త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఆర్‌సీవోలు వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి.. కనీసం ఆరు గురుకులాలను సందర్శించాలి

Ponnam Prabhakar | ప్ర‌తి ఆర్‌సీవో వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టిస్తూ క‌నీసం ఆరు గురుకులాల‌ను సంద‌ర్శించాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (MJPTBCWREIS) పరిధిలోని అన్ని గురుకుల విద్యాసంస్థలను ఆగస్టు 30లోపు పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలన్నారు.

S

Telangana | Published On Jul 21, 2026, 3.38 pm IST

Ponnam Prabhakar | ఆర్‌సీవోలు వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి.. కనీసం ఆరు గురుకులాలను సందర్శించాలి
Advertisement
  • ఆగస్టు 30లోగా అన్ని గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి
  • ప్ర‌తి నెలా మేం కూడా ఆక‌స్మిక‌ త‌నిఖీలు చేస్తాం
  • నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, కళల్లో ప్రతిభను పెంపొందించాలి
  • MJPTBCWREIS రీజినల్ కోఆర్డినేటింగ్ అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొన్నం ఆదేశాలు

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌తి ఆర్‌సీవో వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టిస్తూ క‌నీసం ఆరు గురుకులాల‌ను సంద‌ర్శించాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (MJPTBCWREIS) పరిధిలోని అన్ని గురుకుల విద్యాసంస్థలను ఆగస్టు 30లోపు పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై ఆయ‌న మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించి సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించాల‌న్నారు.

విద్యాసంస్థల పనితీరును పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా అధికారులు పనిచేయాలి. ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (RCO) వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించాలి. ఆర్‌సీవోలు కేవలం పర్యవేక్షణకే పరిమితం కావొద్దు. ప్రధాన కార్యాలయం, జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థల మధ్య సమన్వయం కల్పించే సంధాన కర్తలుగా వ్యవహరించాలి. సొంత భవనాలు లేని గురుకుల విద్యాసంస్థలకు భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇందుకోసం సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశమై అవసరమైన చర్యలు తీసుకోవాలి అని పొన్నం ఆదేశించారు.

వ‌ర్ష‌పు నీటిని త‌ప్ప‌నిస‌రిగా సంరంక్షించాలి..

ఏ నియోజకవర్గానికి అనుమతి పొందిన విద్యాసంస్థ అదే నియోజకవర్గ పరిధిలో భవనాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి. అద్దె భవనాలకు చెల్లించే మొత్తంలో ఆరు శాతం నిధులను భవనాల మరమ్మతులకు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి విద్యాసంస్థలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలి. భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు.

తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి తెలియజేసి వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు పాఠ్యాంశాల్లోనే కాకుండా క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసం వంటి రంగాల్లోనూ ప్రోత్సాహం అందించి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి. ప్రతిభ గల విద్యార్థుల వివరాలు తెలియజేస్తే వారికి ప్రభుత్వం తరఫున మరింత ప్రోత్సాహం అందిస్తాం. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా సైకాలజిస్ట్‌లతో అవగాహన సమావేశాలు నిర్వహించాలి అని మంత్రి పొన్నం సూచించారు.

విద్యార్థులతో మొక్కలు నాటించాలి..

విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎక్కడా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా వంటశాలలు, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలి. ప్రతి నెల కనీసం 15 గురుకుల విద్యాసంస్థలను నేను, కమిషనర్, కార్యదర్శి ఆకస్మిక తనిఖీలు చేస్తాం. మూసీ గురుకుల విద్యాసంస్థకు సొంత భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. విద్యార్థులతో మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను కూడా వారికి అప్పగించాలి అని పొన్నం ప్ర‌భాక‌ర్‌ సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, MJPTBCWREIS కార్యదర్శి బడుగు సైదులు, డిప్యూటీ సెక్రటరీలు, రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement