త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం.. భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Bhatti Vikramarka | ఆంధ్ర‌జ్యోతి కొత్త ప‌లుకులో క‌ట్టుకథ‌లు అల్లి క‌థ‌నం రాశారు.. రాసిన ఆయ‌న‌కు ఎవ‌రి మీదో ప్రేమ ఉండొచ్చు.. వైఎస్ మీద కోపంతో నా మీద రాసి ఉంటాడు.. నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం.. ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలియాలి.. వెనుకాల ఎవ‌రి ఉండి రాయించారో త‌ర్వాత మాట్లాడుతాన‌ని భ‌ట్టి విక్ర‌మార్క ఆగ్ర‌హంతో ఊగిపోయారు.

S

Telangana | Published On Jan 18, 2026, 3.38 pm IST

Bhatti Vikramarka | నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం.. భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

సింగ‌రేణి బొగ్గు గ‌నులు తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌
ఆస్తుల‌ను సృష్టించ‌డం కోసం రాజ‌కీయాల్లోకి రాలేదు
ఏ గ‌ద్ద‌ల‌ను, ఏ దోపిడీదారుల‌ను తెలంగాణ ఆస్తుల‌పై ప‌డ‌నీయ‌ను
నేనేం గాలికి రాలేదు. 40 ఏండ్లు స‌భ‌లో, బ‌య‌ట పోరాటం చేస్తున్నా
ఆత్మ‌గౌర‌వంతో బతుకుతాను.. ఎవ‌రి ద‌గ్గ‌ర త‌ల‌వంచ‌ను
నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం..
నీ చిల్ల‌ర క‌థ‌నాల‌కు భ‌య‌ప‌డే వారెవ‌రూ లేరు
కొత్త ప‌లుకు వెనుకాల ఎవ‌రున్నారో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడుతా
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌జ్యోతి కొత్త ప‌లుకులో క‌ట్టుకథ‌లు అల్లి క‌థ‌నం రాశారు.. రాసిన ఆయ‌న‌కు ఎవ‌రి మీదో ప్రేమ ఉండొచ్చు.. వైఎస్ మీద కోపంతో నా మీద రాసి ఉంటాడు.. నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం.. ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలియాలి.. వెనుకాల ఎవ‌రి ఉండి రాయించారో త‌ర్వాత మాట్లాడుతాన‌ని భ‌ట్టి విక్ర‌మార్క ఆగ్ర‌హంతో ఊగిపోయారు. బొగ్గు కోసం నీచ క‌థ‌నం పేరిట ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ త‌న కొత్త ప‌లుకులో రాసిన క‌థనంపై రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌జా భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు భ‌ట్టి వివ‌ర‌ణ ఇచ్చారు.

భ‌ట్టి విక్ర‌మార్క ఏం మాట్లాడ‌రంటే..

'నాపై క‌థ‌నాలు వండుతా ఉన్నారు. వారు రాస్తూ దాంట్లో నా పేరు కూడా తీసుకొని పెద్ద అక్ష‌రాల‌తో రాశారు. సింగ‌రేణి కాల‌రీస్‌కు సంబంధించి ఆస్తులు, బొగ్గు గ‌నులు తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌. సింగ‌రేణి ఆస్తులు ఈ రాష్ట్రానికి సంబంధించి ఆస్తులు. ఆ ఆస్తుల‌ని, సింగ‌రేణి ఆత్మ‌ని కాపాడి భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించ‌డ‌మే నా ముందున్న ఏకైక ల‌క్ష్యం. ఆర్కే లాగా ఏది ప‌డితే అది మాట్లాడ‌డ‌మో, ఏది ప‌డితే అది రాయ‌డ‌మో చేయ‌ను. ఎందుకంటే నాకు బాధ్య‌త‌, ఒక విధానం కూడా ఉంది. ఎందుకంటే రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ఒక ల‌క్ష్యం కోసం వ‌చ్చాను. ఆస్తుల‌ను సృష్టించుకోవ‌డం కోస‌మో, వ్యాపార సామ్రాజ్యాల‌ను విస్త‌రించుకోవ‌డం కోస‌మో, లేక‌పోతే అధికారాన్ని హోదాగా అనుభ‌వించ‌డం కోసం రాలేదు. నేను ఒక ప్ర‌త్యేక‌ ల‌క్ష్యం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. నా ల‌క్ష్యం ఇక్క‌డున్న ఆస్తుల‌ను, వ‌న‌రుల‌ను, వ్య‌వ‌స్థ‌ల‌ను స‌మాజంలో అన్ని వ‌ర్గాల‌కు పంచ‌డం కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. దారి దోపిడీ గాళ్లు, గ‌ద్ద‌లాంటి వాళ్లు స‌మాజం మీద ప‌డి పీక‌తింటా ఉంటే వాళ్ల‌ను ర‌క్షించ‌డం కోసం, వాళ్ల త‌ర‌పున మాట్లాడ‌డం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. అటువంటి నా జీవితం పార‌ద‌ర్శ‌కంగా ఉంట‌ది. ఎవ‌రికో ఉప‌యోగ‌ప‌డ‌డం కోసం దీంట్లో ఉప ముఖ్య‌మంత్రి పాత్ర ఉంద‌ని రాశాడు' అని భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

రాధాకృష్ణ‌కు ఈ మాత్రం కూడా జ్ఞానం లేదా..?

'వారి మీద గౌర‌వంతో సూటిగా అడుగుతున్నా. టెండ‌ర్లు పిలిచింది సింగ‌రేణి బోర్డు. ఏ కండిష‌న్లు ఉండాలో బోర్డు పెడుత‌ది.. మంత్రి కాదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయ‌డం స‌రికాదు. అలాగే ఇంకో కాలం రాశారు. ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు. కావాల్సిన వారికి ఇచ్చుకోవ‌డం కోసం పెట్టార‌ని రాశారు. సైట్ విజిట్ అనేది.. క్లిష్ట‌త‌ర‌మైన ప్రాంతాలు ఉంటాయి కాబ‌ట్టి విజిట్ చేసి.. పార‌ద‌ర్శ‌కంగా టెండ‌ర్లు జ‌ర‌పాల‌ని. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఇలాంటి కండిష‌న్లు ఉన్నాయి' అని భ‌ట్టి విక్ర‌మార్క గుర్తు చేశారు.

నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం..

'అయినా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను, ఒక క‌ట్టు క‌థ‌ను, పిట్ట క‌థ‌ను అల్లి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్ట‌డం కోసం తను ఒక క‌థ‌నం రాశాడు. కాబ‌ట్టి మేం నిజాయితీగా ఉండ‌డ‌మే కాదు.. ఉన్న‌ట్టుగా కూడా జ‌ర ఆయ‌న‌కు క‌న‌బ‌డాలి. ఆ పార‌ద‌ర్శ‌క‌త కూడా ఉండాలి. దాన్నే నేను న‌మ్ముతాను. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు మంత్రిగా నేను ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన బాధ్య‌త ఉంటుంది. ఇక టెండ‌ర్లు కూడా ర‌ద్దు చేసి కొత్త టెండ‌ర్లు పిల‌వాల‌ని సింగ‌రేణి బోర్డుకు కూడా చెప్పాను. టెండ‌ర్ పిలిచాం. కానీ ఎవ‌రూ పార్టిసిపేట్ చేయ‌లేదు. ఎవ‌రో రాసిన దానికి మేం బాధ్యులం అంటే ఎలా స‌ర్ అంటే నేను చెప్పాను. అది రాసిన ఆయ‌న‌కు ఎవ‌రి మీద‌నో ప్రేమ ఉండొచ్చు. లేక‌పోతే నేను మొద‌ట్నుంచి వైఎస్సార్‌కు స‌న్నిహితుడిగా ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న మీద ఉన్న కోపంతో రాసి ఉండొచ్చు. ఇవ‌న్నీ రాష్ట్ర రాజ‌కీయాలకు, పాల‌న‌కు, సింగ‌రేణికి సంబంధించిన‌వి కావు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వ‌చ్చింది కాబ‌ట్టి దాన్ని క్యాన్షిల్ చేయండ‌ని చెప్పాను. మిగ‌తా విష‌యాల్లో నేను రాధాకృష్ణ తేల్చుకుంటాం. ఇది ప్ర‌జ‌ల‌కు సంబంధించిది కాబ‌ట్టి క్యాన్షిల్ చేయ‌మ‌ని చెప్పాను' అని విక్ర‌మార్క తెలిపారు.

ఏ గ‌ద్ద‌ల‌ను, ఏ దోపిడీదారుల‌ను తెలంగాణ ఆస్తుల‌పై ప‌డ‌నీయ‌ను..

'ఈ క‌ట్టు క‌థ‌, పిట్ట క‌థ రాసిన దానికి అత‌ను ఏ ఉద్దేశంతో రాశాడు.. ఎందుకు రాశాడు.. ఏ రాజ‌కీయ ఉద్దేశం ఉంది. దాని వెనుక ఎవ‌రుండి న‌డిపిస్తున్నారు అనేది మ‌ళ్లీ తిగిరి వ‌చ్చిన త‌ర్వాత ప్రెస్‌తో మాట్లాడ‌ను. నేను ఈ బాధ్య‌త‌లో ఉన్నంత కాలం ఏ గ‌ద్ద‌ల‌ను, ఏ దోపిడీదారుల‌ను, ఏ వ్య‌వ‌స్థీకృత‌మైన క్రిమిన‌ల్స్‌ను తెలంగాణ ఆస్తుల‌పై కానీ, తెలంగాణ వ్య‌వ‌స్థ‌ల‌పై కానీ ప‌డ‌నీయ‌ను. నేను ర‌క్ష‌ణ‌గా ఉంటాను. ఇందులో సందేహం లేదు అని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తేల్చిచెబుతూ' త‌న మీడియా స‌మావేశాన్ని ముగించారు.

త‌ద‌నంత‌రం మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు భ‌ట్టి విక్రమార్క స‌మాధానం ఇచ్చారు. మీకు, అధికారుల‌కు మ‌ధ్య ఎలాంటి విబేధాలు ఉన్నాయ‌ని ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు డిప్యూటీ సీఎం ఘాటుగా స‌మాధానం ఇచ్చారు.

ఆత్మ‌గౌర‌వంతో బ‌తుకుతాను.. ఎవ‌రి ద‌గ్గ‌ర త‌ల‌వంచ‌ను..

మీకు, మీ మీడియ సంస్థ‌ల‌కు మ‌ధ్య వైరం ఉంటే అది మీరు తేల్చుకోవాలి. మీ ఇంట్రెస్టుల కోసం రాష్ట్రాన్ని, పాల‌న‌ను, ప్ర‌భుత్వాన్ని అధికారులను, మంత్రుల‌ను లాగుతామంటే చూస్తూ ఊరుకోం. ఆత్మ‌గౌర‌వంతో బ‌తుకుదామ‌ని, బ‌త‌కాల‌ని, ఆత్మ‌గౌర‌వం లేకుండా ఈ స‌మాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్న‌ వ‌ర్గాల‌కు వ్య‌తిరేకంగా నిల‌బ‌డి.. ఆ వ‌ర్గాలకు ఆత్మ‌గౌర‌వం సాధించి పెట్టేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. ఆత్మ‌గౌర‌వంతో బ‌తుకుతాను.. ఎవ‌రి ద‌గ్గ‌ర త‌ల‌వంచ‌ను అని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ‌కూడ‌దు..

మీ మంత్రిపై ఆరోప‌ణ‌లు కావొచ్చు.. ఓ టీవీ చానెల్‌పై పోలీసుల దాడిని మీరు ఎలా చూస్తార‌ని మ‌రో మీడియా ప్ర‌తినిధి అడగ్గా.. ఇది చాలా దుర‌దృష్ట‌క‌రం. ఏ చానెల్ అయినా క‌థ‌నాల‌ను వండి వార్చ‌కూడ‌దు. ఇత‌రుల వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసేలా క‌థ‌నాలు ప్ర‌సారం చేయొద్దు. వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ‌కూడ‌దు అని విక్ర‌మార్క సూచించారు.

నీ చిల్ల‌ర క‌థ‌నాల‌కు భ‌య‌ప‌డే వారెవ‌రూ లేరు

మంత్రుల మ‌ధ్య గొడ‌వ‌లు న‌డుస్తున్నాయ‌ని మ‌రో జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్నించ‌గా.. ముఖ్య‌మంత్రి, మంత్రులు ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల విస్తృత ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నారు. మీ అవ‌స‌రాల కోసం క‌ట్టుక‌థ‌లు సృష్టించి, విబేధాలు సృష్టించ‌డం కోసం ప్ర‌య‌త్నిస్తే నువ్వేం విజ‌యం సాధించ‌లేవు. నీ చిల్ల‌ర క‌థ‌నాల‌కు భ‌య‌ప‌డే వారు ఎవ‌రూ లేరు అని డిప్యూటీ సీఎం ఘాటుగా బదులిచ్చారు.

నేనేం గాలికి రాలేదు..

ఎన్టీవీ క‌థ‌నాల వెనుక భ‌ట్టి ఉన్నార‌ని రాశారు క‌దా అని రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా భ‌ట్టి ఆగ్ర‌హాంతో ఊగిపోయారు. మరి ఆయ‌న యేడ చూసి, యేడ‌ కూర్చొని విన్నారో, యేడ చూసి రాశారో నాకు తెల్వ‌దు.. అది కూడా అడుగుతున్నా. నేనేం గాలికి రాలేదు. 40 ఏండ్లు స‌భ‌లో స‌భ బ‌య‌ట పోరాటం చేస్తూ ఈ స‌మాజం కోసం అడ్డంగా నిల‌బ‌డి పోరాటం చేస్తున్నా. నీచ నికృష్ట‌పు దిగ‌జారి పోయి రాజ‌కీయాల కోసం ఇటువంటి క‌ట్టు క‌థ‌నాల‌ను సృష్టించ‌డం, వ్యాప్తి చేయ‌డం వంటి వీక్ క్యారెక్ట‌ర్ కాదు భ‌ట్టి విక్ర‌మార్కది అని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement