త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | న‌న్ను కోసినా డ‌బ్బుల్లేవ‌న్నాడు.. ఇప్పుడేమో కాంగ్రెస్‌కు రూ. 1000 కోట్లు పంపిస్తాడ‌ట.. సీఎంపై బండి ఫైర్

Bandi Sanjay | పూట‌కో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. నన్ను కోసినా డ‌బ్బులు లేవ‌న్నోడు.. ఇప్పుడేమో ఏఐసీసీకి రూ. 1000 కోట్లు ఇచ్చే శ‌క్తి తెలంగాణ‌కు ఉంద‌ని సీఎం గ‌ర్వంగా చెబుతున్నాడు అని ఆయ‌న మండిప‌డ్డారు.

S

Telangana | Published On Feb 22, 2026, 6.32 pm IST

Bandi Sanjay | న‌న్ను కోసినా డ‌బ్బుల్లేవ‌న్నాడు.. ఇప్పుడేమో కాంగ్రెస్‌కు రూ. 1000 కోట్లు పంపిస్తాడ‌ట.. సీఎంపై బండి ఫైర్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : పూట‌కో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. నన్ను కోసినా డ‌బ్బులు లేవ‌న్నోడు.. ఇప్పుడేమో ఏఐసీసీకి రూ. 1000 కోట్లు ఇచ్చే శ‌క్తి తెలంగాణ‌కు ఉంద‌ని సీఎం గ‌ర్వంగా చెబుతున్నాడు అని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌ను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మార్చేసింద‌ని.. బీజేపీ నిరంత‌రం చెబుతూనే ఉంది అని గుర్తు చేశారు. రైతులు, విద్యార్థులు, మ‌హిళ‌లు, ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు, ఆరు గ్యారెంటీల అమ‌లుకు డబ్బు లేదు కానీ.. ఢిల్లీ పిలిచిన‌ప్పుడు డ‌బ్బు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇది ప్ర‌జా పాల‌న కాదు.. ఇది గాంధీ కుటుంబ పాల‌న అని బండి సంజ‌య్ విమ‌ర్శించారు. అయితే సీఎం వ్యాఖ్య‌ల‌ను ఎక్స్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టిన బండి సంజ‌య్.. గ‌తంలో ఉద్యోగ సంఘాల‌పై నిప్పులు చెరుగుతూ.. న‌న్ను కోసినా డ‌బ్బుల్లేవు అని రేవంత్ వ్యాఖ్యానించిన వీడియోతో పాటు నిన్న డీసీసీ అధ్య‌క్షుల ప్ర‌త్యేక శిక్ష‌ణా శిబిరంలో సీఎం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రూ. 1000 కోట్లు ఇచ్చే శ‌క్తి తెలంగాణ‌కు ఉంద‌ని వ్యాఖ్యానించిన వీడియోల‌ను ఎక్స్ వేదిక‌గా ఎంపీ షేర్ చేశారు.

అప్పుడు రేవంత్ ఏమ‌న్నాడంటే..? (మే 5, 2025)

నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా రాదు. నెలకు రూ. 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదు. వాస్తవ పరిస్థితి ఇది. మరి నన్ను ఏం చేస్తరు? నన్ను కోసుకొని వండుకొని తింటరా?’ ‘ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని నిందించదల్చుకున్నరు? ఎవరిని కొట్టదల్చుకున్నరు? ఉద్యోగా లిచ్చి జీతాలు ఇస్తున్న ప్రజలపైనా మీ యుద్ధం? ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారికి కష్టాలు వస్తే ఆదుకోవాల్సిన వాళ్లు.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల నాయకులను అడుగుతున్నా. ప్రజలకు మంచి చేసేందుకే ఇక్కడ ఉన్నాం. సమరం చేయడానికి లేము. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లెవరూ బాగుపడలేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025 మే 5వ తేదీన‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగిన ‘తెలంగాణ పోలీస్‌ రియల్‌ హీరోస్‌ జీ అవార్డులు’ కార్యక్రమానికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్ర‌సంగించిన సంద‌ర్భంగా ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు.

