త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | హామీలిచ్చుడే తప్ప..ఎప్పుడైనా నెరవేర్చారా? : రాంచందర్ రావు

Ramchandar Rao | కాంగ్రెస్ అంటే హామీలు ఇచ్చుడే త‌ప్పా.. వాటిని తీర్చేది లేదని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ఆయ‌న‌కు గుర్తు చేసి అమ‌లు చేయాల‌ని అడుగుతాన‌న్నారు.

S

Telangana | Published On Jun 21, 2026, 1.18 pm IST

Ramchandar Rao |   హామీలిచ్చుడే తప్ప..ఎప్పుడైనా నెరవేర్చారా? : రాంచందర్ రావు
Advertisement
  • సీఎం రేవంత్‌కు లేఖ రాసిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ అంటే హామీలు ఇచ్చుడే త‌ప్పా.. వాటిని తీర్చేది లేదని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ఆయ‌న‌కు గుర్తు చేసి అమ‌లు చేయాల‌ని అడుగుతాన‌న్నారు. 2023 ఎన్నిక‌ల సంద‌ర్భంగా వారు ఇక్క‌డికి వ‌చ్చి ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని నిల‌దీశారు. ఈమేరకు ఆదివారం సీఎం రేవంత్‌కు రాంచంద‌ర్‌రావు లేఖ రాశారు.

2023 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ స్వ‌యంగా తెలంగాణకు వచ్చి ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయి? ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా హామీల‌ను నెర‌వేర్చ‌రా? మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామ‌న్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇస్తామ‌ని మాటిచ్చారు. విద్యార్థులకు విద్యా భరోసా కింద రూ.5 ల‌క్ష‌ల సాయం, నిరుద్యోగులకు రూ.4,000 భృతి అతీగతీ లేదు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఊసే లేదు. ఇలా ప్ర‌తి వ‌ర్గానికి అన్యాయం చేశారు అని బీజేపీ రాష్ట్ర చీఫ్ విమ‌ర్శించారు.

వ్య‌వ‌సాయ కూలీల‌కు సంవ‌త్స‌రానికి అందిస్తామ‌న్న రూ.12,000 హామీ ఏమైంది. ల‌క్ష‌లాది పేద‌వారికి ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టికీ వారు ఎదురుచూస్తూనే ఉన్నారు. విద్యా భ‌రోసా కింద రూ. 5 ల‌క్ష‌లు సాయం చేస్తామ‌ని చెప్పారు. అది ఇంకా అమ‌లు చేయ‌నేలేదు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అంద‌క‌ విద్యార్థులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. నిరుద్యోగ భృతి రూ.4000 ఇస్తామ‌ని రాహుల్ గాంధీ ప‌దే ప‌దే చెప్పారు. కానీ అప్పుడే మ‌రిచిపోయారు. కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చేటప్పుడు తప్ప.. తీర్చేటప్పుడు పత్తా లేరా? అని ఆయ‌న లేఖ‌లో ఎద్దేవా చేశారు.

కాలేజీ పిల్ల‌ల‌కు స్కూటీలు ఇస్తామ‌ని చెప్పారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండ‌ర్ వేస్తామ‌ని మోసం చేశారు.
ధాన్యం కొనుగోలు చేయ‌కుండా రైతుల‌ను వంచించారు. రూ.500 బోన‌స్ ఇస్తామ‌ని ఎగ్గోట్టారు. రాహుల్ గాంధీ జ‌వాబుదారీత‌నంగా ఉంటామ‌ని మాట మార్చారు. వెంట‌నే ఆరు గ్యారంటీలు అమ‌లయ్యేలా ఆయ‌న చొర‌వ తీసుకోవాలి. ఇచ్చిన హామీలు మ‌రవ‌డ‌మే కాకుండా విదేశాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ ప్ర‌ధాని మోదీపై అర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున వారితో నేను మాట్లాడ‌తాను. నాకు అవ‌కాశం క‌ల్పిస్తే ఇచ్చిన హామీల‌ను రాహుల్‌కు గుర్తు చేస్తా. ఒకవేళ అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకత్వం భయపడితే.. అది తెలంగాణ ప్రజలను వారు ఘోరంగా వంచించారని ఒప్పుకున్నట్లే. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. ఈ నెరవేరని వాగ్దానాలపై రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇచ్చేందుకు సీఎం రేవంత్‌ అపాయింట్‌మెంట్ ఇప్పించాలి అని రాంచంద‌ర్‌రావు బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.

 

 

 

Advertisement
Advertisement