త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Praja Palana | ఈ నెల 20 నుంచి తెలంగాణవ్యాప్తంగా ‘వెల్ఫేర్ వీక్’.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సీఎస్ స‌మీక్ష‌

Praja Palana | 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

P

Telangana | Published On Apr 18, 2026, 7.29 pm IST

Praja Palana | ఈ నెల 20 నుంచి తెలంగాణవ్యాప్తంగా ‘వెల్ఫేర్ వీక్’.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సీఎస్ స‌మీక్ష‌
Advertisement

Praja Palana | 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా “వెల్ఫేర్ వీక్” నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమాల అమలు విధానంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ రోజువారీ షెడ్యూల్‌ను వివరించారు. ప్రతి రోజు విద్య, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

షెడ్యూల్ ఇలా..

ఏప్రిల్ 20: అన్ని వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటశాలలు, శానిటేషన్‌పై సమగ్ర శుభ్రత కార్యక్రమం నిర్వహించాలి. అధికారులు స్వయంగా విద్యాసంస్థలను సందర్శించి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించాలి.
ఏప్రిల్ 21: వెల్ఫేర్ విద్యార్థుల కోసం క్విజ్, డిబేట్, చిత్రలేఖనం వంటి పోటీలతో టాలెంట్ ఫెస్ట్ నిర్వహించి సృజనాత్మకత, మేధస్సును ప్రోత్సహించాలి.
ఏప్రిల్ 22: హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులపై దృష్టి పెట్టి అంచనాలు సిద్ధం చేయాలి. అనుమతులు తీసుకుని వేసవి సెలవుల్లో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఏప్రిల్ 23: తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు (PTMs) నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించాలి. విద్యా ప్రతిభను ప్రోత్సహించాలి.
ఏప్రిల్ 24: యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రభుత్వ పథకాలను వివరించాలి.
ఏప్రిల్ 25: విద్యార్థుల కోసం క్రీడలు, కళలు, సంగీతం, డిజిటల్ లిటరసీ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలతో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి.
ఏప్రిల్ 26: రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో “బడి బాట” కార్యక్రమం నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్లు ప్రతి కార్యక్రమం అమలును క్షుణ్ణంగా పర్యవేక్షించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ సూచించారు. ప్రజాప్రతినిధులను అన్ని కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వామ్యం చేయడం ద్వారా విస్తృత ప్రచారం, పారదర్శకత పెరుగుతుందని ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వీసీలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సీఐపీఆర్ సీహెచ్ ప్రియాంక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement