త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | ఎస్బీఐ భూముల వేలంలో ప్ర‌భుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది

Niranjan Reddy | రాయదుర్గం భూముల వేలంలో పారదర్శకంగా వ్యవహరించకపోవడం ప్రభుత్వ తీవ్ర తప్పిదమ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమ‌ర్శించారు. ఈ భూముల వేలంపై ఎస్బీఐ కోర్టును ఆశ్ర‌యించ‌డాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించ‌డం సిగ్గుచేట‌న్నారు.

S

Telangana | Published On Jun 21, 2026, 3.08 pm IST

Niranjan Reddy | ఎస్బీఐ భూముల వేలంలో ప్ర‌భుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది
Advertisement
  • అందుకు అనుకూల మీడియాలో క‌థ‌నాలు రాయిస్తుంది
  • బ్యాంకు ఆస్తులు ఎలా కాపాడుకోవాలో వారికి తెలియ‌దా
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప‌త‌నానికి ఇదే అస‌లైన‌ ప‌రాకాష్ట‌
  • పైగా బీఆర్ఎస్‌కు ఆపాదించ‌డం సిగ్గుచేటు
  • మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి ఫైర్‌

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాయదుర్గం భూముల వేలంలో పారదర్శకంగా వ్యవహరించకపోవడం ప్రభుత్వ తీవ్ర తప్పిదమ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమ‌ర్శించారు. ఈ భూముల వేలంపై ఎస్బీఐ కోర్టును ఆశ్ర‌యించ‌డాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించ‌డం సిగ్గుచేట‌న్నారు. పైగా త‌ప్పుడు క‌థ‌నాలు, ప్ర‌చారాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న స్పందించారు. ఎస్బీఐ భూముల వేలంలో  ప్రభుత్వానిది అవగాహనా రాహిత్యమ‌ని.. చేసిన తప్పునకు సిగ్గుపడకుండా ప్రభుత్వం ఇతరుల మీద నిందలు వేస్తుంద‌ని మండిప‌డ్డారు.

ఈ ప్రభుత్వానికి వేలం వెర్రిగా భూముల అమ్మకం మీద ఉన్న శ్రద్ధ వాటి సాంకేతిక, పర్యావరణ అంశాల మీద లేదు. అందుకే నాడు కంచె గచ్చిబౌలి, మూసీ స్థలాల ఆక్రమణకు కుట్ర చేశారు. తాజాగా రాయదుర్గం భూముల వేలంలో సర్కారు అవగాహన రాహిత్యం బయటపడింది. జరిగిన పొరపాటును సరిదిద్దుకోకుండా ఘర్షణాత్మక వైఖరి అవలంభించడం అవివేకం. ఎస్బీఐ లాంటి దేశంలోని అతిపెద్ద బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసే తరహాలో అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తుండడం ఈ ప్రభుత్వ పనితనానికి పరాకాష్ట అని నిరంజ‌న్‌రెడ్డి ఫైరయ్యారు.

పాల‌మూరు బిడ్డ కావ‌డం గ‌ర్వ‌కార‌ణం..

రాజ్యాంగబద్దంగా దేశంలో అతిపెద్ద బ్యాంకుకు పాలమూరు బిడ్డ చైర్మన్ కావడం ఈ ప్రాంతానికి, తెలంగాణకు గర్వకారణం. మన మట్టిబిడ్డ ఉన్నతస్థానానికి ఎదిగినందున ఆయనను సత్కరించడం, గౌరవించడం సాంప్రదాయం. అందుకే గతంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపాం. ఎస్బీఐ బ్యాంకు చెర్మన్ తెలిసినంత మాత్రాన ఆ బ్యాంకు వాళ్లు, వాళ్ల సంస్థ ఆస్తులు ఎలా కాపాడుకోవాలో బయటివారు చెబితే చేసే అవగాహన లేకుండా ఉంటారా? అని మాజీ మంత్రి ప్ర‌శ్నించారు.

తెర‌చాటున ఉండి కుట్ర చేయాల్సిన అవ‌స‌రం లేదు..

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాం. రోజూ ప్రభుత్వాన్ని ప్రజల కోణంలో విమర్శిస్తూనే ఉంటాం. తెరచాటున ఉండి కుట్ర చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో లేం. ప్రాంత సంబంధాలను ముడిపెట్టి అనుకూల మీడియాలో ఊహాజనితమైన కథనాలు రాస్తున్న వారి విజ్ఞతకే  వదిలేస్తున్నాం అని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement
Advertisement