నిన్న రేవంత్ ఏమ‌న్నాడంటే..? (ఫిబ్ర‌వ‌రి 21, 2026)

కాంగ్రెస్ పార్టీకి గ‌త‌మే కాదు భ‌విష్య‌త్ కూడా ఉన్న‌ది. దేశానికి సంబంధించిన భ‌విష్య‌త్ కూడా ఉన్న‌ది. ఈ దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని విడ‌దీసి చూడ‌లేం. ఈ దేశం యొక్క ఆత్మ‌నే కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని దెబ్బ‌తీయాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషీ విష‌యం కాదు. రాహుల్ గాంధీని పార్ల‌మెంట్‌లో మాట్లాడ‌నివ్వ‌క‌పోయినా.. గాంధీ కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడినా.. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో గాంధీ కుటుంబాన్ని అవ‌మానించాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఉండ‌డానికి ఇల్లు లేక దేశం కోసం మూడు త‌రాలు ప్రాణాల‌ర్పించి గాంధీ కుటుంబానికి డ‌బ్బులు ఒక లెక్కనా..? నిజంగానే వారికి డ‌బ్బులు కావాల‌నుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు పోగేస్తే కూడా ఓ ప‌ది వేల కోట్ల రూపాయాలు జ‌మ అవుతాయి గాంధీ కుటుంబానికి ఇవ్వ‌డానికి. గాంధీ కుటుంబానికి ఒక వేళ ఆర్థిక అవ‌స‌రాలు ఉన్నాయంటే.. త‌లా ఓ చేయి వేస్తే తెలంగాణ నుంచి ఓ వేయి కోట్లు పోగేసి ఇవ్వ‌గ‌లిగిన శ‌క్తి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఉంది. రాహుల్ గాంధీ ఉండ‌డానికి సొంతిల్లు లేదు. పార్ల‌మెంట్ స‌భ్య‌త్వం ర‌ద్దు చేసిన‌ప్పుడు, ఇల్లు ఖాళీ చేయించిన‌ప్పుడు ఎక్క‌డ ఉండాలో అర్థం కాలేదు. చివ‌ర‌కు త‌న త‌ల్లి సోనియా ఉండే 10 జ‌న్‌ప‌థ్ వెళ్లి నివాసం ఉన్నారు. ఇల్లే లేని రాహుల్ గాంధీకి డ‌బ్బులు అవ‌స‌ర‌మా..? దేశం కోసం మూడు త‌రాలు ప్రాణాల‌ర్పించిన గాంధీ కుటుంబానికి డ‌బ్బులు అవ‌స‌రం ఉన్నాయా..? ప్రాణాలే లెక్క చేయ‌కుండా దేశం కోసం త్యాగం చేసిన వారికి ఎవ‌రి ద‌గ్గ‌రైనా డ‌బ్బులు తీసుకునే అవ‌స‌రం ఉందా..? అయినా ఆ కుటుంబాన్ని అవ‌మానించాల‌ని, రాజ‌కీయంగా అడ్డు తొల‌గించుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. గాంధీ కుటుంబం రాజ‌కీయాల్లో ఉన్నంత కాలం ఈ దేశం ఐక్యంగా ఉంటుంది.. ఈ దేశంలోని ద‌ళితులు, గిరిజ‌నులు, బల‌హీన వ‌ర్గాలు, మైనార్టీల‌కు గొంతుకై గాంధీ పార్టీ మాట్లాడుతుంది కాబ‌ట్టి ఆ పేద‌ల గొంతును నొక్కేయాల‌ని కుట్ర జ‌రుగుతుంది. ఈ కుట్ర‌ల‌ను అర్థం చేసుకుని తిప్పికొట్టాల్సిన బాధ్య‌త జిల్లా పార్టీ అధ్య‌క్షులుగా మీ మీద బాధ్య‌త ఉన్న‌ది. ప్ర‌భుత్వంగా సంక్షేమం అభివృద్ధి విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్ర‌వ‌రి 21, 2026న వికారాబాద్ జిల్లాలోని హ‌రిత వ్యాలీ రిసార్ట్‌లో తెలంగాణ‌, ఏపీ డీసీసీ అధ్య‌క్షుల ప్ర‌త్యేక శిక్ష‌ణా శిబిరంలో సీఎం రేవంత్ రెడ్డి పై వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement