Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎంకు ఉందా..?
Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి ఉందా? అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కమిటీల పేరుతో ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- కమిటీల పేరుతో ప్రతిపక్ష సభ్యులకు వేధింపులు
- కడియంనుద్దేశించి మీది ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి అన్నడు
- మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
- రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపాటు
Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి ఉందా? అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కమిటీల పేరుతో ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడి కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన సమయంలో అసలు ఎథిక్స్ కమిటీనే లేదని అన్నారు. ‘‘ఆ రోజు పాడి కౌశిక్‌రెడ్డి పక్కనే అసెంబ్లీలో ఉన్నా. కడియం శ్రీహరిని ఉద్దేశించి ‘మీది ఏ పార్టీ?’ అని మాత్రమే కౌశిక్‌రెడ్డి అన్నారు. కడియం శ్రీహరిని ఏదో అన్నారని దుష్ప్రచారం చేసి కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించిన తీరును ఖండిస్తున్నాం. కేవలం ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకునేందుకే ఎథిక్స్ కమిటీ ఉందా?’’ అని ప్రశ్నించారు.
అధికార పక్షంపైనా చర్యలు తీసుకోవాలి
అసెంబ్లీలో అధికారపక్ష సభ్యుల వ్యాఖ్యలు, ప్రవర్తనపైనా ఎథిక్స్ కమిటీ దృష్టి పెట్టాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘దానం నాగేందర్ నిండు శాసనసభలో సహచర సభ్యుడి తోలు తీస్తా, హైదరాబాద్‌లో ఎట్లా తిరుగుతారో చూస్తా అన్నాడు. ఎథిక్స్ కమిటీకి అది కనిపించలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కత్తుల కోలాటం చేస్తామన్నారు. ఆయన ప్రవర్తన ఎథిక్స్ కమిటీకి కనిపించలేదా?’’ అని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్, షాద్‌నగర్ శంకరయ్య, వేముల వీరేశం అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం సభలో అనేకసార్లు అనుచిత పదాలు ఉపయోగించారని విమర్శించారు. ‘‘జూబ్లీ బస్‌స్టేషన్‌లో బిచ్చమెత్తుకోవాలి అని సీఎం సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం మాటలు ఎథిక్స్ కమిటీకి కనిపించలేవా?’’ అని ప్రశ్నించారు.
ముందుగా సీఎంనే పిలవాలి
‘‘ముందుగా సీఎం రేవంత్‌రెడ్డినే ఎథిక్స్ కమిటీ పిలిచి వివరణ కోరాలి. సీఎంను పిలిచిన తర్వాతే కౌశిక్‌రెడ్డిని ఎథిక్స్ కమిటీ విచారించాలి. పాలక పక్షానికి ఓ న్యాయం.. ప్రతిపక్షానికి ఓ న్యాయమా? ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారకూడదు’’ అని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ప్రతిపక్ష సభ్యులపై ఎథిక్స్ కమిటీ ద్వారా చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తాము లేవనెత్తిన అంశాలన్నింటినీ కమిటీ కచ్చితంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.
ఆరోపణలపై విచారణకు సిద్ధమా?
కాంగ్రెస్ నేతలు చేసిన అవినీతి ఆరోపణలపైనా విచారణ జరిపించే ధైర్యం సీఎం రేవంత్‌రెడ్డికి ఉందా అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘అవినీతిపై రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారణ కమిషన్ వేసే ధైర్యం రేవంత్‌రెడ్డికి ఉందా? కొండా సుస్మిత రేవంత్ సోదరుడి షెల్ కంపెనీ గురించి మాట్లాడారు. దానిపై ఏసీబీ విచారణ చేసే దమ్ము రేవంత్‌కు ఉందా?’’ అని ప్రశ్నించారు. చిన్నారెడ్డి మేఘారెడ్డి టికెట్ కోసం లంచం ఇచ్చారని ఆరోపించారని, ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్‌రెడ్డి హైకమాండ్‌కు కోట్లు ముట్టజెప్పారని కోమటిరెడ్డి ఆరోపించారని, దమ్ముంటే దీనిపై విచారణ కమిషన్ వేసుకోవాలని సవాల్ చేశారు. అనిరుద్‌రెడ్డి బిల్లుల చెల్లింపునకు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారని, దానిపైనా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
సీఎం సోదరులపై విచారణ చేయించాలి..
‘‘ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో దందాలు చేస్తున్న సీఎం సోదరులపై విచారణ చేయించాలి. 22ఏ పేరు మీద బ్రోకర్ల అవతారమెత్తి ప్రజలను లంచాలతో పీడిస్తున్న వారిపై విచారణ చేయాలి. హైడ్రా పేరు మీద పేదల ఇళ్లపై ప్రతాపం చూపుతున్నారు. దానిపైనా విచారణ చేయాలి’’ అని అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి నైతికత గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. దేవుళ్లపై ఒట్లు పెట్టి రైతు రుణమాఫీ పూర్తి చేయలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలోనూ మాట తప్పారని విమర్శించారు.
29న కమిటీ సమావేశానికి హాజరవుతా..
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేసేందుకే కౌశిక్‌రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీలో చర్చకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ‘‘సంస్కరణలు అనేవి మన ఇంటి నుంచే మొదలు కావాలి. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముందు విచారణకు పిలిచిన తర్వాతే పాడి కౌశిక్‌రెడ్డిని పిలవాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ సమావేశానికి హాజరవుతామని, సీఎం, మంత్రులను ముందుగా విచారణకు పిలవాలని కోరుతామని తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కే సంజయ్, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: కొండా మురళి
ఆగస్టు 26, 2026

Harish Rao | మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి
ఆగస్టు 26, 2026

IMA Advisory | దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు.. కీలక అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ..!
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: కొండా మురళి
- ●Konda Surekha Resignation | కొండా సురేఖ వ్యవహారం : మీరే చూసుకోండి.. అంతా భట్టికే వదిలేసిన హైకమాండ్
- ●Onam 2026 | ఓనం స్పెషల్.. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన తారలు
- ●Harish Rao | మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి
- ●TMC MPs | 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నోటీసులు
- ●IMA Advisory | దేశవ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు.. కీలక అడ్వైజరీ జారీ చేసిన ఐఎంఏ..!

Konda Murali | కాంగ్రెస్‌ను వీడం.. నా బిడ్డ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: కొండా మురళి

Konda Surekha Resignation | కొండా సురేఖ వ్యవహారం : మీరే చూసుకోండి.. అంతా భట్టికే వదిలేసిన హైకమాండ్

Onam 2026 | ఓనం స్పెషల్.. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన తారలు

Harish Rao | మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి



