త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Strike | డిపోల నుంచి క‌ద‌ల‌ని బ‌స్సులు.. ప్రయాణికుల‌కు త‌ప్ప‌ని అవస్థలు

RTC Strike | రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె (RTC Strike) కొన‌సాగుతున్న‌ది. బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ఆర్టీసీ ఉద్యోగుల నిర‌వ‌ధిక స‌మ్మె ప్రారంభమైంది. కార్మికులు విధుల‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో డిపోల నుంచి బ‌స్సులు బ‌య‌ట‌కు రాలేదు.

G

Telangana | Published On Apr 22, 2026, 9.05 am IST

RTC Strike | డిపోల నుంచి క‌ద‌ల‌ని బ‌స్సులు.. ప్రయాణికుల‌కు త‌ప్ప‌ని అవస్థలు
Advertisement

RTC Strike | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె (RTC Strike) కొన‌సాగుతున్న‌ది. బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ఆర్టీసీ ఉద్యోగుల నిర‌వ‌ధిక స‌మ్మె ప్రారంభమైంది. కార్మికులు విధుల‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో డిపోల నుంచి బ‌స్సులు బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌యాణికుల‌కు అవ‌స్థ‌లు త‌ప్ప‌డం లేదు. ఆర్టీసీ ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం, యూనియ‌న్ల‌ను పున‌రుద్ధ‌రించ‌డంతో స‌హా త‌మ‌ 32 డిమాండ్లను ప‌రిష్క‌రించే వ‌ర‌కు స‌మ్మెను విర‌మించేది లేద‌ని కార్మికులు స్ప‌ష్టం చేస్తున్నారు. కాగా, మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌భుత్వం నియ‌మించిన ఐఏఎస్‌ల క‌మిటీతో కార్మికులు జ‌రిపిన విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక పరమైన అంశాలు ఉన్నందున 4 వారాల సమయం కావాలని కమిటీ ఛైర్మన్ వికాస్ రాజ్ విజ్ఞప్తి చేశారు. అందుకు జేఏసీ అంగీకరించకపోవడంతో నిర‌వ‌ధిక స‌మ్మె ప్రారంభ‌మైంది.

ప్రయాణికుల‌ అవస్థలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొన్ని డిపోల్లో అద్దె బస్సులను నడిపిస్తున్నారు. అయితే అవి ర‌ద్దీకి ఏమాంత్రం స‌రిపోవ‌డం లేదు. బ‌స్టాండ్‌ల‌లో, బ‌స్ స్టాపుల్లో పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు వేచిఉన్నారు. స‌మ్మె విష‌యం తెలియ‌కపోవ‌డంతో దూర‌ప్రాంతాల‌కు వెళ్లేవారు తెల్ల‌వారుజామునే ఎంజీబీఎస్‌, జేబీఎస్‌కు చేరుకున్నారు. ఎంత‌కూ బ‌స్సులు రాక‌పోవ‌డంతో అధికారులు, ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పికెట్​, కంటోన్మెంట్, రాణిగంజ్, బర్క‌త్‌పురా, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, హ‌య‌త్‌న‌గ‌ర్ స‌హా హైద‌రాబాద్ సిటీ డిపోలు, రాష్ట్ర వ్యాప్తంగా డిపోలలో బస్సులు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్‌లలో అధికారులు అద్దె బస్సులను నడుపుతున్నారు. అద్దె బస్సులను అడ్డుకోకుండా బస్టాండ్‌ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మ‌రోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ప్ర‌యాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మెట్రో రైళ్లు,సెట్విన్ బస్సులు కిటకిటలాడుతున్నారు. ఇదే అద‌నుగా సెట్విన్ బస్సులు, ఆటో డ్రైవర్లు ప్ర‌యాణికుల నుంచి అధిక డ‌బ్బు వ‌సూలు చేస్తున్నారు.

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో..

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా ఆటో డ్రైవర్లు రేట్లు పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాపిడో, ఓలా, ఉబర్​ను ఆశ్రయిస్తున్నారు.

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే 150 బస్సులు, 600 ఉద్యోగులు పరిమితం అయ్యారు. గోదావరిఖని బస్టాండ్​, డిపో వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది జిల్లాలోని సూర్యాపేట డిపోలో 159 బస్సులకు గాను 79 ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే నడిపించడానికి ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మిగతా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి కోదాడ డిపోలో 80 బస్సులో డిపోలో నిలిచిపోయాయి. జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ బస్సులను సూర్యాపేట డిపోలో నడిపించేందుకు డిపో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయితే ఆర్టీసీ కార్మికులు డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తుండంతో పోలీసుల స‌హాయంతో వాటిని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.

జగిత్యాలలో నిలిచిన బస్సులు

ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీకి మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. భాగంగా జగిత్యాల జిల్లాలోని జగిత్యాలలో 115, కోరుట్లలో 60, మెట్ప‌ల్లిలో 54 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంచిర్యాల డిపోలో 142 బస్సులు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం లో ఆర్టీసీని విలీనం చేయాలని, పీఆర్‌సీలు కూడా రావడం లేదన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల పని ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సమ్మెకు దిగామని, డిమాండ్లు నెరవేరే వరకు అది కొనసాగుతుందని ఉద్యోగులు స్ప‌ష్టం చేస్తున్నారు.

గన్​పార్క్​కు ఆర్టీసీ జేఏసీ నాయకులు

హైదరాబాద్‌లో ఉదయం ఆర్టీసీ జేఏసీ నాయకులు గన్‌పార్క్‌ వద్దకు వెళ్లనున్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నట్లు జేఏసీ వర్గాలు తెలిపాయు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బస్సులు డిపోలోనే ఉండిపోయాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు డ్యూటీలకు వెళ్లకుండా నిరసనలో పాల్గొన్నారు. గోదావరిఖనిలో ఉద్యోగుల సమ్మె కారణంగా 150 బస్సులు, 600 మంది ఉద్యోగులు డిపోకే పరిమితమయ్యారు. దీంతో గోదావరిఖని బస్టాండ్‌, డిపో వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Advertisement
Advertisement