త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

నోరు జారితే రాజకీయం మారుతుందా?.. బీఆర్ఎస్‌కు దెబ్బ.. కాంగ్రెస్‌కు చిక్కు!

ఒక్క మాట తూలితే బీఆర్ఎస్ వ్యూహం కుప్పకూలింది. మరో మాటతో కాంగ్రెస్ నైతిక చిక్కుల్లో పడింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలు కాదు.. నేతల నోరు జారిన మాటలే హెడ్‌లైన్ గా మారాయి.

S

Telangana | Published On Sep 8, 2026, 6.17 pm IST

నోరు జారితే రాజకీయం మారుతుందా?.. బీఆర్ఎస్‌కు దెబ్బ.. కాంగ్రెస్‌కు చిక్కు!

సంక్షిప్త సారాంశం

తాతా మధు వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను అసలు ఎజెండా నుంచి డిఫెన్స్‌లోకి నెట్టాయి. వీర్లపల్లి శంకర్ మాటలు కాంగ్రెస్‌పైనే నైతిక ప్రశ్నలు లేవనెత్తాయి. రెండు పార్టీలూ ఒకరి మాటలను మరొకరు ఆయుధంగా మార్చుకున్నాయి. ఫలితంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలు వెనక్కి పోయి, మాటల రాజకీయమే ముందుకు వచ్చింది.

Advertisement

                                        ఒక్క మాటతో మారిపోయిన రాజకీయం.. తాతా మధు నుంచి వీర్లపల్లి శంకర్ వరకు

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రెండు రోజుల్లో రాజకీయ ఎజెండా అనుకున్నదానికంటే పూర్తిగా మారిపోయింది. ప్రజా సమస్యలు, హామీల అమలు, పాలనా వైఫల్యాలపై చర్చ జరగాల్సిన చోట.. వ్యక్తిగత వ్యాఖ్యలు, అవమానాలు, ఆవేదనలు, అరెస్టులు ప్రధాన అంశాలుగా మారాయి. ఈ మార్పులో రెండు కీలక మాటలు కేంద్రబిందువులుగా నిలిచాయి. ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యాఖ్యలు. రెండోది కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలు.

తాతా మధు మాట.. బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది

బీఆర్ఎస్ అసలు ప్రణాళిక స్పష్టంగా ఉంది. నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ పాలనను ప్రజా సమస్యలపై నిలదీయడం. కానీ గేటు వద్ద జరిగిన వాగ్వాదంలో తాతా మధు చేసిన వ్యాఖ్యలు మొత్తం కథనాన్ని మార్చేశాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా దాడికి దిగింది. దళిత స్పీకర్ గౌరవం, సభా మర్యాద — ఇవన్నీ కాంగ్రెస్ చేతిలోకి వచ్చాయి. వివాదం చివరకు పోలీసు కేసులు, తాతా మధు సహా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల (తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి) అరెస్టుల వరకు వెళ్లింది. ఇద్దరిపైనా ఎస్సీ/ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది.

తర్వాత బీఆర్ఎస్ నేతలు డామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు చేశారు. తాతా మధు తాను స్పీకర్‌ను దూషించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు. అభ్యంతరకరంగా భావించిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి సిద్ధమని కూడా చెప్పారు. అయినా రాజకీయంగా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. అసలు ఎజెండా వెనక్కి పోయి, రక్షణాత్మక రాజకీయంలోకి బీఆర్ఎస్ నెట్టబడింది.

వీర్లపల్లి శంకర్ మాట.. కాంగ్రెస్‌కు నైతిక చిక్కు

ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చావు కోరుకుంటున్నామని, ఆయన రాష్ట్రానికి పట్టిన పీడ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించి ఆయన బొమ్మను కాల్చింది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక ప్రశ్న తప్పదు. తాతా మధు వ్యాఖ్యలను సభా గౌరవం, దళిత అవమానం అని తీవ్రంగా తప్పుపడుతున్న కాంగ్రెస్.. వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటుంది? ఒకవైపు ప్రతిపక్షం మాటలపై నైతికత మాట్లాడుతూ, మరోవైపు తమ ఎమ్మెల్యే అదే తరహా భాషను వాడితే సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఈ ప్రశ్నను కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ప్రజాస్వామ్యంలో స్పీకర్ కుర్చీ ఎంత  గౌరవ ప్రదనీయమైనదో అలాగే ప్రతిపక్ష హోదాను కూడా పార్లమెంటరీ సంప్రదాయలకు అనుగుణంగా గౌరవించాల్సిన హోదానే. ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవి ఎంత కీలకమో, అలగే ప్రతిపక్ష హోదా కూడా  కీలకమైన పదవే.

నేతల వ్యాఖ్యలు.. గతంలోనూ రాజకీయ నష్టం

భారత రాజకీయాల్లో నేతల నోటి నుంచి వచ్చిన ఒక్కో మాట ఎన్నికల ఎజెండానే మార్చేసిన సందర్భాలున్నాయి. 2014 ఎన్నికలకు ముందు మణిశంకర్ అయ్యర్ చేసిన టీ అమ్ముకునే వ్యాఖ్యను బీజేపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. 2017 గుజరాత్ ఎన్నికల సమయంలో ఆయన చేసిన ‘నీచ్ ఆద్మీ’ వ్యాఖ్య మరోసారి వివాదాస్పదమై, చివరకు కాంగ్రెస్ ఆయనను సస్పెండ్ చేసింది. అంతకుముందు 2007 గుజరాత్ ఎన్నికల్లో సోనియా గాంధీ చేసిన ‘మౌత్ కా సౌదాగర్’ వ్యాఖ్యను కూడా బీజేపీ తన ప్రచారంలో బలమైన రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంది.

తెలంగాణలో ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలూ మాటల రాజకీయ ప్రభావాన్నే గుర్తుచేస్తున్నాయి. తాతా మధు వ్యాఖ్యల వివాదం బీఆర్ఎస్‌ను తన అసలు ఎజెండా నుంచి డిఫెన్స్‌లోకి నెడితే.. వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ముందుకు తెచ్చిన రాజకీయ నైతికతపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

రాజకీయాల్లో మాట అనేది రెండంచుల కత్తి. ఒక్కసారి నోటి నుంచి బయటపడితే, డామేజ్ కంట్రోల్ ఎంత చేసినా రాజకీయ నష్టం మాత్రం తప్పదు. తాతా మధు, వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యల చుట్టూ సాగుతున్న రాజకీయం ఇదే చెబుతోంది.

 

Advertisement
Advertisement