త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Methuku Anand | ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది: మెతుకు ఆనంద్‌

Methuku Anand | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు (Midnight Arrests of Journalists) చేస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంద‌ని మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ఆరోపించారు.

A

Telangana | Published On Jan 14, 2026, 2.49 pm IST

Methuku Anand | ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది: మెతుకు ఆనంద్‌
Advertisement

Methuku Anand | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు (Midnight Arrests of Journalists) చేస్తూ, జ‌ర్న‌లిస్టుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంద‌ని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ఆరోపించారు. అంద‌రూ పండుగ చేసుకునే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌న‌కు తాను క్లీన్ చిట్ ఇప్పించుకునేందుకు రేవంత్ సిట్ ఏర్పాటు చేశార‌ని తీవ్రంగా మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆనంద్ మాట్లాడుతూ రేవంత్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంద‌ని విమ‌ర్శించారు. మంత్రుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నదీ, వారి మీద కథనాలు రాయిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలుసని అన్నారు. కానీ కాంగ్రెస్ హైక‌మాండ్‌కు రేవంత్ కుట్ర‌లు అర్థ‌మ‌య్యాయ‌ని చెప్పారు. అందుకే త‌నే సిట్‌ను ఏర్పాటు చేసి, దానితో క్లీన్ చిట్ పొందేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

కొడంగల్ లో ఓ కార్యకర్త ఏదో పోస్టు చేశారని ఆ కేసు ను కూడా సిట్ ప‌రిధిలో చేర్చారని ఆనంద్ ధ్వ‌జ‌మెత్తారు. సిట్ ను నీరు గార్చడమే ప్ర‌ధాన ధ్యేయంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, అస‌లు సిట్ ఏ అంశాల‌లో ఏర్పాటు చేయ‌వ‌చ్చ‌నే విష‌యం ప్ర‌భుత్వానికి తెలుసా అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేయాల్సిన అంశాలు, ఘ‌ట్టాలు చాలా ఉన్నాయ‌ని వివ‌రించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న తీరుపై సిట్ ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. హైవే కాంట్రాక్ట‌ర్‌ను మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బెదిరించార‌ని, త‌మ‌ను రూ.ఎనిమిది కోట్లు అడిగార‌ని కాంట్రాక్టు సంస్థ సంప‌త్‌కుమార్‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు కూడా చేసింద‌ని చెప్పారు. కానీ సంప‌త్‌కు భ‌య‌ప‌డి పోలీసులు త‌మ‌కు ఫిర్యాదే అందలేద‌ని అంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంపత్ వివరణ కూడా ఆయన బెదిరింపులకు పాల్పడ్డారనే నిజాన్ని బ‌హిర్గ‌తం చేసింద‌న్నారు. గ‌తంలో కూడా మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌పై అనుచితంగా వ్యాఖ్య‌లు చేసినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని చెప్పారు. చివ‌రికి కేటీఆర్ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తే త‌ప్ప కేసు న‌మోదు చేయ‌లేద‌ని ఆరోపించారు.

మంత్రుల పై కూడా అనేక ఆరోపణలు వచ్చాయని, వాటిపై ఎందుకు సిట్ ఏర్పాటు చేయ‌లేద‌ని మెతుకు ఆనంద్ ప్ర‌శ్నించారు. మంత్రులపై వస్తున్న కథనాలలో సీఎం ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయని, దీనిపై కూడా సిట్ వేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. ఆ సిట్ విచార‌ణ‌కు రేవంత్‌రెడ్డి హాజ‌రుకావాల‌ని సూచించారు. మంత్రి కొండా సురేఖ కూతురు అనేక అంశాల‌పై ఆరోప‌ణ‌లు చేసింద‌ని, వాటిపై సిట్ ఎందుకు ఏర్పాటు చేయ‌లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ములుగులో మంత్రి సీతక్క పీఏపై ఇసుక దందా ఆరోపణలు వచ్చాయని, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అనేక ఆరోప‌ణ‌లు చేసినా సిట్ ఏర్పాటు చేయ‌లేద‌న్నారు. ఉప‌ముఖ్య‌మంత్రి భట్టి విక్ర‌మార్క చాంబ‌ర్ ముందు కాంట్రాక్టర్లు కమీషన్ల ఆరోపణలతో ధర్నా చేసినా, సీఎం సోదరులపై అనేక ఆరోపణలు వచ్చినా, మ‌రో మంత్రి పొంగులేటి కొడుకుపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా సిట్ వేయ‌లేద‌ని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను వేధించ‌డం, తనకు తాను కాపాడుకోవడం కోసమే ముఖ్య‌మంత్రి సిట్‌లు ఏర్పాటు చేస్తున్నార‌ని ఆరోపించారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందంగా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.

ఇటీవ‌ల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చావు దప్పి కన్ను లొట్టబోయిందని చెప్పారు. అందుకే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లను ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం నిర్వ‌హించాల‌నుకుంటున్న మున్సిప‌ల్ ఎన్నిక‌లు పార్టీల గుర్తు మీదే జ‌రుగుతాయ‌న్నారు. అప్పుడు బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపిస్తామ‌ని స‌వాల్ చేశారు. ముఖ్యమంత్రి పిచ్చి విషయాలుపై దృష్టిపెట్ట‌డం మాని పాలన మీద దృష్టి కేంద్రీక‌రించాల‌ని హిత‌వు ప‌లికారు. వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ బుల్లెట్ రాజాగా మారారని, కమిషన్లు లేనిదే ఆయన పనులు చేయడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని చెప్పారు. ఆయ‌న ప‌రిధిలో ఒక పోలీస్ స్టేష‌న్‌లో మూడేళ్ల‌లో ముగ్గురు సీఐలు మారార‌ని పేర్కొన్నారు. స్పీక‌ర్ ఒక సామాజిక వ‌ర్గంపై క‌క్ష క‌ట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న చేస్తున్న అక్ర‌మాలు ముఖ్య‌మంత్రికి క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. స్పీక‌ర్ అక్ర‌మాల‌పై సిట్ వేయాల‌ని డిమాండ్ చేశారు.

కేసీఆర్ పథకాలు కావాలనే రేవంత్ బంద్ చేస్తున్నర‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ కిట్ అనడం ఇష్టం లేకపోతే రేవంత్ కిట్ అని పెట్టాల‌ని, దీనిని ఎవ‌రు వ‌ద్ద‌న్నార‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ నీళ్లు అంటున్నారని మిషన్ భగీరథను నిర్వీర్యం చేస్తున్నార‌ని వాపోయారు. ఉపఎన్నికల్లో గెలిచానని రేవంత్ విర్రవీగుతున్నారని, ఆయ‌న‌కు ముందుంది మొసళ్ళ పండగని అన్నారు. తాజాగా, జిల్లాల మార్పునకు కమిషన్ అంటూ కొత్త నాటకానికి తెరదీశారని, జిల్లాల‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండ‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రించారు. పోలీసులు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌పై వేధింపులు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. తాము అధికారంలోకి వ‌చ్చాక ఏం చేయాలో రేవంత్‌రెడ్డే నేర్పిస్తున్నార‌ని, వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement