త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Grey Jungle fowl | అరుదైన అడ‌వి కోడి.. తిన్నారో జైలు పాలే.. ఇంత‌కి అదెక్క‌డుంటుందంటే..

Grey Jungle fowl | సందర్భం ఏదైనా కోడికూర ఉంటే ఆ ఫీలింగే వేరే. నాన్‌వెజ్ ప్రియులకైతే వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే గ్రే జంగిల్ ఫౌల్ (Grey Jungle fowl) అనే అరుదైన కోడిని పొర‌పాటున తిన్నా జైలు పాలు కావ‌డం ఖాయం. ఇది మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లోనే క‌నిపిస్తుంది.

S

Telangana | Published On May 28, 2026, 12.14 pm IST

Grey Jungle fowl | అరుదైన అడ‌వి కోడి.. తిన్నారో జైలు పాలే.. ఇంత‌కి అదెక్క‌డుంటుందంటే..
Advertisement

Grey Jungle fowl త్రినేత్ర‌.న్యూస్: సందర్భం ఏదైనా కోడికూర ఉంటే ఆ ఫీలింగే వేరే. నాన్‌వెజ్ ప్రియులకైతే వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే గ్రే జంగిల్ ఫౌల్ (Grey Jungle fowl) అనే అరుదైన కోడిని పొర‌పాటున తిన్నా జైలు పాలు కావ‌డం ఖాయం. అదేంటి రోజూ వందల క్వింటాళ్ల కోడి మాంసం తింటుంటే ఈ కోడికి ఇంత ప్ర‌త్యేక‌త ఏముందనే సందేహం రావొచ్చు. ఎందుకంటే ఇది సాధారణంగా గ్రామాల్లో తిరిగే కోడి పుంజు కాదండోయ్.. అడవిలోనే నివసించే అడవి కోడి. దీన్ని గ్రే జంగిల్‌ ఫౌల్‌ లేదా జంగ్లీ ముర్గా (బూడిద రంగు అడవి కోడి) అని కూడా పిలుస్తారు. ఇది మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లోనే క‌నిపిస్తుంది. మన దేశానికి మాత్రమే పరిమితమైన అడవి కోడి జాతి మ‌రి. ప‌దండి మ‌న‌మూ ఓ లుక్కేద్దాం..

జిన్నారం అడవుల్లో నివాసం..

ఈ పక్షులు ఎక్కువగా దట్టమైన అడవులు, పొదలు ఉండే ప్రాంతాల్లోనే నివసిస్తాయి. ఇవి అంతరించిపోతున్న అరుదైన పక్షుల జాబితాలో ఉన్నాయి. వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం వీటిని వేటాడటం లేదా చంపి తినడం చట్టరీత్యా నేరమ‌న్న‌మాట‌. ఒక‌వేళ పొర‌పాటున తిన్నా కఠినమైన జైలు శిక్షలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే జిన్నారం అడవుల్లోనే ఇవి క‌నిపిస్తాయి.

మెరిసే న‌లుపు, బూడిద ఈక‌లు..

మనం ఇళ్లల్లో పెంచుకునే సాధారణ కోళ్లకు వీటిని పూర్వీకులుగా భావిస్తారు. ఇవి భారత‌దేశ‌ అడవుల్లో త‌ప్పా మ‌రెక్క‌డా క‌నిపించ‌వు. దీని శాస్త్రీయ నామం గ‌ల్లుస్ సొన్నెర‌ట్టి. మగ కోడిపుంజులు చూడటానికి ఆకర్షణీయమైన రంగుల్లో, మెరిసే నలుపు-బూడిద ఈకలతో, తలపైన ఎర్రటి జూలును కలిగి ఉంటాయి. ఆడ కోళ్లు గోధుమ రంగులో, అడవి వాతావరణంలో కలిసిపోయేలా ఉండి శత్రువుల నుండి రక్షించుకుంటాయి.

ఆహారంగా గింజ‌లు, చెద‌లు, కీట‌కాలు..

ఇవి నేల మీదనే తిరుగుతాయి. ఒక‌వేళ ఎటువంటి అలికిడి వినిపించినా పారిపోయి చెట్లపైకి ఎగురుతాయి. గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఏపీ, తెలంగాణ అడవుల్లోనూ ఈ అడవి కోళ్లు కనిపిస్తాయి. భారతదేశంలోని పలు అటవీ ప్రాంతాల్లోనూ ఇవి కనిపిస్తాయి.

ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తౌల్యాన్ని కాపాడ‌తాయి..

పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ఈ అడ‌వి కోళ్లు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. అడవుల నరికివేత, అక్రమ వేట, నివాస ప్రాంతాల తగ్గుదల కారణంగా అడవి కోళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో ప్రభుత్వం వీటిని వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద రక్షిత జాతుల జాబితాలో చేర్చింది.

మూడేండ్ల జైలు శిక్ష‌..

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి కోడిని వేటాడటం నేరం. వీటిని పట్టుకోవడం, విక్రయించడం, మాంసం నిల్వ ఉంచడం కూడా చట్ట విరుద్ధం. నేరం నిరూపితమైతే 3 ఏండ్ల‌ జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. శిక్ష తీవ్రత కేసు స్వభావాన్ని బట్టి మారవచ్చు.

Advertisement
Advertisement