Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం
Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్లను ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి ఆటో డెబిట్ విధానంలో నేరుగా వసూలు చేయాలన్న ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రజల మౌలిక హక్కులపై ఇది నేరుగా దాడి చేయడమేనని విమర్శించారు. ట్రాఫిక్ నిబంధనల అమలు ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ.. చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కనపెట్టి ప్రజల బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సమర్థనీయం కాదన్నారు.
- ప్రజల మౌలిక హక్కులపై నేరుగా దాడి చేయడమే
- ట్రాఫిక్ చలాన్ నేర నిర్ధారణ కాదు.. ఆరోపణ మాత్రమే
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్
Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్లను ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి ఆటో డెబిట్ విధానంలో నేరుగా వసూలు చేయాలన్న ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రజల మౌలిక హక్కులపై ఇది నేరుగా దాడి చేయడమేనని విమర్శించారు. ట్రాఫిక్ నిబంధనల అమలు ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ.. చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కనపెట్టి ప్రజల బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సమర్థనీయం కాదన్నారు. ట్రాఫిక్ చలాన్ అనేది నేర నిర్ధారణ కాదని, కేవలం ఒక ఆరోపణ (Notice of Allegation) మాత్రమేనని శ్రవణ్ పేర్కొన్నారు. చలాన్ అందుకున్న ప్రతి పౌరుడికి వివరణ ఇచ్చే హక్కు, అప్పీల్ చేసుకునే హక్కు, కోర్టును ఆశ్రయించే హక్కు ఉన్నాయని తెలిపారు. ఆటో డెబిట్ విధానం ఈ హక్కులన్నింటినీ హరిస్తూ.. నేరం రుజువు కాకముందే శిక్ష విధించినట్లుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ హక్కులకు విఘాతం
ఈ ప్రతిపాదన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300ఏ కింద ఉన్న హక్కులకు విరుద్ధమని శ్రవణ్ అన్నారు. ప్రజల బ్యాంకు ఖాతాల్లోని డబ్బు వారి వ్యక్తిగత ఆస్తి అని పేర్కొన్నారు. కోర్టు ఆదేశం లేకుండా, స్పష్టమైన చట్టబద్ధ అధికారం లేకుండా ప్రభుత్వం ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమేనని అన్నారు. ఆర్‌బీఐ నిబంధనలు, బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఖాతాదారుడి స్పష్టమైన అనుమతి లేదా కోర్టు ఆదేశం లేకుండా బ్యాంకు ఖాతా నుంచి డబ్బును డెబిట్ చేయడం అక్రమమని శ్రవణ్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం చట్టపరంగా సాధ్యం కాదని అన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు.
గోప్యత హక్కుకు భంగం
సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ప్రకారం గోప్యత హక్కు ఒక మౌలిక హక్కు అని శ్రవణ్ తెలిపారు. ట్రాఫిక్ చలాన్ల పేరిట ప్రజల బ్యాంకు ఖాతా వివరాలను వినియోగించడం అవసరం లేని, అసమంజసమైన జోక్యంగా మారుతుందని అన్నారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 200 ప్రకారం చలాన్ చెల్లించాలా? లేదా కోర్టును ఆశ్రయించాలా? అన్న ఎంపిక హక్కు పౌరుడిదేనని పేర్కొన్నారు. ఆటో డెబిట్ విధానం ఈ ఎంపికను పూర్తిగా హరిస్తుందని అన్నారు.
‘లైసెన్స్‌డ్ ఎక్స్‌టార్షన్’గా మారే ప్రమాదం
ప్రభుత్వం ప్రజల సంపదను కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉండాలి కానీ.. ప్రజల బ్యాంకు ఖాతాలను లక్ష్యంగా చేసుకుని వసూళ్ల యంత్రాంగంగా మారకూడదని శ్రవణ్ అన్నారు. ట్రాఫిక్ చలాన్ల పేరిట ఆటో డెబిట్ విధానం అమలైతే అది లైసెన్సెడ్ ఎక్స్‌టోరేషన్ (Licensed Extortion)గా మారే తీవ్రమైన ప్రమాదం ఉందని హెచ్చరించారు. ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య, చట్టబద్ధ విధానాలను మాత్రమే అనుసరించాలని.. ప్రజల మౌలిక హక్కులు, గోప్యత, ఆస్తి హక్కులను గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
- ●Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం
- ●Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు
- ●Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి
- ●Accident in America | అమెరికాలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..

Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం

Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు

Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..




