Srinivas Goud | ఎన్నికలపుడే సీఎంకు సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి: శ్రీనివాస్‌గౌడ్
Srinivas Goud | ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి సంక్షేమ పథకాలు గుర్తుకువస్తాయని మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ మళ్లీ చీరలు పంచడం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు
తెలంగాణకు దైవం కేసీఆర్
ఆయన పాలనలోనే పాలమూరులో పరిస్థితులు మారాయి
దమ్ముంటే మంత్రులు అశోక్‌నగర్ లైబ్రెరీని సందర్శించాలి
విలేకరుల సమావేశంలో మండిపడిన మాజీ మంత్రి
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్ : ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి సంక్షేమ పథకాలు గుర్తుకువస్తాయని మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో శనివారం పర్యటించిన రేవంత్ మాట్లాడిన తీరు ఎన్నికల్లో మాట్లాడినట్లుగానే ఉందని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ మళ్లీ చీరలు పంచడం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు సరిగా రాకపోయేసరికి బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర పొగడ్తలే దీనిని స్పష్టంగా సూచిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తన తండ్రి చనిపోతే స్నానానికి నీళ్లు లేవని కరెంటోళ్లకు చెప్పి అరగంట మోటర్ ఆన్ చేసుకున్నామని రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో ఆ పరిస్థితి ఉందా చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలోనే పాలమూరులో పరిస్థితులు మారాయని చెప్పారు. శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకాదని మండిపడ్డారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా కింద ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచింది కేసీఆరేనని స్పష్టం చేశారు. కేసీఆర్ తెచ్చిన పంపులు, కట్టిన కాలువలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ కాదా ?, తెలంగాణ కు దైవం కేసీఆర్. ఆయన తెలంగాణ తేకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా ? మంచి అవకాశం వస్తే దాన్ని దుర్వినియోగం చేస్తావా ? నడుం విరగ్గొట్టి పడుకోబెట్టా అని నీచంగా మాట్లాడుతావా ? హరీష్ రావు, కేటీఆర్‌లను మారీచుడు, సుబాహుడు అంటావా? నువ్వు ఏం చేశావని వాళ్ళు అడ్డుపడ్డారు ? కాలువలు తొవ్వుతానంటే అడ్డుపడ్డారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము మాట్లాడితేనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్‌కు మారిందని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. జూరాలలో కిలో మీటర్ వరకు కూడా నీళ్లు లేవని అన్నారు. అదే శ్రీశైలం నుంచి జూరాల దాకా వందకిలోమీటర్ల మేర నీళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. మేధావులు కూడా నోరు విప్పాలని కోరారు. జూరాలలో నీళ్లు ఉంటే క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడారని గుర్తు చేశారు. మరి పదేళ్ల లో జాతీయ హోదా ఎందుకు సాధించలేదని, ఇప్పటికైనా జాతీయ హోదా తెచ్చి అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు. పాలమూరు రంగారెడ్డి కి ఏడు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఇంకో అనుమతి సాధించాలని, 90 టీఎంసీ ల నీళ్లు సాధించాలని సూచించారు. మంత్రులకు దమ్ముంటే అశోక్ నగర్ లైబ్రరీ సందర్శించాలని సవాల్ చేశారు. కేసీఆర్ కు మేము చెప్పనిదే పాలమూరుకు నిధులు ఇచ్చారా ? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రపంచంలోనే పెద్దవైన మోటార్లు తెచ్చింది కేసీఆర్ కాదా ? కేసీఆర్ తెచ్చిన ప్రాజెక్టులు పక్కన బెట్టడమే కాంగ్రెస్ నేతల పనా ? జిల్లాలను రద్దు చేయడమే ఈ ప్రభుత్వానికి పనా ? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓట్లేస్తే పూర్వపు పరిస్థితులు వస్తాయని అన్నారు. కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లు సీఎం హెలికాఫ్టర్ నుంచి చూస్తే కనిపిస్తాయని చెప్పారు. మంత్రులు ఎట్లా తిట్టుకుంటున్నారో అందరూ చూస్తున్నారని, మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయడానికి మహిళా ఐఏఎస్ అధికారుల పరువును బజారుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారిణులు రాష్ట్రంలో పని చేసేందుకు భయపడుతున్నారని వాపోయారు. దేశంలో తెలంగాణ పరువు పోయిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించుకుంటేనే ఈ ప్రభుత్వానికి అసలు నిజాలు అర్థం అవుతాయని చెప్పారు.
కాంగ్రెస్ నేతలే మారీచులు, సుబాహులు: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిసారి మహబూబ్‌నగర్‌కు వస్తున్నారు, పోతున్నారని, నల్లమల్ల బిడ్డను అని చెప్పుకుని ప్రజల మొహాలు నల్లగా చేసి వెళ్లారని మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ పేదరికాన్ని అడ్డం పెట్టుకుని ప్రపంచ బ్యాంకు నుంచి గత సీఎంలు ఋణం తెచ్చారని రేవంత్ అంటున్నారని గుర్తు చేశారు. ఇలాంటి పనులు ఉమ్మడి రాష్ట్ర సీఎం లు చేశారు కానీ కేసీఆర్ చేయలేదని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి లాంటి పెద్ద ప్రాజెక్టుకు మంజూరు ఇచ్చిందే కేసీఆర్ అని చెప్పారు. ప్రాజెక్టుకు అడ్డుపడ్డది కాంగ్రెస్ నేతలేనని, వాళ్ళే నిజమైన మారీచులు, సుబాహులు అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుకు అడ్డుపడ్డా.. కేంద్రం నుంచి నిధులు రాకున్నా.. రాష్ట్రం సొంత నిధులు కేటాయించి 80 శాతం పూర్తి చేసింది కేసీఆర్ కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు మార్చింది కేసీఆరేనని ఉద్ఘాటించారు. పాలమూరులో చెక్ డ్యామ్ లు కట్టి, చెరువులు బాగు చేసి లక్షల ఎకరాలను సాగు లోకి తెచ్చింది కేసీఆరేనని చెప్పారు. పాలమూరుకే కేసీఆర్ మొదటి మెడికల్ కాలేజ్ ఇచ్చారని, పాలమూరులో ఐదు మెడికల్ కాలేజీలు, రెండు ఇంజినీరింగ్ కాలేజీలు, ఫిషరీ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాల, 80 గురుకులాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. హెల్త్ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని కీర్తించారు.
మహబూబ్ నగర్ పల్లెలకు గతం లో 30 శాతం రోడ్లు కూడా లేకుండెనని, కేసీఆర్‌ను ఒప్పించి మహబూబ్ నగర్‌ను స్పెషల్ కేసు కింద మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయించగలిగామని లక్ష్మారెడ్డి చెప్పారు. కాంగ్రెస్, టీడీపీల దరిద్రపు పాలనలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు కేసీఆర్ పాలనలోనే బాగుపడ్డాయని పేర్కొన్నారు. మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆరు నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేదని వివరించారు. ఉద్ధండపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకెజీకి సీఎం నిన్న నిధులు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను, కాంగ్రెస్ నేతలు బీజేపీని పొగడడానికే నిన్నటి మీటింగ్ సరిపోయిందని ఎద్దేవా చేశారు. డీకే అరుణ జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారని, జూరాలలో నీళ్లుంటే గద్వాలలో క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేశారు. జడ్చర్లకు ఒక ట్రిపుల్ ఐటీ మంజూరు చేసి జబ్బలు చరుచుంటున్నారని, తాము మెడికల్ కాలేజీలు, మిగతా కాలేజీలు తెచ్చామని గుర్తు చేశారు. కేసీఆర్ ఘనత వల్లే పాలమూరు పచ్చబడ్డదని అన్నారు. సీఎం తొండి మాటలు తప్ప జిల్లాకు పనికొచ్చే విషయం ఒక్కటి మాట్లాడలేదని దుయ్యబట్టారు. పరనిందలు మాని పని చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి పని చేస్తే మాకు అభ్యంతరం లేదని, కానీ కలిసి పంచుకోవద్దని సూచించారు. నిన్న బీజేపీ మీటింగ్‌లో కాంగ్రెస్ మా ప్రధాన ప్రత్యర్థి అని రాంచందర్ రావు అన్నారని కానీ ప్రధాన ప్రత్యర్థి అని పరస్పర ప్రశంసలు ఎట్లా సాధ్యమైందని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు కలిసి పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా తెస్తే ఎవ్వరు వద్దనరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



