Diwali 2026 | దీపావళి వేళ.. లక్ష్మీదేవితో పాటు అలక్ష్మికీ ఓ దీపం వెలిగించండి..!
Diwali 2026 | దీపావళి అంటే దీపాల పండుగ. ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ.. తమ ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటారు. అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు. అయితే, ఈ దీపావళి వేళ ఓ ఆసక్తికరమైన పురాణ సంప్రదాయం కూడా ఉంది. మహాలక్ష్మికి జ్యేష్ఠ సోదరిగా చెప్పుకునే అలక్ష్మి కోసం కూడా ఓ దీపం వెలిగిస్తారట! ఇంతకీ అలక్ష్మి ఎవరు? లక్ష్మీదేవితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? తెలుసుకుందం రండి..!
Devotional | Published On Nov 8, 2026, 7.45 am IST
- దారిద్య్రం, దురదృష్టానికి ప్రతీకగా జ్యేష్ఠ సోదరి..
- ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు ప్రత్యేక ఆచారం..
- క్షీరసాగర మథనం ఆసక్తికర పురాణ గాథ తెలుసా?
Diwali 2026 | దీపావళి అంటే దీపాల పండుగ. ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ.. తమ ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటారు. అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు. అయితే, ఈ దీపావళి వేళ ఓ ఆసక్తికరమైన పురాణ సంప్రదాయం కూడా ఉంది. మహాలక్ష్మికి జ్యేష్ఠ సోదరిగా చెప్పుకునే అలక్ష్మి కోసం కూడా ఓ దీపం వెలిగిస్తారట! ఇంతకీ అలక్ష్మి ఎవరు? లక్ష్మీదేవితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? తెలుసుకుందం రండి..!
క్షీరసాగర మథనంలో ముందుగా అలక్ష్మి
హిందూ పురాణాల ప్రకారం.. క్షీరసాగర మథనం సమయంలో మహాలక్ష్మి కంటే ముందే అలక్ష్మి ఆవిర్భవించింది. తొలుత హాలాహల విషం వెలువడిన అనంతరం అలక్ష్మి ఉద్భవించిందని కొన్ని పురాణ కథనాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత అమృత కలశంతో పాటు మహాలక్ష్మి ఆవిర్భవించినట్లు చెబుతారు. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి జన్మించిందనే విశ్వాసంతో దీపావళి నాడు ఆమెకు విశేష పూజలు నిర్వహిస్తారు. అయితే అలక్ష్మిని మాత్రం దారిద్య్రం, దురదృష్టం, అశుభాలకు ప్రతీకగా భావిస్తారు. 'లక్ష్మి లేనిది' అనే అర్థాన్నిచ్చే అలక్ష్మి.. సంపద, సౌభాగ్యాలకు ప్రతిరూపమైన మహాలక్ష్మికి పూర్తి భిన్నమైన స్వరూపంగా పురాణాల్లో కనిపిస్తుంది. జ్యేష్ఠాదేవి, దరిద్ర, కలహప్రియ వంటి పేర్లతోనూ ఆమెను పిలుస్తారు.
కాకి, గాడిద వాహనాలు.. భయంకర రూపం
పురాణ వర్ణనల ప్రకారం అలక్ష్మి రూపం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వాడిపోయిన శరీరం, లోతుకు కూరుకుపోయిన బుగ్గలు, ఎర్రటి కళ్లు, చెదిరిన జుట్టుతో కనిపిస్తుందని చెబుతారు. నల్లని వస్త్రాలు ధరించి, గాడిద లేదా కాకిని వాహనంగా కలిగి ఉంటుందని కొన్ని కథనాలు వివరిస్తున్నాయి. ఆమె రూపం ప్రతికూలత, అశుభం, దారిద్య్రానికి ప్రతీకగా నిలుస్తుంది. అలక్ష్మి ఎక్కడ నివసిస్తుందనే విషయంపైనా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. అసూయ, ద్వేషం, మోసం, జూదం, కలహాలు, అనైతిక ప్రవర్తన ఎక్కువగా ఉండే చోట ఆమె నివసిస్తుందని పురాణ విశ్వాసం. అలాంటి ఇళ్లలో సుఖశాంతులు కరవై.. దారిద్ర్యం, మనస్పర్థలు పెరుగుతాయని చెబుతారు.
ఆశ్రమంలోనూ ఇమడలేకపోయిందట..
మరికొన్ని పురాణ కథనాల ప్రకారం.. అలక్ష్మికి ఉద్దాలక మహర్షితో వివాహం జరిగింది. ఆయన ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడి ప్రశాంత వాతావరణం, భజనలు, ఆధ్యాత్మిక సాధనలు, ధార్మిక కార్యక్రమాలు ఆమెకు నచ్చలేదట. దీంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిందని కథనాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు.. ఆమె స్వభావానికి తగిన నివాసాన్ని సూచించారట. కలహాలు, మోసాలు, జూదం, ఇతరులను అవమానించడం, చెడు ఆలోచనలు ఉన్న ప్రదేశాల్లో నివసించమని చెప్పినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మరోవైపు తన సోదరి పరిస్థితిపై లక్ష్మీదేవి ఆందోళన చెందగా.. ఆమెకు తగిన స్థానం కల్పించేందుకు విష్ణుమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి.
అలక్ష్మి కోసం దీపం ఎందుకు?
దీపావళి రాత్రి మహాలక్ష్మిని ఆహ్వానించడంతో పాటు అలక్ష్మిని ఇంటి నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆచారం పాటిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఇంటికి బయట అలక్ష్మి కోసం ఓ దీపాన్ని వెలిగిస్తారు. ఇది అశుభం, దారిద్ర్యం ఇంట్లోకి రాకూడదనే సంకల్పానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే ఇళ్లకు, దుకాణాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం వెనుక కూడా అలక్ష్మిని దూరంగా ఉంచాలనే సంప్రదాయ విశ్వాసం ఉందని చెబుతారు. ఈ ఆచారాలు ప్రాంతాలవారీగా మారుతూ ఉంటాయి.
మంచి-చెడు మధ్య సమతుల్యతే సృష్టి ధర్మం
లక్ష్మీదేవి సంపద, శుభం, సౌభాగ్యాలకు ప్రతీక కాగా.. అలక్ష్మి దారిద్య్రం, కలహాలు, అశుభాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. వీరిద్దరినీ సోదరీమణులుగా పేర్కొనడం వెనుక కూడా ఓ తాత్విక భావన ఉందని పురాణ కథనాలు సూచిస్తున్నాయి. వెలుగు-చీకటి, మంచి-చెడు, శుభం-అశుభం వంటి ద్వంద్వాలు సృష్టిలో సహజమని ఈ గాథలు చాటిచెబుతున్నాయి. అందుకే దీపావళి వేళ వెలిగించే దీపం కేవలం సంపదకు స్వాగతం పలకడమే కాదు.. దారిద్య్రం, అశాంతి దూరం కావాలనే ఆకాంక్షకు కూడా ప్రతీకగా నిలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●LK Advani | శత వసంతంలోకి అడుగుపెట్టిన ఎల్కే అద్వానీ
- ●Happy Deepavali | త్రినేత్ర న్యూస్ పాఠకులు, శ్రేయోభిలాషులకు.. దీపావళి శుభాకాంక్షలు
- ●Diwali 2026 | నరక బాధలకు చెక్.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక నరక చతుర్దశి
- ●Horoscope | నవంబర్ 8 ఆదివారం.. పూర్వీకుల సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!
- ●Diwali 2026 | దీపావళి లక్ష్మీపూజ ముహూర్తాలు ఇవే.. ఎవరెప్పుడు పూజ చేయాలంటే?
- ●Diwali 2026 | నేడు దీపావళి.. లక్ష్మీపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?

LK Advani | శత వసంతంలోకి అడుగుపెట్టిన ఎల్కే అద్వానీ

Happy Deepavali | త్రినేత్ర న్యూస్ పాఠకులు, శ్రేయోభిలాషులకు.. దీపావళి శుభాకాంక్షలు

Diwali 2026 | నరక బాధలకు చెక్.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక నరక చతుర్దశి

Horoscope | నవంబర్ 8 ఆదివారం.. పూర్వీకుల సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది!




