త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలి: కవిత

Kavitha | భూమిని నమ్ముకొని బ‌తికే రైతుల దగ్గర నుంచి భూమిని లాక్కొని బ‌తుకు దెరువు లేకుండా చేస్తున్నార‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన (TRS) అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) విమ‌ర్శించారు. ఫార్మా సిటీ (Pharma City) భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

G

Telangana | Published On May 7, 2026, 3.42 pm IST

Kavitha | ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలి: కవిత
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: భూమిని నమ్ముకొని బ‌తికే రైతుల దగ్గర నుంచి భూమిని లాక్కొని బ‌తుకు దెరువు లేకుండా చేస్తున్నార‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన (TRS) అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) విమ‌ర్శించారు. ఫార్మా సిటీ (Pharma City) భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీ (Future City) పేరుతో బలవంతపు భూసేకరణ సరికాద‌న్నారు. ఫార్మాసిటీ రైతులకు న్యాయం జరిగే వరకు ముందుండి పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల పంట కొనుగోలు చేయకుండా ఉండేందుకు మంత్రుల కమిటీ వేసిన దుర్మార్గపు ప్రభుత్వ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. హైద‌రాబాద్ బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఫార్మా సిటీ బాధిత రైతులతో జ‌రిగిన‌ అఖిలపక్ష సమావేశంలో క‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడున్న ప్రభుత్వాలు కనీసం ప్రజలకు నిజం కూడా చెప్పడం లేద‌న్నారు. మన మొదటి ప్రశ్న ప్రభుత్వాలు నిజాలు చెబుతున్నాయా, లేదా అని విమ‌ర్శించారు. ఎందుకంటే మొన్న జరిగిన కేబినేట్ సమావేశంలో రైతులు పండించే పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి అన్నార‌ని గుర్తుచేశారు. ఇది ఇన్ సైడర్ ఇన్ఫర్మేషన్. కానీ దీని గురించి ఏ మీడియా రాయలేద‌న్నారు. ప్రభుత్వం ధైర్యంగా ప్రజలకు నిజం చెప్పలేద‌ని విమ‌ర్శించారు.

`ముగ్గురు మంత్రులతో మాత్రం ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ ఈ ఏడాది మాత్రం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంటే వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. అటు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పల మీదనే రైతులు చనిపోతున్నారు. దాని మీద కూడా మనం ఏం పోరాటం చేయటం లేదు. మీటింగ్ లు మాత్రమే పెట్టుకుంటున్నాం.

ప్రజలకు నిజం చెప్పే పరిస్థితిలో లేదు

ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fees Reimbursement) విషయంలో కూడా ఇలాగే ఒక జీవో ఇచ్చారు. దాని గురించి తెలుసుకొని మనం ఉద్యమించే లోపే నిర్ణయాలు చేసేస్తున్నారు. అంటే ప్రభుత్వం తన ప్రజలతో కనీసం నిజం చెప్పే పరిస్థితిలో కూడా లేదు. ప్రస్తుతం ఏ వ్యక్తి, ఏ పార్టీ ఏ రంగులో ఉందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కానీ అందరూ కూడా ఒకే వేదిక పై వచ్చి చేరుతున్నారు. కానీ ఏ పార్టీ ఎలా పోరాటం చేస్తుందో మాకు సంబంధం లేదు. కానీ మేము మాత్రం ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి అనే విధానంతో ఉన్నాం. మరి పరిష్కారం అంటే ఏ విధంగా చేయాలి?.

ఇటీవల వెలుగుమట్లలో (Velugumatla) మేము బాధితుల సమస్యకు పరిష్కారం వచ్చే వరకు అక్కడే కూర్చున్నాం. దాంతో జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దిగి వచ్చారు. ఇళ్లు కూల్చిన బాధితుల్లో దాదాపు సగానికి పైగా వారికి న్యాయం చేస్తామని చెప్పారు. అంటే మనం జిద్దు గా ఉండాల్సిందే. మంచి మాటకు వినే ప్రభుత్వాలు లేవు. గత ప్రభుత్వం కూడా నిసిగ్గుగా ఇదే విధంగా అబద్దాలు చెప్పింది. ఫార్మా సిటీ కోసం మొత్తం 13 వేల 5 వందల ఎకరాలు సేకరించామని చెప్పింది. కానీ అందులో కుందుకూరు మండలంలో 3500, యాచారం లో 6500 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకున్నారు. రైతులు మేము పట్టా భూములను ఇవ్వమని చెప్పినప్పటికీ బలవంతంగా వారి భూముల తీసుకునే ప్రయత్నం చేశారు. కోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా అబద్దాలు చెబుతూ ముందుకు వెళ్లే కుట్ర చేశారు.

ప్రభుత్వానికి అలుసైంది..

ఇప్పుడు అదే అబద్దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెబుతోంది. కోర్టు స్టే ఉన్నప్పటికీ మనం ఏమీ చేయకపోయే సరికి ప్రభుత్వానికి అలుసైంది. రావిలాలలోని గ్రీన్ ఫీల్డ్ లో కోర్టు స్టే ఉన్నప్పటికీ ఒక ప్రైవేట్ కంపెనీ పనులు ప్రారంభించింది. అంటే మనం గట్టిగా పోరాటం చేయకపోయే సరికి వాళ్లు ఇలా చేస్తున్నారు. ఫార్మా సిటీకి 13 వేల 5 వందల ఎకరాలు అని మొదట చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం 30 వేల ఎకరాలు అంటోంది. భూమి సేకరించి మా పేదవాళ్లకు ఏమీ చేస్తారన్నది చెప్పటం లేదు?. పొలుష్యన్ సంగతి చెప్పటం లేదు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పటం లేదు?. సేకరించిన భూమిని బిట్లుగా చేసి పెద్ద కంపెనీలకు ఇస్తారంటా?.

ప్యూచర్ సిటీలో 6 లక్షల కోట్ల ఎంవోయూ లు జరిగాయంటూ చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క కంపెనీ పనులు మొదలుపెట్టలేదు. ఇక్కడకు డేటా సెంటర్లు వస్తున్నాయని చెబుతున్నారు. కానీ వాటి వల్ల ఎంతో పొలుష్యన్ ఉంటుంది. డేటా సెంటర్ల ద్వారా పెద్ద శబ్దాలు వస్తాయి. అందుకే అమెరికాలో డేటా సెంటర్లను పెట్టేందుకు అనుమతించటం లేదు. అలాంటి డేటా సెంటర్లను మన వద్ద పెడుతారంట. వాటి కారణంగా ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరు అంచనా వేయలేదు. రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్లకు 8 లక్షలు ఇస్తే...వారి బతుకుదెరువు సంగతేంటీ?

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 31 ని రద్దు చేస్తామని చెప్పింది. కోర్టులో ఫార్మా సిటీనే కొనసాగిస్తామని సీఎం చెబుతున్నాడు. బయట మాత్రం మళ్లీ ఫ్యూచర్ సిటీ పేరుతో నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వాలకు నిజం చెప్పే ధైర్యం లేదని నేను అంటున్నా. ప్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం ముందు అక్కడి ప్రజలతో మాట్లాడాలి. భూసేకరణలో కూడా చాలా వివక్ష కొనసాగుతున్న‌ది.

మొండి ప్రభుత్వాలు..

కురిమెట్లలో భూస్వాముల భూముల జోలికి వెళ్లలేదు. వారికి 16 వందల ఎకరాలు ఉంటే వారి జోలికి వెళ్లలేదు. కానీ గిరిజనుల దగ్గర 350 ఎకరాలు తీసుకున్నారు. ఆ గిరిజనులు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. వారికి తెలంగాణ రక్షణ సేన మద్దతుగా ఉంటుంది. ఫార్మా సిటీ భూముల విషయంలో ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి. ఈ మొండి ప్రభుత్వాలకు తగినట్లుగా మనం జగమొండిగా ఉండాలి. మనకు కచ్చితంగా పోరాటమే శరణ్యం, ఈ పోరాటంలో నేను ముందుంట. సమస్య పరిష్కారమయ్యే వరకు ఏం చేద్దామో మీరంతా ఆలోచించి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు, ఉద్యమకారులకు కూడా నష్టం జరిగింది. ఆ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ చెబుతున్నా.

ప్యూచర్ సిటీలో బుల్లెట్ ట్రైన్ వస్తుందంటూ చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కూడా బుల్లెట్ ట్రైన్ రాలేదు. ఈ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ విషయంలో కూడా మనకు అబద్దం చెబుతోంది. ప్యూచర్ సిటీ కారణంగా కోర్ హైదరాబాద్ సిటీ డల్ అయ్యే పరిస్థితి ఉంది. ఫార్మాసిటీ భూముల విషయంలో రైతులకు మేలు జరిగే వరకు పోరాటం చేయటంలో మేము ముందుంటాం.` అని క‌విత చెప్పారు.

Advertisement
Advertisement