Road Accident | త్రినేత్ర.న్యూస్ : సంగారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి-65పై కోహీర్ సమీపంలో ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మంటలు చెలరేగుతాయని భావించిన ప్రయాణికులు.. బస్సు ఎమర్జెన్సీ అద్దాలను పగులగొట్టి బయటకు దూకారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు, పోలీసులు కలిసి ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు సురక్షితంగా తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చింతా ఘాట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన పంట పొలాల్లో బోల్తా పడింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారందరిని చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.