త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CV Anand | ప్రత్యేక హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్‌పై కోర్టు ధిక్కార చర్యలు

CV Anand | మన శంకర వ‌ర ప్రసాద్ గారు సినిమా టికెట్ల‌ ధరల పెంపు అంశంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సమాచారం ఇవ్వకుండా వ్యవహరించినందుకు ప్రత్యేక హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్‌పై కోర్టు ధిక్కార (కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్) చర్యలు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది.

S

Telangana | Published On Jan 21, 2026, 9.42 am IST

CV Anand | ప్రత్యేక హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్‌పై కోర్టు ధిక్కార చర్యలు
Advertisement

CV Anand | మన శంకర వ‌ర ప్రసాద్ గారు సినిమా టికెట్ల‌ ధరల పెంపు అంశంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సమాచారం ఇవ్వకుండా వ్యవహరించినందుకు ప్రత్యేక హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్‌పై కోర్టు ధిక్కార (కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్) చర్యలు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ఈ మేరకు రిజిస్ట్రీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు జనవరి 8న సీవీ ఆనంద్ మెమో జారీ చేసినప్పటికీ, అదే అంశానికి సంబంధించిన మరో కేసు విచారణ సందర్భంగా జనవరి 9న కోర్టుకు ఈ విషయం తెలియజేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ ధర్మాసనానికి తెలిపారు. ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాకు టికెట్ ధరల పెంపుపై మూడు రిట్ పిటిషన్లను విచారించిన కోర్టు, ఆ రోజే ధరల పెంపు అనుమతిని తక్షణమే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, అంతకుముందే చిరంజీవి సినిమా విషయంలో టికెట్ ధరల పెంపుకు మెమో జారీ చేసిన విషయం కోర్టుకు తెలియజేయకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ న్యాయవాది సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దీనిని కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా భావించిన ధర్మాసనం, స్వయంగా కాంటెంప్ట్ కేసు నమోదు చేయడం సముచితమని పేర్కొంది. అంతేకాకుండా, టికెట్ ధరల పెంపు మెమో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌కు కూడా జారీ చేసిన నేపథ్యంలో, ఆయన‌ను నాలుగో ప్రతివాదిగా కేసులో చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది. ఇకపై సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపుకు సంబంధించిన వివరాలను ప్రజా డొమైన్‌లో ఉంచాలని ప్రత్యేక హోంశాఖ కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయం తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1955లోని సెక్షన్ 7ఏ ప్రకారం, టికెట్ ధరల పెంపుపై ఆసక్తి ఉన్న ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చని పిటిషనర్ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు నేపథ్యంలో తీసుకున్నదిగా కోర్టు పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement