త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lunar Eclipse | సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం.. ప్ర‌ముఖ ఆల‌యాలు మూసివేత‌

Lunar Eclipse | మ‌రికొన్ని గంట‌ల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. రాత్రి వేళ తెల్ల‌టి వ‌ర్ణంతో వెలుగులు వెద‌జ‌ల్లే ఆ చంద‌మామ (Chandra Grahan) ఎరుపు రంగును సంత‌రించుకోనున్నాడు. మంగ‌ళ‌వారం సాయంత్రం బ్ల‌డ్‌మూన్ క‌నువిందు చేయ‌నుంది.

G

Telangana | Published On Mar 3, 2026, 9.52 am IST

Lunar Eclipse | సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం.. ప్ర‌ముఖ ఆల‌యాలు మూసివేత‌
Advertisement

Lunar Eclipse | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రికొన్ని గంట‌ల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. రాత్రి వేళ తెల్ల‌టి వ‌ర్ణంతో వెలుగులు వెద‌జ‌ల్లే ఆ చంద‌మామ (Chandra Grahan) ఎరుపు రంగును సంత‌రించుకోనున్నాడు. మంగ‌ళ‌వారం సాయంత్రం బ్ల‌డ్‌మూన్ క‌నువిందు చేయ‌నుంది. సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) మధ్యాహ్నం 3.21గంటలకు ప్రారంభమై రాత్రి 7.52గంటల వరకు ఉండనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ రాష్ట్రంలోని ఆల‌యాల‌ను (Temple Close) తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వ‌నున్నారు.

భ‌క్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాల‌ను కూడా మూసివేశారు. బుధ‌వారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి, అనంతరం నిత్యపూజల తర్వాత భ‌క్తుల‌కు స్వామి దర్శన భాగ్యం క‌ల్పిస్తారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసేశారు. తిరిగి బుధ‌వారం ఉదయం సంప్రోక్షణ, అభిషేక పూజల తర్వాత భక్తులను దర్శనానికి అనుమ‌తిస్తారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు ఉదయం 6.15 నుంచి సాయంత్రం 7.15 వరకు మూసివేస్తారు. అనంతరం పుణ్యాహవాచనం, సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం క‌ల్పిస్తారు. అదేవిధంగా ఓదెల మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని కూడా మూసివేశారు. బుధ‌వారం ఉదయం సంప్రోక్షణ, అభిషేక పూజల అనంతరం భక్తులకు ద‌ర్శన భాగ్యం క‌ల్పించ‌నున్నారు.

ఇక కొమురవెల్లి మల్ల‌న్న ఆలయాన్ని ఉదయం 6 గంటలకూ మూత‌ప‌డింది. గ్ర‌హ‌ణం ముగిసిన త‌ర్వాత‌ సాయంత్రం 7.30 గంట‌లల‌కు ఆలయాన్ని తెర‌చి శుద్ధి, సంప్రోక్షణ తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ నేప‌థ్యంలో భక్తులు ఆలయాల‌ సమయాలను గమనించి దర్శనానికి రావాలని అధికారులు సూచించారు.

మ‌రోవైపు క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న తిరుమ‌ల ఆల‌యం కూడా మూత‌ప‌డింది. టీటీడీ (TTD) పరిధిలోని దాదాపు ఆలయాలు ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటలకు వరకు మూసివేయ‌నున్నారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభిస్తారు. గ్రహణం నేపథ్యంలో టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా తాత్కాలికంగా క్లోజ్ కానున్నాయి.

Advertisement
Advertisement