త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

State Museum | వైఎస్సార్‌ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం

State Museum | చారిత్రక, పురావస్తు సంపదకు నిలయమైన వైఎస్సార్ మ్యూజియాన్ని ఆధునిక వసతులతో పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. మ్యూజియం అభివృద్ధికి అవసరమైన నిధులను త్వరలోనే సమకూర్చనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

P

Telangana | Published On Aug 19, 2026, 6.37 pm IST

State Museum | వైఎస్సార్‌ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం
Advertisement
  • 2500 ఏళ్ల నాటి ఈజిప్షియన్ మమ్మీ సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు
  • మ్యూజియం పునరుద్ధరణకు త్వరలో నిధులు
  • దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు
  • మంత్రి జూపల్లి కృష్ణారావు

State Museum | చారిత్రక, పురావస్తు సంపదకు నిలయమైన వైఎస్సార్ మ్యూజియాన్ని ఆధునిక వసతులతో పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. మ్యూజియం అభివృద్ధికి అవసరమైన నిధులను త్వరలోనే సమకూర్చనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దేశ, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు తప్పక సందర్శించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న వైఎస్సార్ రాష్ట్ర హెరిటేజ్ మ్యూజియాన్ని బుధవారం మంత్రి సందర్శించారు. వివిధ గ్యాలరీలను పరిశీలించిన ఆయన.. అక్కడ భద్రపరిచిన అరుదైన పురావస్తు, చారిత్రక వస్తువుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రాంజ్, బుద్ధిస్ట్, శిల్పకళ, ఫిరంగులు, పెయింటింగ్ గ్యాలరీలను పరిశీలించారు.

మమ్మీ సంరక్షణకు రూ.82 లక్షలు

మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న క్రీ.పూ. 2500 ఏళ్ల నాటి ఈజిప్షియన్ మమ్మీని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ మమ్మీని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జర్మనీ నిపుణుల నివేదిక ఆధారంగా మమ్మీ సంరక్షణ కోసం రూ.82 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మ్యూజియంలోని అరుదైన సంపద, చారిత్రక విశేషాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు విస్తృత ప్రచారం కల్పించాలని జూపల్లి సూచించారు. హైదరాబాద్‌కు వచ్చే దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కొత్త కార్యక్రమాలు, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. మ్యూజియం భవన సంరక్షణ, పునరుద్ధరణ, పెయింటింగ్ తదితర పనులను సమగ్రంగా చేపట్టాలని స్పష్టం చేశారు.

వారంలోగా అంచనాలు

మ్యూజియం పునరుద్ధరణ, భవన సంరక్షణ, పెయింటింగ్ పనులకు సంబంధించిన సమగ్ర అంచనాలను రూపొందించి వారంలోగా సమర్పించాలని పురావస్తు శాఖ డైరెక్టర్ డా. అర్జునరావును మంత్రి ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే అరుదైన సంపదను కాపాడటంతో పాటు వాటిని ప్రజలు, పర్యాటకులు సులభంగా వీక్షించేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్ట‌ర్ రాములు నాయక్, నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ బీ మధు, డీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement