త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | సింగ‌రేణికి కొత్త సీఎండీ.. ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్‌కి బాధ్య‌త‌లు

Singareni | సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL).. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 3 ల‌క్ష‌ల మందికిపైగా కార్మికులు, వేలాది మంది అధికారులు ఉన్న అతిపెద్ద బొగ్గుగ‌ని. ఉద్యోగాల గ‌ని పేరొందిన సింగ‌రేణి (Singareni) ఇటీవ‌ల త‌ర‌చూ అవినీతి ఆరోప‌ణ‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న‌ది.

G

Telangana | Published On Feb 11, 2026, 10.28 am IST

Singareni | సింగ‌రేణికి కొత్త సీఎండీ.. ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్‌కి బాధ్య‌త‌లు
Advertisement

Singareni | త్రినేత్ర‌.న్యూస్‌: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL).. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 3 ల‌క్ష‌ల మందికిపైగా కార్మికులు, వేలాది మంది అధికారులు ఉన్న అతిపెద్ద బొగ్గుగ‌ని. ఉద్యోగాల గ‌ని పేరొందిన సింగ‌రేణి (Singareni) ఇటీవ‌ల త‌ర‌చూ అవినీతి ఆరోప‌ణ‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న‌ది. తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. అప‌ర బొగ్గు నిల్వ‌లు చేతుల్లో ఉన్నా పీక‌ల్లోతు అప్పుల్లోకి కూరుకుపోతున్న ఈ సంస్థకు నూత‌న సీఎండీని (CMD) ప్ర‌భుత్వం నియ‌మించింది. ప్ర‌స్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్‌కు (Dr. Jyoti Buddha Prakash) సింగ‌రేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇప్పటివరకు ఇన్-చార్జి బాధ్యతలు నిర్వహించిన కృష్ణ భాస్కర్‌ను ఆ బాధ్యతల నుండి తప్పించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డగానే అప్ప‌టివ‌రకు సింగ‌రేణి సీఎండీగా ఎన్‌.శ్రీధ‌ర్‌ను ఆ విధుల నుంచి త‌ప్పించింది. ఆయ‌న స్థానంలో కేంద్ర రెవెన్యూ సర్వీసు నుంచి డిప్యుటేషన్‌పై వ‌చ్చిన బ‌ల‌రామ్‌ను నియ‌మించింది. సింగరేణిలో సంచాలకుడిగా, ఇన్‌చార్జి సీఎండీగా మొత్తం ఆరేళ్ల పాటు ప‌ద‌వీకాలం ముగియ‌డంతో తిరిగి ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల్లోకి వెళ్లారు. దీంతో గ‌తేడాది డిసెంబ‌ర్‌లో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి కృష్ణ‌భాస్క‌ర్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

అయితే సింగ‌రేణి ఆర్థిక ప‌రిస్థితి, అక్ర‌మాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పూర్తిస్థాయిలో సీఎండీని నియ‌మించాల‌ని భావించిన ప్ర‌భుత్వం 2002 బ్యాచ్‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

సింగరేణి ప్ర‌స్తుతం ఆర్థికంగా సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్న‌ది. డిస్కంల నుంచి రూ.23 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు నెలనెలా బ్యాంకుల నుంచి ‘ఓవర్‌డ్రాఫ్ట్‌’(ఓడీ)పై డబ్బు తీసుకుని నెట్టుకొస్తున్న‌ది. అయితే ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న‌ది. అప్పులు తెచ్చి కొత్తగా రూ.11 వేల కోట్ల వ్యయంతో మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటు నిర్మాణం చేపట్టింది.

ఒడిశాలోని నైనీ గని వద్ద కొత్తగా బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. దానికి సమీపంలోనే రూ.25 వేల కోట్ల వ్యయంతో 1600 మెగావాట్ల థర్మల్‌ కేంద్రం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే నైనీ గ‌నిపై ఇటీవ‌ల దుమారం రేగిన విష‌యం తెలిసిందే. బొగ్గు గ‌నుల కేటాయింపు వ్య‌వ‌హారంలో ఇద్ద‌రు మంత్రులు పెద్ద‌మొత్తం అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బొగ్గుగ‌ని త‌వ్వ‌కాల‌కు సంబంధించిన టెండ‌ర్ నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.

 

Advertisement
Advertisement