త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Softball | జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్‌.. ఖేలో ఇండియాలో తొలిసారి అవకాశం

Softball | తెలంగాణ వేదికగా జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో (Khelo India Games) మరో క్రీడకు అవకాశం ల‌భించింది. ఖేలో ఇండియా చరిత్రలో తొలిసారిగా సాఫ్ట్‌బాల్‌ను (Softball) ఈసారి చేర్చారు.

G

Telangana | Published On Nov 29, 2026, 11.47 am IST

Softball | జాతీయ వేదికపై సాఫ్ట్‌బాల్‌.. ఖేలో ఇండియాలో తొలిసారి అవకాశం
Advertisement

Softball | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ వేదికగా జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో (Khelo India Games) మరో క్రీడకు అవకాశం ల‌భించింది. ఖేలో ఇండియా చరిత్రలో తొలిసారిగా సాఫ్ట్‌బాల్‌ను (Softball) ఈసారి చేర్చారు. ఇప్పటివరకు జాతీయ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లు, పాఠశాలల క్రీడల్లో ప్రతిభ చాటుతున్న యువ క్రీడాకారులకు ఖేలో ఇండియా మరో వేదిక కానుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలో ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ది. జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు విజయాలు సాధించిన తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు సొంతగడ్డపై ప్రతిభను చాటుకునే అవకాశం లభించింది.

బేస్‌బాల్‌ను పోలిన ఆట

సాఫ్ట్‌బాల్‌ క్రీడ బేస్‌బాల్‌ను పోలి ఉంటుంది. క్రికెట్‌ మాదిరిగానే బ్యాట్‌, బంతితో ఆడతారు. ఫీల్డింగ్‌ చేసే జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లు ఫీల్డ్ లో ఉంటారు. ఒక జట్టు బ్యాటింగ్‌ చేస్తే మరో జట్టు ఫీల్డింగ్‌ చేస్తుంది. మైదానంలో వజ్రాకారంలో నాలుగు బేస్‌లు ఉంటాయి. బ్యాటర్‌ బంతిని కొట్టిన తర్వాత వరుసగా బేస్‌లను దాటుతూ తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటే ఒక పరుగు లభిస్తుంది. సాధారణంగా ఏడు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ జరుగుతుంది. బేస్‌బాల్‌తో (Baseball) పోలిస్తే సాఫ్ట్‌బాల్‌ గ్రౌండ్‌ చిన్నది. బంతి సైజ్‌ పెద్దది. చేతిని కింది నుంచి ఊపుతూ బంతిని విసరటం ఈ క్రీడ ప్రత్యేకత.

ఒలింపిక్స్‌లో మళ్లీ చోటు

1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో తొలిసారిగా మహిళల సాఫ్ట్‌బాల్‌ను చేర్చారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఈ క్రీడకు కొంతకాలం విరామం వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో తిరిగి అవకాశం కల్పించారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ క్రీడకు చోటు దక్కలేదు. 2028లో అమెరికాలో జరిగే లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లోనూ సాఫ్ట్‌బాల్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఆరు దేశాల మహిళల జట్లు ఈ పోటీల్లో తలపడతాయి. ఒలింపిక్స్‌లో సాఫ్ట్‌బాల్‌కు తిరిగి చోటు దక్కిన నేపథ్యంలో భారత్‌లోనూ ఈ క్రీడకు ప్రాధాన్యం పెరుగుతోంది.

తెలంగాణ సత్తా..

సాఫ్ట్‌బాల్‌లో తెలంగాణ బాలికలు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. 2024 అక్టోబరులో ఏపీలోని నంద్యాలలో జరిగిన 42వ జాతీయ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది డిసెంబరులో జమ్మూలో జరిగిన 37వ జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లోనూ తెలంగాణ బాలికలు విజేతలుగా నిలిచారు. ఫైనల్లో ఏపీ జట్టును 5–2 తేడాతో ఓడించారు. ఈ ఏడాది గోవాలోని వాస్కోడగామాలో జరిగిన 22వ సీనియర్‌ దక్షిణ మండల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ను 5–3 తేడాతో ఓడించింది.

జిల్లాల్లోనూ ప్రతిభావంతులు

తెలంగాణలో (Telangana) హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులు రాణిస్తున్నారు. ఈ నెలలో నిర్మల్‌లోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల జూనియర్‌ బాలికల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ జరిగింది. ఫైనల్లో మహబూబ్‌నగర్‌ జట్టును 6–4 తేడాతో ఓడించి నిజామాబాద్‌ జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 18 నుంచి 22 వరకు చండీగఢ్‌లో జరిగిన 70వ జాతీయ పాఠశాలల అండర్‌–19 సాఫ్ట్‌బాల్‌ పోటీల్లోనూ తెలంగాణ ప్రాతినిధ్యం వహించింది.

ఖేలో ఇండియాలో సాఫ్ట్‌బాల్‌ పోటీల నిర్వహణకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్​) 40 మంది సాంకేతిక నిపుణులను ఎంపిక చేసింది. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్‌బాల్‌కు ప్రోత్సాహం అందిస్తోంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఈ ఏడాది నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల్లోనూ సాఫ్ట్‌బాల్‌కు చోటు కల్పించింది. జాతీయ స్థాయిలో ఇప్పటికే సత్తా చాటుతున్న తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు ఖేలో ఇండియా పోటీలు మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం కల్పించనున్నాయి.

Advertisement
Advertisement