త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Juluru Gouri Shankar | తెలంగాణ సంస్కృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలి

Juluru Gouri Shankar | తెలంగాణ సంస్కృతిలోని వైవిధ్యం, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ దీపావళి (ట్రైబల్, రూరల్ అండ్ టౌన్ ట్రెడిషన్స్‌)’ పుస్తకాన్ని శనివారం త్యాగరాయ గానసభలో ఆయన ఆవిష్కరించారు.

P

Telangana | Published On Nov 8, 2026, 12.35 pm IST

Juluru Gouri Shankar | తెలంగాణ సంస్కృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలి
Advertisement
  • ‘తెలంగాణ దీపావళి’ పుస్తకావిష్కరణలో జూలూరు గౌరీశంకర్‌

Juluru Gouri Shankar | తెలంగాణ సంస్కృతిలోని వైవిధ్యం, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ దీపావళి (ట్రైబల్, రూరల్ అండ్ టౌన్ ట్రెడిషన్స్‌)’ పుస్తకాన్ని శనివారం త్యాగరాయ గానసభలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. దీపావళి పండుగలోని పౌరాణిక విశిష్టత, గిరిజనుల కళాసంపద, గ్రామీణ సంప్రదాయాలు, పట్టణ ప్రజల ఆధునిక వేడుకలను రచయిత ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలోని విభిన్న ఆచార వ్యవహారాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు అడపా సత్యనారాయణ మాట్లాడుతూ.. పుస్తకంలోని నాలుగు అధ్యాయాల్లో గ్రామీణ, పట్టణ, గిరిజన, మహానగర ప్రాంతాల్లో దీపావళి వేడుకలు నిర్వహించే తీరును ఆధారాలతో వివరించారని తెలిపారు. దీపావళి కేవలం పండుగ మాత్రమే కాదని, అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగులను నింపే పండుగ అని అభివర్ణించారు.

ప్రముఖ సాహితీవేత్త సంఘనబట్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. గిరిజనులు, గోండుల సంప్రదాయాలు, గుస్సాడీ, దండారి నృత్యాల విశిష్టతను రచయిత ఈ పుస్తకంలో చక్కగా వివరించారని అన్నారు. గిరిజనుల కళావైభవం, సామూహిక జీవన విధానం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ఆవశ్యకతను సవివరంగా ప్రస్తావించారని పేర్కొన్నారు. సభాధ్యక్షత వహించిన త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో దీపావళి సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు, ప్రకృతి సంబంధిత వస్తువులతో చేసే అలంకరణలు, సంప్రదాయ వంటకాలు, వ్రతాలు, నోముల గురించి పుస్తకంలో వివరించారని తెలిపారు. పుస్తక రచయిత డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. దీపావళి పండుగకు సంబంధించిన విభిన్న కోణాలను పరిశోధించి ఈ రచనలో పొందుపరిచినట్లు చెప్పారు. గిరిజన, గ్రామీణ సమాజాల్లోని ఆచారాలు, పద్ధతులు, జానపద సంప్రదాయాలపై చారిత్రక ఆధారాలతో పరిశోధన చేసి వాటిని నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో దేశిరాజు శ్యామసుందరరావు స్థపతి, జూమ్గవేని ప్రసాద్‌తో పాటు పలువురు సాహితీమిత్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement