త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | డ్రాఫ్ట్ ఓట‌ర్ లిస్ట్ బీఎల్ఏల వ‌ద్ద ఉండాలి.. రోజుకు 50 ఇళ్ల‌ను ప‌రిశీలించాలి

KTR | ఎన్నిక‌ల సంఘం రేపు విడుద‌ల చేయ‌నున్న డ్ర‌ఫ్ట్ ఎల‌క్టోర‌ల్ రోల్‌ను ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం, మండ‌లం, డివిజ‌న్‌, బూత్ స్థాయిల్లో అందుబాటులోకి తీసుకురావాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. 2025 ఓట‌ర్ లిస్ట్‌తో పాటు 2026 డ్రాఫ్ట్ ఓట‌ర్ లిస్ట్ బీఎల్ఏల వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌న్నారు.

S

Telangana | Published On Aug 16, 2026, 1.12 pm IST

KTR | డ్రాఫ్ట్ ఓట‌ర్ లిస్ట్ బీఎల్ఏల వ‌ద్ద ఉండాలి.. రోజుకు 50 ఇళ్ల‌ను ప‌రిశీలించాలి
Advertisement
  • ఆగ‌స్టు 18 నుంచి ఇంటింటికి వెళ్లి లిస్ట్‌ను ప‌రిశీలించాలి
  • SIR గైడ్ బుక్‌ను ప్రతి బీఎల్ఏకు చేరేలా చూడాలి
  • టెలికాన్ఫ‌రెన్స్‌లో నాయ‌కుల‌కు కేటీఆర్ దిశానిర్దేశం

త్రినేత్ర‌.న్యూస్‌: ఎన్నిక‌ల సంఘం రేపు విడుద‌ల చేయ‌నున్న డ్ర‌ఫ్ట్ ఎల‌క్టోర‌ల్ రోల్‌ను ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం, మండ‌లం, డివిజ‌న్‌, బూత్ స్థాయిల్లో అందుబాటులోకి తీసుకురావాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. 2025 ఓట‌ర్ లిస్ట్‌తో పాటు 2026 డ్రాఫ్ట్ ఓట‌ర్ లిస్ట్ బీఎల్ఏల వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌న్నారు. అవ‌స‌ర‌మైన చోట తెలంగాణ భ‌వ‌న్ నుంచి కూడా డ్రాఫ్ట్ లిస్ట్‌ల‌ను బీఎల్ఏల‌కు చేరేలా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు సంబంధిత ఎస్ఐఆర్ బృందాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని చెప్పారు. ఈమేర‌కు ఆయ‌న ఆదివారం నాయ‌కుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి ప‌లు సూచ‌న‌లు చేశారు. రోజుకు 50 ఇళ్ల‌ను ల‌క్ష్యంగా పెట్టుకొని ప‌నిచేయాల‌ని కోరారు. ఆగ‌స్టు 18 నుంచి 25 వరకు బీఎల్ఏలు ఇంటింటికి వెళ్లాలన్నారు.

  • ప్రతి ఇంటిలో ఓటు లిస్ట్‌లో ఉందా లేదా పరిశీలించాలి
  • పేరు ఉంటే సంబంధిత ఓటరుతో ధృవీకరించుకోవాలి
  • అర్హత ఉన్న వ్యక్తి ఓటు లిస్ట్‌లో లేకపోతే గుర్తించాలి
  • ఓటర్ వివరాల్లో తప్పులు ఉంటే నమోదు చేసుకోవాలి
  • డూప్లికేట్ లేదా స్థానికంగా లేని ఓట్లను గుర్తించాలి
  • SIR ప్రక్రియలో ఎదురైన అనుమానాస్ప‌ద ఓట్లు ఉంటే సంబంధిత ఓటరుకు వివరించాలి. ప్రతి BLA రోజుకు సుమారు 50 ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తే, వారం రోజుల్లో తన పరిధిలోని ఓటర్లను సమగ్రంగా కవర్ చేసే అవకాశం ఉంటుంది.

ఫామ్‌-6, 7, 8పై అవగాహ‌న ఉండాలి..

BLAలు, పార్టీ నాయకులు, సంబంధిత కార్యకర్తలకు మూడు ముఖ్య ఫామ్‌ల వినియోగంపై స్పష్టమైన అవగాహన ఉండాలి.
ఫామ్-6: కొత్త ఓటు నమోదు చేయడానికి లేదా అర్హత ఉన్న వ్యక్తి ఓటు డ్రాఫ్ట్ లిస్ట్‌లో లేకపోతే తిరిగి నమోదు కోసం.
ఫామ్-7: డూప్లికేట్‌ ఓటు, మరణించిన వ్యక్తి ఓటు లేదా సంబంధిత ప్రాంతంలో నివసించని వ్యక్తి ఓటు వంటి తొలగింపులకు సంబంధించిన అభ్యంతరాల కోసం.
ఫామ్-8: ఓటర్ పేరు, తండ్రి /భర్త పేరు, చిరునామా తదితర వివరాల్లో సవరణలు లేదా మార్పుల‌ కోసం.
ప్రతి BLA వద్ద ఈ ఫామ్‌ల‌ అవసరమైన సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలి.

అనుమానాస్ప‌ద ఓట్ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి..

SIR ప్రక్రియలో అనుమానాస్ప‌ద ఓటర్లకు సంబంధించి ఎన్నిక‌ల‌ సంఘం నుంచి నోటీసులు వస్తే, సంబంధిత ఓటర్లకు ఆ విషయం తెలియజేసి, వారు నిర్దేశిత‌ ప్రక్రియ ప్రకారం స్పందించేలా సహకరించాలి. ఈ అంశంలో BLAలకు ఎదురయ్యే సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలు అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన SIR గైడ్ బుక్‌ను ప్రతి BLAకు చేరేలా చూడాలి. గైడ్ బుక్‌లో అనుమానాస్ప‌ద ఓట్లు, సంబంధిత ప్రక్రియలు, తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు, ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8 వినియోగం తదితర అంశాల వివరాలు అందుబాటులో ఉన్నాయి.

SIRకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న బృందంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు నిరంతరం సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర స్థాయి SIR బృందం అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేందుకు అందుబాటులో ఉంటారు. ఏవైనా సందేహాలు లేదా ప్రత్యేక‌ సమస్యలు ఎదురైతే వెంటనే రాష్ట్ర స్థాయి బృందం దృష్టికి తీసుకురావాలి. డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి తుది ఓటర్ లిస్ట్ వచ్చే దశ అత్యంత కీలకం. కాబ‌ట్టి ప్రతి నియోజకవర్గం, ప్రతి బూత్ స్థాయిలో అర్హులైన ఓటర్ల పేర్లు కొనసాగుతున్నాయా లేదా అనే విషయాన్ని ముందుగానే సమగ్రంగా పరిశీలించాలి.

ఎవరెనా అర్హత ఉన్న ఓటరు పేరు లేకపోతే వెంటనే సంబంధిత ప్ర‌క్రియ‌ను ప్రారంభించాలి. అదే సమయంలో తప్పుగా ఉన్న వివరాలను సరిచేయడం, డూప్లికేట్ లేదా అర్హత లేని ఎంట్రీల‌ను గుర్తించడం వంటి అంశాల‌పై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలి.

అందరూ అప్రమత్తంగా ఉండాలి..

గత నెలన్నరగా SIR ప్రక్రియలో BLAలు చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇప్పుడు చివరి దశలో మరింత సమన్వయంతో పనిచేయాల్సిన‌ అవసరం ఉంది. ఆగస్టు 18 నుంచి 25 వరకు ప్రతి BLA తనకు కేటాయించిన పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ లిస్ట్‌ను పరిశీలించేలా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల, స్థానిక నాయకులు సమన్వయం చేయాలి. అందరూ సమన్వయంతో, క్రమబద్ధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి, ఎదురైన స‌మస్యలను వెంటనే రాష్ట్ర స్థాయి బృందం దృష్టికి తీసుకురావాలి అని కేటీఆర్ సూచించారు.

Advertisement
Advertisement