త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | అసెంబ్లీకి రండి : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి.. ఓఆర్ఆర్ క్రషర్ ఆరోపణలపై ఫైర్

రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తనపై చేస్తున్న ఓఆర్ఆర్ క్రషర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన, ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

J

Telangana | Published On Mar 9, 2026, 9.53 pm IST

Ponguleti Srinivas Reddy | అసెంబ్లీకి రండి : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి.. ఓఆర్ఆర్ క్రషర్ ఆరోపణలపై ఫైర్
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి చేశారు. "సభకు వచ్చి మీ వాదనలు వినిపించండి. మీరు అడిగే ప్రతి విషయానికి సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రతిపక్షం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం వారి సొంత ఎజెండాతోనే సభకు వస్తోందని ఆయన విమర్శించారు.

వెలుగుమట్ల నిర్వాసితులకు 'ఇందిరమ్మ ఇండ్లు'

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. "సీఎం ఆదేశాల మేరకు, త్వరలోనే అక్కడి అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలతో పాటు 'ఇందిరమ్మ ఇండ్లు' మంజూరు చేస్తాం. మా ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుంది" అని పొంగులేటి పునరుద్ఘాటించారు.

ఆ కుక్కలను ఏ గొలుసుతో కట్టేయాలో తెలుసు: క్రషర్ ఆరోపణలపై ఫైర్

ఓఆర్ఆర్ (ORR) సమీపంలో ఉన్న ఒక క్రషర్ మంత్రి పొంగులేటిదేనంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన మార్క్ మాస్ వార్నింగ్‌తో ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

"ORR పక్కన నాకు ఎలాంటి సంబంధం లేని క్రషర్ నాదని పిచ్చి కుక్కలు చాలా మొరుగుతున్నాయి. నాపై మొరిగే కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో నాకు బాగా తెలుసు. ఆ క్వారీ నాదని చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. నాకు క్రషర్లు నడిపే ఓపిక లేదు.. అది నా క్రషర్ కాదు" అని మంత్రి కుండబద్దలు కొట్టారు.

అసలేం జరిగిందంటే..

బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న ఆ క్రషర్ 'తిరుమల క్రషర్' అని, వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ ఆ సంస్థకు ఉందని మంత్రి వివరించారు. "ఆ క్రషర్ కంపెనీ మా కంటైనర్‌ను తీసుకువెళ్లింది. బహుశా దానిపై ఉన్న మా పేరును తొలగించినట్లు ఉన్నారు. కేవలం ఆ కంటైనర్‌ను పట్టుకుని ప్రతిపక్ష నేతలు పిచ్చి వాగుడు వాగుతున్నారు. నాపై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారందరికీ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా సమాధానం చెబుతాను" అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

సభలో ప్రతిపక్షాలను ఆధారాలతో సహా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వ్యూహంతో ఉన్నట్లు మంత్రి మాటలను బట్టి స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement