త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | తెలంగాణ ఏర్పాటుపై.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు అజ్ఞానానికి పరాకాష్ట : మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య‌ చేసిన వ్యాఖ్యలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు.

S

Telangana | Published On Apr 16, 2026, 5.18 pm IST

Jupally Krishna Rao | తెలంగాణ ఏర్పాటుపై.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు అజ్ఞానానికి పరాకాష్ట : మంత్రి జూపల్లి కృష్ణారావు
Advertisement

Jupally Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య‌ చేసిన వ్యాఖ్యలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు. బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అన్నా, ఇక్కడి ప్రజల అభ్యున్నతి అన్నా మొదటి నుంచి కడుపుమంట అని ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. అనేది వందలాది మంది యువకుల బలిదానాలు, దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ఆమోదించిన ప్రక్రియను దేశ విభజనతో పోల్చడం ఎంపీ అజ్ఞానానికి పరాకాష్ట. గతంలో ప్రధాని మోదీ కూడా ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అని మాట్లాడారు. ఆ విద్వేష భావజాలమే ఇప్పుడు ఎంపీ తేజ‌స్వీ సూర్య‌ మాటల్లో ప్రతిబింబిస్తోంది అని మంత్రి దుయ్యబట్టారు.

రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. ఒక తల్లి మనసుతో తెలంగాణ బిడ్డల ఆవేదనను అర్థం చేసుకున్న వ్యక్తి సోనియా గాంధీ. కానీ బీజేపీ నేతలు మాత్రం నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నారు. ఓట్ల కోసం ఇక్కడి ప్రజలను వాడుకుంటూ, మనసులో మాత్రం తెలంగాణ పట్ల విద్వేషాన్ని నింపుకున్నారని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

చిన్న రాష్ట్ర‌మైన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే.. ఓర్వలేకనే బీజేపీ నేత‌లు ఇలాంటి వివాదాలకు తెరలేపుతోందని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎంపీ తేజ‌స్వీ సూర్య‌ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మంత్రి హెచ్చరించారు.

Advertisement
Advertisement