త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి

Dasoju Sravan Kumar | 2027 జాతీయ జనగణనలో కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. ప్రశ్నావళిలోని 10వ ప్రశ్నను సవరించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ కేటగిరీని స్పష్టంగా చేర్చి, ఓసీలు, ఓబీసీలతో సహా సమగ్ర కులాల జాబితా, శాస్త్రీయ డ్రాప్‌డౌన్‌ కోడింగ్‌ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

P

Telangana | Published On Aug 26, 2026, 4.04 pm IST

Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి
Advertisement
  • డ్రాప్‌డౌన్‌ కోడింగ్‌ విధానాన్ని అమలు చేయాలి
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేఖ‌

Dasoju Sravan Kumar | 2027 జాతీయ జనగణనలో కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. ప్రశ్నావళిలోని 10వ ప్రశ్నను సవరించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ కేటగిరీని స్పష్టంగా చేర్చి, ఓసీలు, ఓబీసీలతో సహా సమగ్ర కులాల జాబితా, శాస్త్రీయ డ్రాప్‌డౌన్‌ కోడింగ్‌ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆగస్టు 14న విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని 10వ ప్రశ్నను ఆయన ప్రస్తావించారు. ‘షెడ్యూల్డ్‌ కాస్ట్‌/షెడ్యూల్డ్‌ ట్రైబ్‌/కాస్ట్‌’గా ప్రశ్నను రూపొందించడం వల్ల దేశంలోని ఓబీసీల కచ్చితమైన గణనపై అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఓబీసీ కేటగిరీని ప్రత్యేకంగా చేర్చకుండా ఓపెన్‌ ఎండెడ్‌ విధానంలో కుల వివరాలు సేకరిస్తే భవిష్యత్తులో డేటా గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రాల వారీగా జాబితా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఇప్పటికే ఉన్న అధికారిక ఓబీసీ/బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జాబితాలను ప్రామాణికంగా సిద్ధం చేసి ఎన్యూమరేటర్లకు అందించాలని దాసోజు శ్రవణ్‌ కోరారు. కులాల వివరాల నమోదుకు డిజిటల్‌ డ్రాప్‌డౌన్‌, ప్రామాణిక కోడింగ్‌ విధానాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రాంతీయ మాండలికాలు, పర్యాయపదాలు, ఇంటిపేర్లు, ఉపకులాల విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. కుల గణన కోసం గతంలో యూపీఏ హయాంలో ఖర్చు చేసిన రూ.4,893 కోట్ల ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్న శ్రవణ్‌.. ప్రస్తుతం కుల గణనకు కేటాయిస్తున్న రూ.11,718 కోట్ల భారీ నిధులు కూడా సరైన డేటా రాకపోతే నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఓబీసీల న్యాయమైన వాటాను అణచివేసేలా డేటా గందరగోళంగా మారకూడదని స్పష్టం చేశారు.

అఫిడ‌విట్‌కు విరుద్ధంగా..

2021లో కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌కు విరుద్ధంగా ప్రస్తుత విధానం ఉండకూడదని లేఖలో పేర్కొన్నారు. గణన ప్రారంభానికి ముందే వర్గీకరణ నిబంధనలను బహిరంగపరచడంతో పాటు ఎన్యూమరేటర్లకు సమగ్ర సాంకేతిక శిక్షణ ఇవ్వాలని కోరారు. విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం తదితర రంగాల్లో సామాజిక న్యాయం అందించేందుకు కచ్చితమైన కుల గణాంకాలు అవసరమని దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి కులం వాస్తవ జనాభా శాస్త్రీయంగా వెల్లడయ్యేలా 2027 జనగణనను నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement