త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG EAPCET | టీజీ ఎప్‌సెట్ సెంట‌ర్ల‌లో ‘డ‌యాబెటిక్ కిట్లు’..! ఎందుకో తెలుసా..?

TG EAPCET | టీజీ ఎప్‌సెట్‌( TG EAPCET ).. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల‌తో పాటు అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష‌. ఈ ప‌రీక్ష ద్వారా ఇంట‌ర్ విద్యార్థులు త‌మ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించుకుంటారు.

S

Telangana | Published On Feb 11, 2026, 8.29 am IST

TG EAPCET | టీజీ ఎప్‌సెట్ సెంట‌ర్ల‌లో ‘డ‌యాబెటిక్ కిట్లు’..! ఎందుకో తెలుసా..?
Advertisement

TG EAPCET | త్రినేత్ర‌.న్యూస్ : టీజీ ఎప్‌సెట్‌( TG EAPCET ).. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల‌తో పాటు అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష‌. ఈ ప‌రీక్ష ద్వారా ఇంట‌ర్ విద్యార్థులు త‌మ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించుకుంటారు. కాబ‌ట్టి విద్యార్థుల‌కు టీజీ ఎప్‌సెట్ ప‌రీక్ష ఎంతో కీల‌క‌మైంది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్షా స‌మ‌యంలో విద్యార్థుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా ఎప్‌సెట్ నిర్వాహ‌కులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. విద్యార్థులు అల‌స‌ట‌, ఒత్తిడికి గురైతే వారికి ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చాక్లెట్స్, బిస్కెట్లు, గ్లూకోజ్ పౌండ‌ర్ వంటి ప‌దార్థాలను అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఎప్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ కే విజ‌య్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప్ర‌తి ప‌రీక్షా కేంద్రంలో డయాబెటిక్ కిట్లు

చాలా మంది విద్యార్థులు ప్ర‌వేశ ప‌రీక్ష రోజున తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతుంటారు. దాంతో స‌రిగా ఆహారం కూడా తీసుకోరు. ప‌రీక్షా కేంద్రానికి వ‌చ్చే స‌రికి నీర‌సంగా మారిపోతారు. కొంద‌రు విద్యార్థులు డయాబెటిక్ స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డుతున్నట్లు తెలిసింది. ఈ క్ర‌మంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్ర‌తి ప‌రీక్షా కేంద్రంలో డయాబెటిక్ కిట్‌ల‌ను అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యించామ‌ని క‌న్వీన‌ర్ విజ‌య్ కుమార్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ముంద‌స్తుగానే స‌మాచారం అందించాలి..

జేఈఈ మెయిన్‌, నీట్ యూజీ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించే నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ.. విద్యార్థుల‌కు డ‌యాబెటిక్ కిట్‌ల‌ను ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తిస్తున్న‌ట్లు ఎప్‌సెట్ క‌న్వీన‌ర్ గుర్తు చేశారు. పండ్ల‌ను, చాక్లెట్స్‌తో పాటు ట్రాన్స్‌ప‌రేంట్ వాట‌ర్ బాటిళ్ల‌ను అనుమ‌తిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎప్‌సెట్‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల‌కు డ‌యాబెటిక్ కిట్ల‌ను అందించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. అయితే వివిధ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే విద్యార్థులు ముందస్తుగానే త‌మ‌కు స‌మాచారం అందించాల‌న్నారు.

టీజీ ఎప్‌సెట్ ముఖ్య‌మైన తేదీలు

టీజీ ఎప్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల - ఫిబ్ర‌వ‌రి 14
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ - ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఏప్రిల్ 4 వ‌ర‌కు
అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మసీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ - మే 4, 5 తేదీల్లో
ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ - మే 9 నుంచి 11 వ‌ర‌కు

ఈ సారి సిద్దిపేట‌లోనూ ప‌రీక్షా కేంద్రాలు

ఈ ఏడాది ఎప్‌సెట్ ప‌రీక్ష‌ను సిద్దిపేట‌లోనూ నిర్వ‌హించ‌నున్న‌ట్టు క‌న్వీన‌ర్ విజ‌య్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం ప‌రీక్షా కేంద్రాల‌ను 16 జోన్లుగా విభ‌జించిన‌ట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement