త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

తెచ్చిన అప్పు 2.5 ల‌క్ష‌ల కోట్లు! ఇంత‌కీ ఏమైన‌ట్టు

Telangana | తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేండ్లు అవుతోంది. ఈ రెండేండ్ల పాల‌న‌లో రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జ‌రిగిందా..? అంటే లేద‌నే చెప్పొచ్చు. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా కాంగ్రెస్ పాల‌న ఉంది. అభివృద్ధిని ప‌క్క‌న పెడితే ఈ రెండేండ్ల కాలంలో రేవంత్ స‌ర్కార్ బాగానే అప్పులు తీసుకున్న‌ది. తీసుకుంటూనే ఉంది. బ్యాంకులు, సెక్యూరిటీ బాండ్ల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 2.5 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌ను తీసుకున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

S

Telangana | Published On Dec 5, 2025, 9.10 am IST

తెచ్చిన అప్పు 2.5 ల‌క్ష‌ల కోట్లు! ఇంత‌కీ ఏమైన‌ట్టు
Advertisement

Telangana | తెలంగాణ‌లో కాంగ్రెస్ (Telangana congress) పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేండ్లు అవుతోంది. అభివృద్ధిని ప‌క్క‌న పెడితే ఈ రెండేండ్ల కాలంలో రేవంత్ స‌ర్కార్ బాగానే అప్పులు తీసుకున్న‌ది. తీసుకుంటూనే ఉంది. బ్యాంకులు, సెక్యూరిటీ బాండ్ల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 2.5 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌ను తీసుకున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇక ఈ అప్పుల‌కు అద‌నంగా కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు కూడా విడుద‌ల అవుతున్నాయి. అప్పులు, గ్రాంట్ల‌కు తోడు రాష్ట్ర ప‌రిధిలోని ర‌వాణా, ఎక్సైజ్, వాణిజ్య ప‌న్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ డిపార్ట్‌మెంట్‌ల నుంచి కూడా ప‌న్నుల రూపేణా పెద్ద ఎత్తున రాష్ట్ర ఖ‌జానాకు ఆదాయం స‌మ‌కూరుతున్న‌ది.

అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వ ఉద్యోగుల‌కు స‌కాలంలో జీతాలు అంద‌డం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు కూడా జీతాల్లేవు. విద్యార్థుల‌కు చెల్లించాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ గురించి ప‌ట్టింపే లేదు. కాంట్రాక్ట‌ర్ల‌కు పెండింగ్ బకాయిలు చెల్లించ‌డం లేదు. రిటైర్డు ఉద్యోగుల‌కు కూడా ప‌ద‌వీ విర‌మ‌ణ బెనిఫిట్స్ అంద‌క‌పోవ‌డంతో వారు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో అప్పులు, కేంద్రం గ్రాంట్లు, ప‌న్నుల రూపేణా వ‌స్తున్న ఆదాయ‌మంతా ఎటు పోతుంద‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నారు.

ప్ర‌తి నెలా స‌గ‌టున రూ. 10 వేల కోట్ల అప్పులు..!

రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్క‌ల ప్ర‌కారం.. రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌తి నెలా స‌గ‌టున రూ. 10 వేల కోట్ల చొప్పున సెక్యూరిటీ బాండ్ల విక్ర‌యం లేదా ప‌లు ఆర్థిక సంస్థ‌ల నుంచి రుణాలు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డైంది. ఇటీవ‌ల మ‌రో రూ. 4 వేల కోట్ల సెక్యూరిటీ బాండ్ల విక్ర‌యానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఇందులో ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితికి లోబ‌డి తీసుకున్న రుణాల‌తో పాటు కార్పొరేష‌న్ల పేరుతో తీసుకున్న అప్పులు, గ్యారెంటీలు లేకుండా తీసుకొచ్చిన రుణాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే నాటికి ప్ర‌తి నెలా సగ‌టున రూ. 10 వేల కోట్ల చొప్పున 15 నెల‌ల కాలానికి రూ. 1.5 ల‌క్ష‌ల కోట్ల రుణం తీసుకున్న‌ట్లు ఆర్థిక శాఖ లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి. మార్చి నుంచి నేటి వ‌ర‌కు మ‌రో రూ. 80 వేల కోట్ల అప్పులు తీసుకున్న‌ట్లు వెల్ల‌డైంది. ప్ర‌తి నెలా ఖ‌ర్చు రూ. 22,500 కోట్ల దాకా ఉండ‌గా, ఆదాయంతో పాటు అప్పులు క‌లిపినా రూ. 18 వేల కోట్ల‌కు మించ‌డం లేదు. లోటు ఉన్న రూ. 4,500 కోట్లు పూడ్చుకునేందుకు ప్ర‌భుత్వ భూములు విక్ర‌యించ‌డం, త‌న‌ఖా లేకుండా రుణాలు తీసుకుంటున్నారు.

ఒక్క అక్టోబ‌ర్ నెల‌లోనే రూ. 16 వేల కోట్ల అప్పులు

2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో బ‌హిరంగ మార్కెట్ నుంచి రూ. 54 వేల కోట్ల రుణాలు తీసుకుంటామ‌ని బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ స్థాయిలోనే అప్పులు తీసుకుంటున్న‌ది. కొత్త ప్రాజెక్టుల వ్య‌యం పెర‌గ‌డంతో ఆ మేర‌కు అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి దాపురించింది. దీంతో మొద‌టి, రెండో త్రైమాసికంలో అన‌గా ఏప్రిల్ నుంచి సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు దాదాపు రూ. 50 వేల కోట్ల వ‌ర‌కు అప్పులు తీసుకున్న‌ది రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం. ఈ అప్పుల్లో ఒక్క అక్టోబ‌ర్ నెల‌లోనే ఏకంగా రూ. 16 వేల కోట్ల అప్పులు తీసుకుని రికార్డు సృష్టించింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. రూ. 54 వేల కోట్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 50 వేల కోట్ల అప్పులు తీసుకోగా మిగిలింది రూ. 4 వేల కోట్లు మాత్ర‌మే. ఈ ప‌రిస్థితిని చూస్తుంటే.. బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన రూ. 54 వేల కోట్ల అప్పులకు మించి రుణాలు తీసుకునే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఎందుకంటే.. ఇంధ‌న అమ్మ‌కాలు, మ‌ద్యం విక్ర‌య ప‌న్నుల రూపేణా రూ. 37,500 రాబ‌డి ఉంటుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇందులో స‌గం కూడా ఆదాయం స‌మ‌కూర‌లేదు. దీంతో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. ఈ క్ర‌మంలో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో రేవంత్ స‌ర్కార్ అప్పుల‌ను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా చేస్తూ ముందుకు పోతుంది.

స‌చివాల‌యం చుట్టూ బాధితుల ప్ర‌ద‌క్షిణ‌లు..

రేవంత్ రెడ్డి స‌ర్కార్ స్థాయికి మించి అప్పులు తీసుకుంటున్న‌టికీ.. ఆ రుణాలు మాత్రం అభివృద్ధికి వినియోగించ‌డం లేదు. కేవ‌లం బ‌డా బడా కాంట్రాక్ట‌ర్ల‌కు, కొత్త ప్రాజెక్టుల‌కు నిధులను కేటాయిస్తున్నారు. ఇక ప్ర‌భుత్వానికి ఊపిరిగా ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మాత్రం స‌కాలంలో జీతాలు చెల్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మిగతా వ‌ర్గాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ.. చెల్లింపులు చేయ‌డంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో రిటైర్డు ఉద్యోగులు, చిన్న చిన్న కాంట్రాక్ట‌ర్లు త‌మ బ‌కాయిల కోసం స‌చివాల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ చెప్పులు అరుగుతున్నాయి.. కానీ ఫ‌లితం మాత్రం లేదు. విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ విష‌యంలోనూ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది కాంగ్రెస్ ప్ర‌భుత్వం.

Advertisement

తాజావార్తలు

Advertisement