త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ‘స‌ర్‌’పై ఎన్నో అనుమానాలు

Ponnam Prabhakar | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలి అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కుల విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకత అవసరం అని ఆయ‌న పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలు ప్రజల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలను కలిగిస్తున్నాయ‌న్నారు.

S

Telangana | Published On Sep 24, 2026, 4.25 pm IST

Ponnam Prabhakar | ‘స‌ర్‌’పై ఎన్నో అనుమానాలు
Advertisement

ఫారం-6లో మార్పులపై స్పష్టత ఇవ్వాలి
ఓట‌ర్ల డేటా ఎవ‌రు మార్చారు..?
ఎంత మంది పేర్లు తొలగించారు..?
ఎన్నిక‌ల సంఘాన్ని నిల‌దీసిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలి అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కుల విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకత అవసరం అని ఆయ‌న పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలు ప్రజల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలను కలిగిస్తున్నాయ‌న్నారు. ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి పునాది. ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన బాధ్యత అని పొన్నం చెప్పారు.

గత 10 నెలల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారి అభ్యంతరాలు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఎన్నికల జాబితా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంశాలను కూడా స్పృశిస్తున్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

ఫారం-6లో మార్పులు.. ఏ ప్రక్రియను అనుసరించారు?

కొత్తగా ఓటు హక్కు పొందే పౌరులు ఉపయోగించే ఫారం-6లో స‌ర్‌కు సంబంధించిన ప్రశ్నలను చేర్చడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలి. ఫారం-6 నిబంధనల ప్రకారం నిర్దేశించిన చట్టబద్ధమైన ఫారం అయితే, అందులో మార్పులు చేయడానికి ఏ ప్రక్రియను అనుసరించారు? ఎవరి అనుమతితో మార్పులు చేశారు? ఆ మార్పులకు చట్టపరమైన ఆధారం ఏమిటి? అనే విషయాలను ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందే యువతకు ఎలాంటి అనవసర ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఫారం-6లో చేసిన మార్పులపై పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని తెలిపారు.

ECINet, ఓటర్ల డేటాపై పారదర్శకత అవసరం

ECINet వంటి కేంద్రీకృత ఐటీ వ్యవస్థ ద్వారా ఓటర్ల డేటాలో మార్పులు చేసే విధానం ఉంటే, క్షేత్రస్థాయిలో చట్టబద్ధమైన అధికారాలు కలిగిన ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్స్ (EROs) పాత్ర, వారి పర్యవేక్షణ, బాధ్యత ఏమిటో ఎన్నికల సంఘం స్పష్టం చేయాలి. ఓటర్ల డేటా ఎవరు మార్చారు? ఎప్పుడు మార్చారు? ఏ కారణంతో మార్చారు? ఏ అధికారి అనుమతితో మార్చారు? అనే వివరాలకు ఆడిట్ ట్రయల్ ఉండాలి. అవసరమైన మేరకు ఆ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థల విషయంలో భద్రతా ప్రమాణాలు, అధికారాల విభజన, జవాబుదారీతనం వంటి అంశాలపై స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఓటర్ల పేర్ల తొలగింపుపై పూర్తి వివరాలు వెల్లడించాలి

స‌ర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగించబడినట్లు నివేదికలు వెలువడ్డాయి. అయితే పేర్ల తొలగింపు ఏ కారణాలపై జరిగింది? ఎంతమంది పేర్లు తొలగించారు? ఎంతమంది అభ్యంతరాలు తెలిపారు? ఎన్ని పేర్లు తిరిగి చేర్చారు? అనే పూర్తి వివరాలను రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం బహిరంగపరచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయం రాజకీయ వాదోపవాదాల ద్వారా తేలకూడదు. ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్తి డేటా, తొలగింపుల వివరాలు, కొత్తగా చేర్చిన పేర్లు, అభ్యంతరాలు, అప్పీళ్ల పరిష్కారం వంటి సమాచారాన్ని ప్రజల ముందుంచాలని పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు.

పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలి

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలోని ఎన్నికల సంఘం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తకుండా ప్రతి నిర్ణయం చట్టబద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా చూడాలి. అదే సమయంలో, ఎన్నికల సంఘం అన్ని నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే జరిగాయని ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టం చేసిన విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తున్నాను. వివిధ స్థాయిల్లో నమోదైన అభ్యంతరాలపై పూర్తి వివరాలను బహిరంగపరచడం ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు.

తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడుతాం

తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కు కాపాడబడేలా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. ఒక్క అర్హుడైన ఓటరు పేరు కూడా పొరపాటున తొలగించకుండా చూడటం ఎంత ముఖ్యమో, అనర్హమైన పేర్ల విషయంలో చట్టం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు. అందువల్ల ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, డేటా మార్పులు వంటి ప్రతి దశలో పారదర్శకత, చట్టబద్ధత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని నేను స్పష్టం చేస్తున్నాను అని పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement