త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాంగ్రెస్‌ వైఫల్యానికి నాగార్జునసాగర్‌ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హ‌రీశ్‌రావు

Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యానికి ఏపీ వైపు నిండుగా పారుతున్న నాగార్జునసాగర్‌ కుడి కాలువ నీళ్లే సాక్ష్యమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. కేఆర్ఎంబీ అంటే లెక్క లేదని.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదని.. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే ఏపీకి పట్టింపు లేదని విమర్శించారు.

P

Telangana | Published On Aug 26, 2026, 4.41 pm IST

Harish Rao | కాంగ్రెస్‌ వైఫల్యానికి నాగార్జునసాగర్‌ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యానికి ఏపీ వైపు నిండుగా పారుతున్న నాగార్జునసాగర్‌ కుడి కాలువ నీళ్లే సాక్ష్యమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. కేఆర్ఎంబీ అంటే లెక్క లేదని.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదని.. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే ఏపీకి పట్టింపు లేదని విమర్శించారు. చేతగాని సీఎం ఉంటే ఒక రాష్ట్రం ఎలా నష్టపోతుందో కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని అన్నారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపై మరోసారి ఏపీ అధికారులు దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న సాగర్‌ డ్యామ్‌ నుంచి కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఏపీ వైపు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడం దౌర్జన్యం కాదా? అని ప్రశ్నించారు.

అనుమతులు లేకుండానే తరలింపా?

ఏపీ 47 టీఎంసీల నీటిని కోరిందని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశమే వాయిదా పడిందని హరీశ్‌రావు తెలిపారు. నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం రాకముందే ఏపీ అధికారులు నీటిని తరలించడం ఏమిటని ప్రశ్నించారు. కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా నీటిని తీసుకెళ్లేంత ధైర్యం ఏపీ అధికారులకు ఎలా వచ్చిందని నిలదీశారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా నీటిని తరలించే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన హరీశ్‌రావు.. అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ ఎందుకు మౌనంగా ఉంటోందని నిలదీశారు. అసలు ఇంత జరుగుతుంటే తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

వెలిగొండకు 11 టీఎంసీలు..

ఒకవైపు శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్‌ ద్వారా 11 టీఎంసీల నీటిని తరలించారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పుడు నాగార్జునసాగర్‌ కుడి కాల్వ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలా ఇష్టారీతిన నీటిని తరలించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే గత రెండేళ్లుగా కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటాను సైతం వినియోగించుకోలేక మన నీళ్లను ఏపీకి ధారాదత్తం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ నీటి వినియోగం చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఈ ఏడాది కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

రేవంత్‌రెడ్డి మౌనం శాపం

తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను కాపాడాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కేఆర్ఎంబీని లెక్కచేయకుండా, త్రిసభ్య కమిటీని పట్టించుకోకుండా ఏపీ వ్యవహరిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మౌనం తెలంగాణ తాగు, సాగునీటి ప్రయోజనాలకు శాపంగా మారుతోందని హరీశ్‌రావు అన్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే తెలంగాణ ప్రజల ముందు చరిత్రహీనుడిగా మిగిలిపోతావని హెచ్చరించారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటినీ కాపాడాలని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్న ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు.

కిషన్‌రెడ్డికి బాధ్య‌త లేదా?

కిషన్‌ రెడ్డి గారు.. కేంద్ర మంత్రిగా తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఏపీ నీటి అక్రమ తరలింపు విషయంలో కేఆర్ఎంబీపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement