త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | గత రికార్డులను తిరగరాస్తూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్..

Telangana | రాష్ట్రంలో (Telangana) రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ (Power Demand) పెరుగుతున్న‌ది. గత రికార్డులను అన్నీ తిరగరాస్తూ అత్యధికంగా విద్యుత్ వినియోగం నమోదు అవుతున్న‌ది.

G

Telangana | Published On Apr 27, 2026, 12.19 pm IST

Telangana | గత రికార్డులను తిరగరాస్తూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్..
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో (Telangana) రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ (Power Demand) పెరుగుతున్న‌ది. గత రికార్డులను అన్నీ తిరగరాస్తూ అత్యధికంగా విద్యుత్ వినియోగం నమోదు అవుతున్న‌ది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల‌తో గృహావ‌స‌రాల‌కు విద్యుత్‌ డిమాండ్ అధిక‌మ‌వ‌డం, పరిశ్రమలు, వ్యవసాయ రంగంలో అధిక‌ వినియోగంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ పెరిగింది. అయితే ప్రజల డిమాండ్ కు తగ్గట్టుగా తెలంగాణ విద్యుత్ సంస్థలు సరఫరా చేయగలుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా విద్యుత్ వినియోగం పెరుగుతుంద‌న్న అంచనాల నేపథ్యంలో, విద్యుత్ అవసరాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా స‌న్న‌ద్ధమవుతున్నాయి.

శాసిస్తున్న‌ వ్యవసాయ రంగం

రాష్ట్రంలో పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ వినియోగం పెరుగుతుండటం కూడా విద్యుత్ డిమాండ్ అధికం అవుతోందని అధికారులు వెల్లడించారు. మరో వైపు విద్యుత్‌ డిమాండ్‌ను వ్యవసాయ రంగం శాసిస్తున్న‌ది. రబీ సీజన్‌ ముగియడంతో విద్యుత్‌ డిమాండ్‌, వినియోగం సాధారణ స్థాయికి చేరడమే అందుకు నిదర్శనం. మార్చి 27న 18,548 మెగావాట్లుగా ఉన్న డిమాండ్‌ క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం (ఈనెల 24న) 13,187 మెగావాట్లుగా నమోదయింది. వినియోగం 266.92 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లు అధికారికంగా 29 లక్షలుగా ఉండగా అనధికారికంగా 35 లక్షల దాకా ఉంటాయని అంచనా.

ప్రతిఏటా ఖరీఫ్‌ (జూలై 1- అక్టోబర్‌ 31), రబీ (డిసెంబర్‌ 1- మార్చి 31) సీజన్లలో విద్యుత్‌ డిమాండ్‌ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న‌ది. 2025 మే నెలలో 11,509 మెగావాట్లుగా ఉన్న విద్యుత్‌ డిమాండ్‌.. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యాక 2025 జూలైలో 15,443, ఆగస్టులో 16,613, సెప్టెంబర్‌లో 15,906 మెగావాట్లుగా నమోదయింది. మళ్లీ క్రమంగా తగ్గుతూ అక్టోబర్‌లో 12,998, నవంబర్‌లో 11,188 మెగావాట్లకు చేరింది. ఇక రబీ ప్రారంభ నెల డిసెంబర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 14,653 మెగావాట్లు ఉండగా.. మార్చి 27న ఏకంగా 18,548 మెగావాట్లకు పెరిగింది.

ఆ రాష్ట్రాల‌ను అధిగ‌మించి..

దేశంలో అతిపెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ 19,900 మెగావాట్లు, రాజస్థాన్ 20,600 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా చిన్న రాష్ట్రమైన తెలంగాణ 18,139 మెగావాట్ల డిమాండ్‌తో ఆ దరిదాపుల్లో నిలిచింది. ఇదే జాతీయ స్థాయిలో రాష్ట్రం సాధించిన ఘనత. పరిశ్రమలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల కంటే తెలంగాణ ఎక్కువ విద్యుత్ డిమాండ్‌ను నమోదు చేయడం గమనార్హం. 2023-24లో తెలంగాణ విద్యుత్ వినియోగం 15,623 మెగావాట్లు ఉండగా అది ఇప్పుడు 18,139 మెగావాట్లకు చేరుకుంది.

అప్పుగా కరెంట్..

సాధారణంగా అవసరానికి డబ్బును అప్పుగా తీసుకుని వడ్డీతో కలిపి చెల్లించడం మనకు తెలుసు. కానీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పుడు కరెంటును అప్పుగా తీసుకుని, తిరిగి కరెంటునే వడ్డీతో సహా ఇచ్చేలా ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. భారీ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి డిస్కంలు ఎంచుకున్న ఈ మార్గం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సమయంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో తెలంగాణలో సాగు పనులు ముమ్మరంగా సాగుతుండటంతో డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతున్న‌ది. దీన్ని ఆసరాగా చేసుకుని, ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్‌తో మన డిస్కంలు కీలక ఒప్పందం చేసుకున్నాయి.

అప్పు: ఈ నెలాఖరు వరకు రోజుకు గరిష్టంగా 3 వేల‌ మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ తీసుకోవచ్చు.
వడ్డీ: తీసుకున్న విద్యుత్తుకు అదనంగా 5 శాతం కరెంటును కలిపి తిరిగి చెల్లించాలి.
తిరిగి ఇచ్చే సమయం: తెలంగాణలో డిమాండ్ తగ్గే ఏప్రిల్ 20 నుంచి జూలై 10 మధ్య ఈ 'బకాయి'ని చెల్లించాల్సి ఉంటుంది.
ఇదే తరహాలో మధ్యప్రదేశ్ విద్యుత్ సంస్థతో కూడా రోజుకు 500 మెగావాట్ల కోసం చర్చలు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement