త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fee Reimbursement | ఇక‌పై విద్యార్థుల ఖాతాకే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌

G

Telangana | Published On May 1, 2026, 8.53 am IST

Fee Reimbursement | ఇక‌పై విద్యార్థుల ఖాతాకే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌
Advertisement

Fee Reimbursement | త్రినేత్ర‌.న్యూస్‌: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌లో (Fee Reimbursement) ప్ర‌భుత్వం కీల‌క మార్పులు చేసింది. ఇక‌పై నేరుగా విద్యార్థుల ఖాతాలో రీయింబ‌ర్స్‌మెంట్ డ‌బ్బుల‌ను జ‌మ‌చేయ‌నుంది. 2026-27 విద్యా సంవ‌త్స‌రం నుంచే ఈ విధానం అమ‌ల్లోకి రానుంది.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు పేరుకుపోవ‌డంతో ఇంజినీరింగ్ కాలేజీలు స‌హా ప‌లు ప్రైవేటు విద్యాసంస్థ‌లు హైకోర్టును ఆశ్ర‌యించాయి. దీంతో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి విద్యార్థులే ఫీజులు చెల్లించాలంటూ న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. ఈ నేప‌థ్యంలో పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని జమ చేస్తూ వ‌స్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆధార్‌ పేమెంట్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్ (APBS) ద్వారా నేరుగా అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాకే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(DBT) విధానంలో డ‌బ్బుల‌ను బదిలీ చేయనుంది.

ఇప్ప‌టికే ఎస్సీ విద్యార్థుల‌కు దీన్ని అమ‌లు చేస్తుండ‌గా, ఇక నుంచి ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులంద‌రికీ వ‌ర్తింప‌చేయ‌నుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మిష‌న్ల స‌మ‌యంలో కాలేజీలు విద్యార్థుల‌ను ఫీజు చెల్లించాల‌ని వేధించ‌కూడ‌ద‌ని స్ఫ‌ష్టం చేశారు.

విద్యార్థుల‌ను వేధించొద్దు..

ప్ర‌భుత్వం విద్యార్థుల ఖాతాలో నిధులు జ‌మ చేసిన త‌ర్వాత, ఆ ఫీజును కాలేజీల‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ ప్ర‌భుత్వం డ‌బ్బులు వేయ‌క‌పోతే, ఆ బాధ్య‌త ప్ర‌భుత్వం మీద‌నే ఉంటుంద‌ని, విద్యార్థులను అడ్మిష‌న్ల ద‌గ్గ‌ర ఆప‌కూడ‌వ‌ని నిబంధ‌న విధించారు. అయితే దీనిని కాలేజీలు అమ‌లు చేస్తాయా అనేది అనుమాన‌మే?

కాగా, ప్ర‌స్తుతం చ‌దువుతున్న వారు, 2025-26 విద్యా సంవ‌త్స‌రం వ‌ర‌కు అడ్మిష‌న్ పొందిన విద్యార్థుల‌కు పాత ప‌ద్ధ‌తిలోనే కాలేజీల‌కే నిధులు చెల్లిస్తామ‌ని తెలిపింది. పాత బ‌కాయిల విష‌యంలో ప్ర‌స్తుతం ఉన్న వ్య‌వ‌స్థే కొన‌సాగుతుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

ఆటోమేటిక్‌ రెన్యువల్‌..

కొత్త విధానం ప్ర‌కారం స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పొందాలంటే విద్యార్థుల‌కు ఆధార్ గుర్తింపు త‌ప్ప‌నిస‌రి. ఆధార్‌ లింక్‌ చేసిన విద్యార్థి బ్యాంక్‌ ఖాతాకే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఏ పీబీఎస్‌ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. దరఖాస్తు సమయంలో ఆధార్‌ వివరాలు ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. ఈపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేస్టేషన్‌ కోసం బయోమెట్రిక్‌ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్‌ లింక్‌ చేసిన బ్యాంక్‌ ఖాతా మాత్రమే సమర్పించాలి. బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎన్‌పీసీఐ ద్వారా ధ్రువీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు మీసేవ ద్వారా ఆధార్‌తో లింక్‌ చేయాలి. రెన్యువల్‌ అప్లికేషన్లు ఆటోమేటిక్‌గా కొనసాగుతాయి. కాలేజీలు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపాలి.

ప్రతి కాలేజీలో ప్రత్యేక నోడల్‌ అధికారి

విద్యార్థుల ప్రోగ్రెస్‌ ట్రాకింగ్‌ కోసం ఈపాస్‌లో ప్రత్యేక మాడ్యూల్‌ రూపొందించాలి. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కోసం ప్రతి కాలేజీలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలి. ఆధార్‌ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు తర్వాత విద్యార్థులు హార్డ్‌ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుదమెంట్లు డిజిటల్‌గా అప్‌లోడ్‌ చేయాలి.

Advertisement
Advertisement