త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Govt | రిజిస్ట్రేష‌న్ల‌కు డిమాండ్‌.. స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌యాల పనివేళ‌లు పెంచిన ప్ర‌భుత్వం..

TG Govt | రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 12వ తేదీ నుంచి 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని వేళలను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు.

P

Telangana | Published On May 9, 2026, 5.53 pm IST

TG Govt | రిజిస్ట్రేష‌న్ల‌కు డిమాండ్‌.. స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌యాల పనివేళ‌లు పెంచిన ప్ర‌భుత్వం..
Advertisement

TG Govt | రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 12వ తేదీ నుంచి 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని వేళలను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు. భూముల ధరల సవరణ, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే ఉన్న హెచ్చుతగ్గులను క్రమబద్ధీకరించాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తర్వాత రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ 15 కార్యాలయాల్లో అదనపు పని వేళలు..

చంపాపేట్, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ ఆర్‌ఓ, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని వేళలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పని వేళలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అవసరమైతే ఇంకా సమయం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

స్లాట్ బుకింగ్ పెంపు

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ రద్దీ పెరిగిన కార్యాలయాలను గుర్తించి అదనపు సమయాన్ని అమలు చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహసీల్దార్ కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, వేగం, ప్రజలకు సౌకర్యం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతును కూడా మంత్రి ఆదేశించారు.

Advertisement
Advertisement