త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | త్వ‌ర‌లో తెలంగాణ‌లో ‘ఎస్ఐఆర్’.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ఈసీ

SIR | త్వ‌ర‌లో తెలంగాణ‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ నిర్వ‌హించ‌నున్నారు. 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

S

Telangana | Published On Mar 6, 2026, 3.03 pm IST

SIR | త్వ‌ర‌లో తెలంగాణ‌లో ‘ఎస్ఐఆర్’.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ఈసీ
Advertisement

SIR | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఎస్ఐఆర్(స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్)కు ఎన్నిక‌ల సంఘం కార్యాచ‌ర‌ణ వేగ‌వంతం చేసింది. త్వ‌ర‌లో తెలంగాణ‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ నిర్వ‌హించ‌నున్నారు. 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఓటర్ల ఎన్యూమరేటర్ల నుంచి సేకరించాల్సిన డేటాకు సంబంధించిన ఫారాల ముద్రణ, బీఎల్‌ఓలకు శిక్షణ, వారికి అవసరమైన కిట్స్‌ పంపిణీ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ఆర్థిక బిడ్స్‌ను శుక్రవారం తెరవనున్నారు. ఆ తరువాత కాంట్రాక్టర్లకు ఆ బాధ్యత అప్పగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం 3.36 కోట్ల మంది ఉన్నారు.

ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 350 మంది ఓటర్ల వివరాలను బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు నమోదు చేయనున్నారు. ప్రతీ 10 మంది బీఎల్‌ఓలకు ఒక సూపర్‌వైజర్‌ ఉంటారు. రోజూ సేకరించిన సమాచారాన్ని ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫామ్‌లలో భర్తీ చేసిన తర్వాత ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ రూపంలోకి అప్‌లోడ్‌ చేస్తారు. మండలస్థాయిలో తహసీల్దారు అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా, ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలు ఉంటారు. జిల్లాస్థాయిలో ఎలక్షన్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌ వ్యవహరిస్తారు.

రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్‌ కేంద్రాల బీఎల్‌ఓలు, మరో 15 వేల మంది అసిస్టెంట్‌ బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు.. ఇలా దాదాపు 60 వేల మంది సిబ్బందిని స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు సేకరించిన వివరాల తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, నమోదు కాకపోయినా, పేర్లతో పాటు అడ్రస్‌ గల్లంతు అయిన వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకుని పరిష్కరించడానికి నెల రోజుల గడువులోగా పూర్తి చేస్తారని సమాచారం, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పరిష్కరించిన తరువాతనే తుది జాబితా సిద్ధం చేస్తారు.

ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నాటికల్లా ఓటరు జాబితా వెలువడే అవకాశం ఉంది. అర్హత కలిగినవాళ్ల పేర్లు జాబితాలో యధావిధిగా ఉంటాయని, సమగ్రమైన వివరాలు, నిర్దిష్టమైన ప్రూఫ్‌ లేనివాళ్లు మాత్రం లిస్టులో నుంచి తొలగిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement