త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు.. అయినా బీఆర్ఎస్‌కు క‌నువిప్పు క‌ల‌గ‌లేదు

Uttam Kumar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు రికార్డ్ స్థాయిలో జరిగాయ‌ని, అయినా కూడా బీఆర్ఎస్ నేత‌ల‌కు క‌నువిప్పు క‌ల‌గ‌డం లేద‌ని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై విపక్షాలు చేస్తున్న దుష్రచారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు.

S

Telangana | Published On May 6, 2026, 7.31 pm IST

Uttam Kumar Reddy | రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు.. అయినా బీఆర్ఎస్‌కు క‌నువిప్పు క‌ల‌గ‌లేదు
Advertisement

Uttam Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు రికార్డ్ స్థాయిలో జరిగాయ‌ని, అయినా కూడా బీఆర్ఎస్ నేత‌ల‌కు క‌నువిప్పు క‌ల‌గ‌డం లేద‌ని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై విపక్షాలు చేస్తున్న దుష్రచారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. బుధ‌వారం తెలంగాణ స‌చివాల‌యంలో మంత్రి ఉత్త‌మ్ మీడియాతో మాట్లాడారు.

ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. రైతులను అయోమయంలో పడేసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే తెలంగాణా రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి న‌మోదైంది. ధాన్యం కొనుగోలు, దిగుబడిలో బీఆర్ఎస్ అసత్య ప్రచారానికి పాల్పడుతుంది. శాసనసభ, లోకసభ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ నేతలకు కనువిప్పు కల‌గలేదు అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు.

90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

భారతదేశం మొత్తంలోనే రికార్డ్ స్థాయిలో దిగుబడి, కొనుగోళ్లు జరిపింది తెలంగాణా రాష్ట్రంలోనే. ఈ రబీ సీజన్‌లో 67 లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. 141 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రానుంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యానికి గాను రైతులకు ఇప్పటి వరకు మొత్తం రూ. 2310 కోట్లు చెల్లించింది. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు గాను రూ. 21 వేలు కోట్లు కేటాయింపులు చేశామ‌ని మంత్రి ఉత్త‌మ్ తెలిపారు.

బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాల అంశలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ముందెన్నడూ లేని రీతిలో వసతులు కల్పించాం. అకాల వర్షాలు సంభవిస్తే ధాన్యం తడిసి పోకుంటా ఉండేందుకు గాను 2.63 లక్షల టార్బాలిన్స్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 18.75 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాం. 64.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్ధ్యం ఏర్పాటు చేశాం. అదనంగా 11.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములను గుర్తించాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు గాను 6,200 వాహనాల ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాలలో రైతులకు దాహార్తి తీర్చేందుకు వీలుగా మంచినీరు, ఓఆర్ఎస్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

రైతులు చనిపోతే తక్షణమే పరిహారం

కొనుగోలు కేంద్రాలలో రైతులు చనిపోతే తక్షణమే పరిహారం అందిస్తున్నాం. కొనుగోలు కేంద్రాలలో ఉదయం, సాయంత్రం పూట కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చాం. అకాల వర్షాలు సంభవిస్తే రైతులు, సిబ్బంది చెట్ల‌ కింద, కరెంట్ స్తంభాల దగ్గర ఉంటే పిడుగుపాటుకు గురి కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు.

రైతులు నిరీక్షించకుండా ప్రత్యేక టోకెన్లు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షిస్తున్నారు. అన్నింటికీ మించి ధాన్యం కొనుగోలు అంశంపై ప్రత్యేకించి పౌర సరఫరాల శాఖా కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశాం. అన్నింటికీ మించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా ప్రత్యేక టోకెన్లు జారీ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు రికార్డ్ స్థాయిలో జరిగాయని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు.

కొనుగోళ్ల వివ‌రాలు ఇలా..

  • 2023-24 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌లో 47.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024-25 ఖరీఫ్‌లో 53.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
  • 2023-24 బీఆర్ఎస్ పాలనలో నాటి ప్రభుత్వం ఖరీఫ్ లో కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 10,415 కోట్లు చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024-25 ఖరీఫ్‌లో రూ. 12,512 కోట్లు చెల్లించాం.
  • ఆ మాటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023-24 రబీలో 7178 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 7 లక్షల 62 వేల మంది రైతుల నుండి 47.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 10549 కోట్లు రైతులకు చెల్లించాం.
  • 2024-25 రబీలో 8378 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 10 లక్షల 87 వేల మంది రైతుల నుండి 74.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 17198 కోట్లు రైతులకు చెల్లించాం.
  • 2025-26 ఖరీఫ్‌లో 8448 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 11 లక్షల 65వేల మంది రైతుల నుండి 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 17160 కోట్లు రైతులకు చెల్లించాం.
  • ప్రస్తుత రబీలో 8575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 13 లక్షల మంది రైతుల నుండి రికార్డ్ స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుని రూ. 21,501 కోట్లు రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.

బీఆర్ఎస్ నేతలు గుణపాఠం నేర్చుకోలేదు

ఈ గణాంకాలు అన్నీ అధికారికంగా విడుదల చేస్తున్నాం. సీజన్‌కు సీజన్ పోటీపడుతూ రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతుంది. అదే రికార్డ్ స్థాయిలో ప్రభుత్వం కొనుగోళ్ల ప్రక్రియ చేప‌ట్టింది. తప్పుడు సమాచారంతో రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టోద్దు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మడం లేదు. వరుసగా నాలుగు ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించినా బీఆర్ఎస్ నేతలు గుణపాఠం నేర్చుకోలేదు అని ఉత్త‌మ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement