త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభవార్త‌.. జూన్ 1లోగా హెల్త్ కార్డులు

Telangana | రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌చ్చే నెల ఒక‌ట‌వ తేదీలోగా ఆరోగ్య భద్రత కార్డులను అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వందరోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On May 2, 2026, 7.08 pm IST

Telangana | ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభవార్త‌.. జూన్ 1లోగా హెల్త్ కార్డులు
Advertisement

వంద రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం
పీఆర్సీపై తక్షణమే నివేదిక అందించాలని ఆదేశించాం
ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి

Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌చ్చే నెల ఒక‌ట‌వ తేదీలోగా ఆరోగ్య భద్రత కార్డులను అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వందరోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు. వాటి ఖ‌ర్చు ప్రాధాన్య‌త ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని ఆదేశించామ‌ని, ఆ నివేదిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులు స‌చివాలయంలో ముఖ్య‌మంత్రితో శ‌నివారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించినందుకు రేవంత్‌రెడ్డికి ఉద్యోగ సంఘాల నాయ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అనంత‌రం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌ల‌ను రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించింద‌ని గుర్తు చేసుకున్నారు. వైద్య విధాన ప‌రిష‌త్‌లో 13,100 మందిని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని కొనియాడారు. పీఆర్‌సీ, హెల్త్ కార్డుల స‌మ‌స్య‌ల‌తో పాటు ఉద్యోగ సంఘాల ఇత‌ర డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని వారు ముఖ్య‌మంత్రిని కోరారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని ప్ర‌శంసించారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామ‌ని చెప్పారు. త‌మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామ‌ని గుర్తు చేశారు. ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామ‌న్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామ‌ని చెప్పారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశామ‌ని వివ‌రించారు. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామ‌న్నారు. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని సూచించారు. త‌మ‌ది ఫ్రెండ్లీ ప్రభుత్వమ‌ని, ఉద్యోగుల‌ సమస్యలను పరిష్కరించే బాధ్యత త‌మ‌ద‌ని ఉద్ఘాటించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement