త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | బీఆర్ఎస్‌ను పాతిపెట్టిన‌ప్పుడే ఎన్టీఆర్‌కు నిజ‌మైన నివాళి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఉండొద్ద‌ని క‌క్ష క‌ట్టి ఆ పార్టీ నాయ‌క‌త్వాన్ని దెబ్బ‌తీసినా కేసీఆర్, బీఆర్ఎస్‌ను స‌మూలంగా 100 మీట‌ర్ల గోతి తీసి పాతిపెట్టిన‌ప్పుడే ఎన్టీఆర్‌కు నిజ‌మైన నివాళుల‌ర్పించిన వాళ్లం అవుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

S

Telangana | Published On Jan 18, 2026, 5.43 pm IST

CM Revanth Reddy | బీఆర్ఎస్‌ను పాతిపెట్టిన‌ప్పుడే ఎన్టీఆర్‌కు నిజ‌మైన నివాళి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఉండొద్ద‌ని క‌క్ష క‌ట్టి ఆ పార్టీ నాయ‌క‌త్వాన్ని దెబ్బ‌తీసినా కేసీఆర్, బీఆర్ఎస్‌ను స‌మూలంగా 100 మీట‌ర్ల గోతి తీసి పాతిపెట్టిన‌ప్పుడే ఎన్టీఆర్‌కు నిజ‌మైన నివాళుల‌ర్పించిన వాళ్లం అవుతామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓ వైపు టీడీపీ జ‌పం చేస్తూనే, మ‌రోవైపు వైఎస్సార్‌ను కూడా సీఎం కొనియాడారు.

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు రూ. 362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు. కూసుమంచిలో వంద పడకల ఆసుపత్రి, మద్దులపల్లిలో నూతన మార్కెట్ యార్డు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఏదులాపురం నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఖ‌మ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

రాజకీయ ప్ర‌యాణంలో భాగంగా మొట్ట‌మొద‌టి సారి 2007-08లో ఖ‌మ్మం జిల్లాకు రావ‌డం జ‌రిగింది. మ‌ధిర మాజీ ఎమ్మెల్యే కొండ‌వాల కోటేశ్వ‌ర్ రావుతో క‌లిసి వివిధ గ్రామాల్లో ప‌ల్లె ప‌ల్లెన టీడీపీ కార్య‌క్ర‌మాలు తీసుకెళ్లినం. భ‌ట్టి విక్ర‌మార్క సొంతూరు చూడాల‌ని, వారి పెద్ద‌న్న మ‌ల్లు అనంత రాములు మా అభిమాన నాయ‌కుడు.. మా కుటుంబాల‌కు అత్యంత స‌న్నిహితుడు అని చెప్పి స్నానాల‌ల‌క్ష్మీపురం వెళ్లాను. ఈ జిల్లాలో తొలిసారి ఎమ్మెల్సీ స‌భ్యుడిగా అడుగుపెట్టాను. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఏ రోజు ఏ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మ‌న‌సు నిండా ఆశీర్వ‌దించి, గుండెల నిండా అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించి, ఎమ్మెల్యే నుంచి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే వ‌ర‌కు ఖ‌మ్మం ప్ర‌జ‌లు నిండు మ‌న‌సుతో ఆశీర్వ‌దించారు.. సీఎంగా ఎదిగేందుకు అండ‌గా నిల‌బ‌డినందుకు మీ అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

ఎన్టీఆర్‌పై రేవంత్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంతో పేద‌వాళ్ల గుండెలో శ్వాశ్వ‌తంగా ఇద్ద‌రు పేర్లు నిలిచిపోయాయి. వారిద్ద‌రిని ఈనాడు మ‌నం స్మ‌రించుకోవాలి. ఇవాళ విషాద‌క‌ర‌మైన రోజు.. ఇవాళ అన్న నంద‌మూరి తార‌క‌రామారావు వ‌ర్ధంతి. ఒక గొప్న నాయ‌కుడు.. తెలుగు వారిని మ‌ద్రాసీలు అని పిలుస్తున్న సంద‌ర్భంలో తెలుగు వాడి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పిన గొప్ప నాయ‌కుడు ఎన్టీఆర్ అని ఈ వేదిక మీద నుంచి గ‌ర్వంగా తెలియ‌జేస్తున్నా. పేద‌వాడికి ప‌ట్టెడు అన్నం పెట్టాలి.. వారి క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల‌ని రెండు రూపాయాల‌కే కిలో బియ్యం ఇచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన కిలో బియ్యం ప‌థ‌కాన్ని మేం కొన‌సాగిస్తున్నాం. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఈ ప‌థ‌కాన్ని ఇంకా వినూత్నంగా పేద‌ల‌కు అందుబాటులోకి తీసుకెళ్లాల‌ని చెప్పి స‌న్న బియ్యం ఇచ్చి ప్ర‌తి పేద‌వాడి క‌డుపు నింపుతున్నాం. 3 కోట్ల 17 ల‌క్ష‌ల మందికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా స‌న్నబియ్యం అందిస్తున్నాం.. పేద‌వాడి ఆక‌లి తీర్చాల‌ని ఈ ప‌థ‌కం కొన‌సాగిస్తున్నాం అని సీఎం తెలిపారు.

బీఆర్ఎస్‌ను పాతి పెట్టిన‌ప్పుడే ఎన్టీఆర్‌కు నిజ‌మైన నివాళి

తెలంగాణ‌లో ఎన్టీఆర్‌కు అభిమానులు ఉన్నారు. చంద్ర‌బాబుకు స‌హ‌చ‌రులు, అనుచ‌రులు ఉన్నారు. వారంద‌రికీ విజ్ఞ‌ప్తి ఒక్క‌టే. ఈ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఉండొద్ద‌ని క‌క్ష క‌ట్టి ఆ పార్టీ నాయ‌క‌త్వాన్ని దెబ్బ‌తీసినా కేసీఆర్, బీఆర్ఎస్‌ను స‌మూలంగా 100 మీట‌ర్ల గోతి తీసి పాతిపెట్టిన‌ప్పుడే ఎన్టీఆర్‌కు నిజ‌మైన నివాళుల‌ర్పించిన వాళ్ల‌మ‌వుతాం. బీఆర్ఎస్ వాళ్లు గ‌ద్దెలు దిగాలి.. ఊర్ల‌ల్లో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి.. అప్పుడే నంద‌మూరి తార‌క రామారావు గారికి నిజ‌మైన నివాళులు అర్పించిన వాళ్లం అవుతాం. ఆ విధంగా మ‌నం ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. బీఆర్ఎస్‌ను బొంద పెట్టాల్సిన బాధ్య‌త మ‌న అంద‌రిపై ఉంద‌ని రేవంత్ అన్నారు.

వైఎస్సార్ స్ఫూర్తితోనే 24 గంట‌ల క‌రెంట్..

రెండో వ్య‌క్తి వైఎస్సార్.. రైతుల‌కు ఉచిత క‌రెంట్ అందివ్వాలి.. ప్ర‌తి పేద‌వాడికి ఇందిర‌మ్మ ఇల్లు ఉండాల‌ని త‌పన ప‌డ్డారు. 2004లో ఎల్బీ స్టేడియంలో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే ఉచిత క‌రెంట్ ద‌స్త్రంపై తొలి సంత‌కం చేశారు వైఎస్సార్. దాదాపు రూ. 1300 కోట్ల రైతుల బ‌కాయిల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు రైతుల‌పై న‌మోదైన క్రిమిన‌ల్స్ కేసుల‌ను కూడా ర‌ద్దు చేశారు. నాడు వైఎస్సార్ రైతుల‌కు 7 గంట‌ల ఉచిత క‌రెంట్ ఇస్తే.. వారి స్ఫూర్తితో నేడు 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నాం. 30 ల‌క్ష‌ల పంపు సెట్ల‌కు ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం. 2004 నుంచి 2014 వ‌ర‌కు ప్ర‌తి మారుమూల ప‌ల్లెల్లో ఇందిర‌మ్మ ఇల్లు క‌ట్టాల‌ని 25 ల‌క్ష‌ల ఇండ్ల‌ను వైఎస్సార్ ఇచ్చారు అని రేవంత్ గుర్తు చేశారు.

ఎన్టీఆర్, వైఎస్సార్‌ను ఆద‌ర్శంగా తీసుకుంటున్నాం..

మ‌రి తెలంగాణ వ‌చ్చిన ప‌దేండ్ల‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు అని ఊరించారు. మీకు ఎవ‌రికైనా వ‌చ్చిందా..? కానీ ప్ర‌జా పాల‌న లో మీ అభిమాన నాయ‌కుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ రోజు మొద‌టి ఏడాదిలోనే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇండ్లు ఇచ్చాం.. మీ ఖ‌మ్మం జిల్లాలోనే ఈ ప‌థ‌కం ప్రారంభించుకున్నాం. గృహ ప్ర‌వేశాలు కూడా ఇక్క‌డే చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్న‌ర‌ ల‌క్ష‌ల ఇండ్లు పేద‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఏప్రిల్‌లో రెండో విడ‌త కింద ఇండ్లు మంజూరు చేసి ప‌ట్ట‌ణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు కూడా అందుబాటులోకి తీసుకువ‌స్తాం. వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కాన్ని మ‌నం కొన‌సాగిస్తున్నాం. ఎన్టీఆర్, వైఎస్సార్‌ను ఆద‌ర్శంగా తీసుకుని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసే ప్ర‌య‌త్నం మ‌న ప్ర‌భుత్వం చేస్తుంది. ఇందుకు మంత్ర‌లుంద‌రూ స‌హ‌క‌రిస్తున్నారు అని సీఎం రేవంత్ తెలిపారు.

ఈ ప‌దేండ్లు మ‌న‌దే.. చ‌రిత్ర పున‌రావృతం

రాబోయే ముఏన్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర‌వేయాలి. అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు ఉంటే ప‌రిష్క‌రించుకోవాలి. ఎవ‌రికి బీ ఫామ్ ఇస్తే వారి గెలుపు కోసం ప‌ని చేయాలి. భిన్నాభిప్రాయాలు బేధాభిప్రాయాలుగా మారొద్దు. క‌ష్టాన్నిన‌మ్ముకుని, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌ని చేస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గే నాకు సీఎంగా అవ‌కాశం ఇచ్చారు. స‌హ‌చ‌ర మంత్రులంద‌రూ ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డంలో సంపూర్ణంగా స‌హ‌క‌రాం అందిస్తున్నారు. రేపు జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి.. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. బీజేపీ అయితే ఆన‌వాళ్లు కూడా లేవు. ఏక‌లింగం తోక‌లింగంను రానివ్వ‌లేదు. ఖ‌మ్మం జిల్లాలో బీజేపీని నిషేధించారు. 1994 నుంచి 2004 వ‌ర‌కు తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2034 వ‌ర‌కు మ‌న‌మే అధికారంలో ఉంటాం.. చ‌రిత్ర పున‌రావృతం అవుతుంది. నేను చెప్పింది జ‌ర‌గ‌కుండా ఉన్న‌ది ఒక్క‌టి లేదు. ఈ రోజు ఖ‌మ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా చెప్ప‌ద‌ల‌చుకున్నా.. ఈ ప‌దేండ్లు మ‌న‌ది. పేద‌ల ప్ర‌భుత్వం.. ఇందిర‌మ్మ రాజ్యం ఉంటుంది.. దేశంలోనే నంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దుతాం అని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement