‌ల్ ఎక్స్‌ప్రెస్ వే కోసం రూ. 21629 కోట్లు కేటాయించాం. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ ర‌హ‌దారి ఆరు లేన్ల కోసం రూ. 10297 కోట్లు కేటాయించాం. రూ. 42 వేల కోట్ల‌తో జాతీయ ర‌హ‌దారుల మంజూరు జ‌రిగింది అని కిష‌న్ రెడ్డి తెలిపారు.

హైద‌రాబాద్‌కు రైల్వే క‌నెక్టివిటీని పెంచుతున్నాం..

రైల్వేకు సంబంధించి ఈ ఏడాది అద్భుతంగా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని క‌నెక్టివిటీ చేసే విధంగా అనేక కొత్త ప్రాజెక్టుల‌ను తీసుకువ‌చ్చాం. రైల్వేకు సంబంధించి రూ. 47984 కోట్ల ప‌నులు జ‌రుగుతున్నాయి. ట్రాక్‌ల నిర్మాణం, విద్యుత్ స‌దూపాయం, క‌వ‌చ్, రీసెర్స్ సెంట‌ర్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం. కాజీపేట‌లో రైల్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్ వేగ‌త‌వంతంగా పూర్తవుతుంది. 42 రైల్వే స్టేష‌న్ల‌ను తెలంగాణ‌లో అభివృద్ధి చేస్తున్నాం. క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, బేగంపేట్, చ‌ర్ల‌ప‌ల్లిలో అధునాత‌నంగా ఏర్పాటు చేసిన రైల్వే స్టేష‌న్ల‌ను ప్రారంభించుకున్నాం. గ‌ద్వాల‌, కొముర‌వెల్లి రైల్వే స్టేష‌న్ల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించుంటామ‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement