త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం

తెలంగాణలో ఆగస్టు 24 నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్లు తలపెట్టిన నిరవధిక సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. సమస్యలు వెంటనే పరిష్కరించాలని సర్కార్‌ను డిమాండ్ చేసింది.

J

Telangana | Published On Aug 20, 2026, 5.24 pm IST

Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం
Advertisement
  • ఆగస్టు 24 నుంచి ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ (Transport JAC) ఆధ్వర్యంలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక సమ్మె
  • ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ
  • ఓలా, ఉబర్, రాపిడో కమీషన్ల దోపిడీని అరికట్టాలని, డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్
  • సమ్మెకు వెళ్లకముందే డ్రైవర్లతో చర్చలు జరిపి, కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి

Telangana Auto Drivers Strike | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో మరోసారి రవాణా రంగం స్తంభించే అవకాశం కనిపిస్తోంది. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 24 నుంచి ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ (Transport JAC) తలపెట్టిన 'నిరవధిక సమ్మె'కు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, సమ్మెకు వెళ్లకముందే జేఏసీ నాయకులతో చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన డ్రైవర్లు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలతో కుటుంబ పోషణ భారంగా మారితే.. మరోవైపు ఓలా (Ola), ఉబర్ (Uber), రాపిడో (Rapido) లాంటి యాప్ ఆధారిత సంస్థలు వసూలు చేస్తున్న అధిక కమీషన్ల (Commissions) వల్ల డ్రైవర్లకు కనీస ఆదాయం కూడా మిగలడం లేదని సీపీఎం ఆవేదన వ్యక్తం చేసింది.

సంక్షేమ బోర్డు, పెన్షన్ ఏవి?

దశాబ్దాలుగా రవాణా రంగ కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్ల ప్రధాన డిమాండ్లను సీపీఎం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది.

ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునేలా డ్రైవర్లందరికీ సమగ్ర ఇన్సూరెన్స్ (Insurance) కల్పించాలి.

50 ఏళ్లు దాటిన డ్రైవర్లకు పెన్షన్ (Pension) సౌకర్యం అందించాలి.

రాష్ట్రంలో ఉన్న దాదాపు 25 లక్షల మంది రవాణా రంగ కార్మికులు, డ్రైవర్ల కోసం వెంటనే ఒక 'ప్రత్యేక సంక్షేమ బోర్డు' (Welfare Board) ఏర్పాటు చేయాలి.

ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చింది. ఆ హామీల మేరకు డ్రైవర్లకు సంక్షేమ పథకాలు, ఆర్థిక భరోసా కల్పించాలని సీపీఎం కోరింది. ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్, లారీ, డీసీఎం డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 24న జరిగే నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు సీపీఎం పిలుపునిచ్చింది. లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Advertisement
Advertisement