త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ధాన్యం కొనుగోలు వేగ‌వంతం చేయాలి.. అధికారుల‌ను ఆదేశించిన డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka | ధాన్యం, పంట ఉత్ప‌త్తుల కొనుగోళ్లు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం మంత్రులు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు.

P

Telangana | Published On May 5, 2026, 8.11 pm IST

Bhatti Vikramarka | ధాన్యం కొనుగోలు వేగ‌వంతం చేయాలి.. అధికారుల‌ను ఆదేశించిన డిప్యూటీ సీఎం
Advertisement

Bhatti Vikramarka | ధాన్యం, పంట ఉత్ప‌త్తుల కొనుగోళ్లు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం మంత్రులు ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. వారికి కలెక్టర్ గరిమ‌ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే వారికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలో రూ.30.05 కోట్ల అంచనా వ్యయంతో 10 కొత్త 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేయగా, ఒక ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 25,785 వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందనుందని అధికారులు వివ‌రించారు. అనంత‌రం మంత్రులు గంభీరావుపేటలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రైతు సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ట్రాక్టర్లను వినియోగించి అయినా కొనుగోళ్లు ఆపకూడదని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కింద ప్రతి శాఖ సమన్వయంతో పని చేస్తోందని తెలిపారు. జూన్ 15 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని గడువు విధించారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. నేతన్నలకు పెండింగ్ బకాయిలు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. విద్యుత్ చార్జీల తగ్గింపుపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. చేనేత, వస్త్ర పరిశ్రమ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. భూ భారతి, సాదాబైనామా సమస్యల పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రవాణా వ్యవస్థను సమర్థంగా వినియోగించి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీడీ, మత్స్య, వస్త్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్ గ‌రిమ అగ్రవాల్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement