త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAS Rahul Raj | కోర్టు ధిక్క‌ర‌ణ‌.. ఐఏఎస్ రాహుల్ రాజ్‌కు 6 నెలల జైలు శిక్ష, జ‌రిమానా

IAS Rahul Raj | ఉద్దేశ‌పూర్వ‌కంగా కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించినందుకుగాను (Contempt of Court) మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు (IAS Rahul Raj) హైకోర్టు (High Court) ఆరు నెల‌ల జైలు శిక్ష, రూ.2 వేల జ‌రిమానా విధించింది.

G

Telangana | Published On Feb 18, 2026, 8.08 am IST

IAS Rahul Raj | కోర్టు ధిక్క‌ర‌ణ‌.. ఐఏఎస్ రాహుల్ రాజ్‌కు 6 నెలల జైలు శిక్ష, జ‌రిమానా
Advertisement

IAS Rahul Raj | త్రినేత్ర‌.న్యూస్‌: ఉద్దేశ‌పూర్వ‌కంగా కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించినందుకుగాను (Contempt of Court) మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు (IAS Rahul Raj) హైకోర్టు (High Court) ఆరు నెల‌ల జైలు శిక్ష, రూ.2 వేల జ‌రిమానా విధించింది. ఆస్తి హ‌క్కుల‌కు సంబంధించి ఇరు ప‌క్షాల‌కు నోటీసులు పంపి వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘించినందుకుగాను ఈ మేర‌కు తీర్పు వెల‌వ‌రించింది.

అస‌లేం జ‌రిగిందంటే..

మెద‌క్ జిల్లా చేగుంట మండ‌లం బోనాల్ గ్రామంలో స‌ర్వే నంబ‌ర్ 284 ఏ 2లో 2.22 ఎక‌రాల హ‌క్కులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను క‌లెక్ట‌ర్ అమ‌లు చేయ‌క‌పోవ‌డాన్ని స‌వాల్ చేస్తూ న‌ల్ల‌వెల్లి ల‌క్ష్మి కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేవారు. దీనిపై పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ లక్ష్మి తన తాత భూమిని మ్యుటేషన్‌ చేసి పట్టాదారు పాస్‌బుక్‌ ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తుపై స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దానిని పరిశీలించి చట్టప్రకారం ఉత్తర్వులు వెలువరించాలని 2022 ఆగస్టులో హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ తాత ఊషయ్య భూమిని గతంలోనే గంగయ్య, నారాయణ, మల్లయ్యలకు సాదాబైనామా ద్వారా విక్రయించారని తహసీల్దారు, ఆర్‌ఐ ఇచ్చిన నివేదికను పరిశీలించి కలెక్టర్‌ ఆమె దరఖాస్తును తిరస్కరించారు.

దీనిపై పిటిషనర్ ల‌క్ష్మి మళ్లీ కోర్టును ఆశ్రయించగా ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి, సాదాబైనామా, రెగ్యులరైజింగ్‌ ప్రొసీడింగ్‌ల‌ను భూమి కొనుగోలు చేసినవారి నుంచి తెప్పించుకొని పరిశీలించాక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. కేవలం తహసీల్దారు, ఆర్‌ఐ నివేదికల ఆధారంగా దరఖాస్తును తిరస్కరించడం చెల్లదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. అయినప్పటికీ ఇరుపక్షాలకు నోటీసులు ఇవ్వకుండా.. పిటిషనర్‌ లక్ష్మి అభ్యర్థనను కలెక్టర్‌ తిరస్కరించారని వివరించారు.

దీంతో ప్రభుత్వ సహాయ న్యాయవాది సమర్పించిన రికార్డుల్లో పిటిషనర్‌కు కలెక్టర్‌ నోటీసులు ఇచ్చినట్లు ఉన్నప్పటికీ, దానికి ఎలాంటి ఆధారాలను చూపలేదని ధ‌ర్మాస‌నం అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ దశలో ప్రభుత్వ సహాయ న్యాయవాది.. వాట్సప్‌ ద్వారా పంపామని చెప్పగా, ఆ విషయాన్ని కౌంటరులో ప్రస్తావించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందున 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే అప్పీలు చేసుకోవడానికి శిక్ష‌ను 4 వారాలపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుపై కలెక్టర్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement