త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AB Cables for Oil Palm Farmers | ఆయిల్‌పామ్ రైతులకు ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయాలి

AB Cables for Oil Palm Farmers | ఆయిల్‌పామ్ రైతుల (Oil Palm Farmers) కోసం ఏబీ కేబుల్స్ (AB Cables)  ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar Rao) సూచించారు.

S

Telangana | Published On Nov 22, 2026, 5.44 pm IST

AB Cables for Oil Palm Farmers | ఆయిల్‌పామ్ రైతులకు ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయాలి
Advertisement
  • ఎక‌రాలో 20 మొక్క‌లు నాట‌లేక‌పోతున్నారు
  • భూమిని వినియోగించుకోలేక ఆదాయం కోల్పోతున్నారు
  • సీఎం, డిప్యూటీ సీఎంకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్ర‌తిపాద‌న‌

AB Cables for Oil Palm Farmers | త్రినేత్ర న్యూస్: ఆయిల్‌పామ్ రైతుల (Oil Palm Farmers) కోసం ఏబీ కేబుల్స్ (AB Cables)  ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar Rao) సూచించారు. ఈమేర‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టికి ప్ర‌తిపాదించారు. విద్యుత్ లైన్ల సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు సాగు భూమిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా కీలక సూచ‌న‌లు చేశారు. ఆయిల్‌పామ్ తోటల మధ్య నుంచి వెళ్తున్న బహిరంగ విద్యుత్ తీగల స్థానంలో సాంకేతికంగా సాధ్యమైన ప్రాంతాల్లో ఏరియల్ బంచ్డ్ కేబుల్స్ ఏర్పాటు చేయాల‌న్నారు.

92 వేల మంది రైతుల సాగు

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. 2020-21లో 46 వేల ఎకరాలకే పరిమితమైన సాగు 2026, అక్టోబర్ నాటికి 3.37 లక్షల ఎకరాలకు చేరింది. ప్రస్తుతం 92 వేల మందికి పైగా రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. రానున్న రోజుల్లో 10 లక్షల ఎకరాలకు సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆయిల్ సంవత్సరంలో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ 4.74 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్‌పామ్ గెలలను సేకరించి రైతులకు సుమారు రూ.1,100 కోట్లు చెల్లించింది. సాగు విస్తరణతో పాటు ప్రతి ఎకరం నుంచి రైతులకు గరిష్ఠ దిగుబడి, ఆదాయం అందేలా మౌలిక సమస్యలను పరిష్కరించాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యం.

50 మొక్క‌లు నాటాల్సి ఉండ‌గా..

సాధారణంగా ఎకరా ఆయిల్‌పామ్ తోటలో 50 మొక్కలు నాటుతారు. అయితే తోటల మధ్య నుంచి వెళ్లే 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్ లైన్లకు భద్రతా దూరాలు పాటించాల్సి రావడంతో కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 మొక్కల వరకు నాటలేకపోతున్నారు. దీనివల్ల రైతులు భూమిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక ఆదాయం కోల్పోతున్నారు.

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌లో నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్య తీవ్రత వెల్లడైంది. నాలుగున్నర ఎకరాల ఆయిల్‌పామ్ తోట మధ్య నుంచి 150 మీటర్ల మేర 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుండటంతో 20 మొక్కలు నాటలేని పరిస్థితి ఉంది. ఈ మొక్కల ద్వారా 35 ఏళ్ల పంట జీవితకాలంలో సుమారు రూ.27.45 లక్షల స్థూల ఆదాయం పొందే అవకాశం ఉండగా, ప్రస్తుత విలువ రూ.9.82 లక్షలుగా అంచనా వేశారు. అదే విద్యుత్ లైన్‌ను ఏబీ కేబుల్‌గా మార్చేందుకు అయ్యే వ్యయం కేవలం రూ.1.45 లక్షలే.

ముప్పు త‌గ్గొచ్చు

ఆయిల్‌పామ్ చెట్లు పెరిగిన తర్వాత ఆకులు విద్యుత్ తీగలకు తగలడంతో సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గెలల కోత సమయంలో పొడవైన పరికరాలు ఉపయోగించే కార్మికులకు విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏబీ కేబుల్స్ ఏర్పాటు ద్వారా షార్ట్‌సర్క్యూట్లు, విద్యుత్ అంతరాయాలు, అగ్ని ప్రమాదాల ముప్పును తగ్గించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యుత్ స్తంభాలను తొలగించి లైన్లను పొలాల సరిహద్దులకు మార్చాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. కొత్త స్తంభాల ఏర్పాటు, భూ సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న స్తంభాలపైనే తగిన ప్రమాణాలతో ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయడం తక్కువ వ్యయంతో కూడిన ప్రత్యామ్నాయమని సూచించారు.

అదనపు భారం పడకుండా

ఏబీ కేబుల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ అందించే అవకాశాన్ని పరిశీలించాలని తుమ్మల కోరారు. సబ్సిడీ సాధ్యం కాకపోతే డిస్కంలకు చెల్లించాల్సిన సంబంధిత ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. డిస్కంల అనుమతితో లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించుకునే రైతులకు సుమారు 10 శాతం పర్యవేక్షణ ఛార్జీలు, డిస్కంల ద్వారా పనులు చేపట్టినప్పుడు సుమారు 20 శాతం అంచనా సంబంధిత ఛార్జీలను మినహాయించే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. నాణ్యమైన ఏబీ కేబుల్స్‌ను రైతులు మార్కెట్‌లో కొనుగోలు చేయడం కష్టంగా ఉన్నందున, డిస్కంల స్టోర్ల ద్వారా నిర్ణీత ధరలకు సరఫరా చేసే విధానాన్ని తీసుకురావాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్‌పామ్ తోటల గుండా వెళ్తున్న 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్ లైన్లను విద్యుత్, ఉద్యాన శాఖలు సంయుక్తంగా గుర్తించి సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి కోరారు. విద్యుత్ భద్రతా ప్రమాణాలు, అవసరమైన క్లియరెన్సులకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఆయిల్‌పామ్ రైతులకు అదనపు మొక్కలు నాటుకునే అవకాశం కలగడంతో పాటు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం లభించనుంది. విద్యుత్ ప్రమాదాల నివారణకు, సాగు భూమి పూర్తిస్థాయి వినియోగానికి ఈ చర్య దోహదపడనుంది.

Advertisement
Advertisement