త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం

Bhatti Vikramarka | పెట్టుబడిదారులను ప్రోత్సహించే తెలంగాణను క్లీన్‌ ఎనర్జీ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సీఈవోలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.

P

Telangana | Published On Aug 18, 2026, 7.56 pm IST

Bhatti Vikramarka | పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం
Advertisement
  • క్లీన్‌ ఎనర్జీ తయారీ హబ్‌గా రాష్ట్రం
  • 2035 నాటికి 26 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ లక్ష్యం
  • 8వేల మెగావాట్ల ఎనర్జీ స్టోరేజీ సామర్థ్యం
  • పెట్టుబడులు, ఆవిష్కరణలకు రాష్ట్రంలో అపార అవకాశాలు
  • డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka | పెట్టుబడిదారులను ప్రోత్సహించే తెలంగాణను క్లీన్‌ ఎనర్జీ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సీఈవోలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో హైటెక్స్‌, నోవాటెల్‌లో ప్రారంభమైన రెండ్రోజుల ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్‌ అండ్‌ ఎక్స్‌పో-2026’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులను ఉద్దేశించి భట్టి మాట్లాడారు. ‘‘పెట్టుబడులను ప్రోత్సహించే రాష్ట్రంగా తెలంగాణ.. పెట్టుబడిదారులకు స్వర్గధామం. రాష్ట్ర అభివృద్ధి, సంపదలో భాగస్వాములు కావాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.

26వేల మెగావాట్ల సౌర విద్యుత్‌

ఇంధన పరివర్తన అంటే కేవలం విద్యుత్‌ ఉత్పత్తి వనరులను మార్చడం కాదని.. మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చే ప్రక్రియ అని భట్టి పేర్కొన్నారు. తెలంగాణను క్లీన్‌ ఎనర్జీ వినియోగ రాష్ట్రంగా మాత్రమే కాకుండా.. స్వచ్ఛ ఇంధన సాంకేతికతల తయారీలో ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను తీర్చడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 2030 నాటికి సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని 20 వేల మెగావాట్లకు.. 2035 నాటికి 26 వేల మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

8వేల మెగావాట్ల స్టోరేజీ

పునరుత్పాదక విద్యుత్‌ సమర్థ వినియోగానికి ఎనర్జీ స్టోరేజీ కీలకమని భట్టి తెలిపారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు.. 2035 నాటికి 8 వేల మెగావాట్ల నిల్వ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌ ఐటీ, ఏఐ రంగాల్లో ఉన్న బలాన్ని విద్యుత్‌ రంగంలోనూ వినియోగించుకోనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ విద్యుత్‌ గ్రిడ్‌ను డిజిటల్‌ నెట్‌వర్క్‌గా మార్చే చర్యలు చేపడుతున్నామని.. ప్రతిపాదిత ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో ఏఐ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ కోసం 100 మెగావాట్ల ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

గ్రీన్‌ హైడ్రోజన్‌, ఈవీలపై దృష్టి

2030 నాటికి ఏటా 4 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. 2035 నాటికి రాష్ట్రంలో 12 వేల ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణలో సౌర, పవన, బ్యాటరీ విడిభాగాల తయారీ సంస్థలకు మూలధన ప్రోత్సాహకాలు, ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, విద్యుత్‌ సుంకం మినహాయింపులు కల్పిస్తామని తెలిపారు. టీజీ-ఐపాస్‌ ద్వారా వేగవంతమైన అనుమతులు అందిస్తామని పేర్కొన్నారు. క్లీన్‌ ఎనర్జీ రంగంలో లక్ష్యాల సాధనకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అత్యంత కీలకమని భట్టి అన్నారు. తెలంగాణతో కలిసి ఈ ఇంధన పరివర్తనలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన సందర్శించారు. కార్య‌క్ర‌మంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement