త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | రాష్ట్రంలో జూన్ 25 నుంచి స‌ర్‌.. ఎన్ని ఓట్లు తొల‌గిస్తారో?

SIR | తెలంగాణ‌లో స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (SIR) సైర‌న్ మోగింది. జూన్ 25 నుంచి ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ జ‌రుగ‌నుంది. తెలంగాణ‌తోపాటు దేశ‌వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో స‌ర్ మూడో ద‌శ నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (EC) నిర్ణ‌యించింది.

G

Telangana | Published On May 15, 2026, 7.07 am IST

SIR | రాష్ట్రంలో జూన్ 25 నుంచి స‌ర్‌.. ఎన్ని ఓట్లు తొల‌గిస్తారో?
Advertisement

SIR | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (SIR) సైర‌న్ మోగింది. జూన్ 25 నుంచి ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ జ‌రుగ‌నుంది. తెలంగాణ‌తోపాటు దేశ‌వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో స‌ర్ మూడో ద‌శ నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (EC) నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా సుమారు 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు (BLO) 36.73 కోట్ల మంది ఓటర్ల ఇండ్ల‌కు నేరుగా వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో శుద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అనర్హులు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి.. అర్హులైన కొత్త ఓటర్లను చేర్చనున్నారు.

రాష్ట్రంలో జూన్‌ 15 నుంచి 24వ తేదీ వరకు సన్నాహక, శిక్షణ, ప్రింటింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించాక అక్టోబర్‌ 1న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు.

రాష్ట్రంలో తొలిసారి..

రాష్ట్రంలో 3,39,20,705 మంది ఓటర్లు ఉండగా, 35,985 మంది బీఎల్‌వోలు, 25,886 మంది బీఎల్‌ఏలు సర్‌ ప్రక్రియలో పాల్గొంటారు. మొత్తం 33 జిల్లాల్లోని 13 కార్పొరేష‌న్లు, 129 ప‌ట్ట‌ణాలు, 12,769 గ్రామ‌పంచాయ‌తీల వివ‌రాల‌ను విభాగాల వారీగా అధికారులు గుర్తించి పెట్టుకున్నారు. రాష్ట్రంలోని సుమారు 83.04 ల‌క్ష‌ల కుటుంబాల వ‌ద్ద వెళ్లి బీఎల్‌వోలు స‌ర్వే నిర్వ‌హిస్తారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం జనగణన (సెన్సస్) జ‌రుగుతున్న‌ది. ఈ పనులతో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం అనుసంధానం చేసింది. క్షేత్రస్థాయి యంత్రాంగం సమన్వయంతో పనిచేయడానికి ఇది ఉపయోగపడ‌నుంది. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత రాష్ట్రంలో తొలిసారిగా జ‌న‌గ‌ణ‌న‌తోపాటు స‌ర్ నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి. ఉమ్మ‌డి రాష్ట్రంలో చివ‌రిసారిగా 2002లో ఎస్ఐఆర్ స‌ర్వే జ‌రిగింది.

కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ కార్య‌క్ర‌మం జూన్ 15 నుంచి జూలై 14 వరకు జ‌రుగ‌నుంది. సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. హిమాచల్ ప్రదేశ్, జమ్ముక‌శ్మీర్, లడఖ్ మినహా దేశమంతా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ రాష్ట్రాల్లో స‌ర్‌..

  • తెలంగాణ‌
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌
  • హ‌రియాణా
  • జార్ఖండ్‌
  • క‌ర్ణాట‌క‌
  • మ‌హారాష్ట్ర‌
  • మ‌ణిపూర్‌
  • మేఘాల‌య‌
  • మిజోరం
  • నాగాలాండ్‌
  • ఒడిశా
  • పంజాబ్‌
  • సిక్కిం
  • త్రిపుర‌
  • ఉత్త‌రాఖండ్‌

ట్యాగ్స్:

Advertisement
Advertisement