త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PRC | ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు షాక్.. పీఆర్సీ గడువు మరో ఆరు నెలలు పొడిగింపు

PRC | పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రేవంత్ రెడ్డి స‌ర్కార్ షాకిచ్చింది. రేపోమాపో కొత్త పీఆర్సీ ప్ర‌క‌టిస్తార‌ని ఆశ‌గా ఎదురుచూసిన ఉద్యోగుల‌కు మ‌ళ్లీ నిరాశే మిగిలింది. పే రివిజ‌న్ క‌మిష‌న్ కాల‌ప‌రిమితిని మ‌రో ఆరు నెల‌లు పొడిగిస్తూ ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది.

S

Telangana | Published On Mar 26, 2026, 4.21 pm IST

PRC | ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు షాక్.. పీఆర్సీ గడువు మరో ఆరు నెలలు పొడిగింపు
Advertisement

PRC | త్రినేత్ర‌.న్యూస్ : పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రేవంత్ రెడ్డి స‌ర్కార్ షాకిచ్చింది. రేపోమాపో కొత్త పీఆర్సీ ప్ర‌క‌టిస్తార‌ని ఆశ‌గా ఎదురుచూసిన ఉద్యోగుల‌కు మ‌ళ్లీ నిరాశే మిగిలింది. పే రివిజ‌న్ క‌మిష‌న్ కాల‌ప‌రిమితిని మ‌రో ఆరు నెల‌లు పొడిగిస్తూ ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. దీంతో పీఆర్సీ 2026 సెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు లేన‌ట్టే అని తేలిపోయింది. వాస్త‌వానికి పీఆర్సీ గ‌డువు ఈ నెల 31తో ముగియ‌నుంది. ఈ లోపు ప్ర‌భుత్వం నుంచి తీపి క‌బురు వ‌చ్చే అవకాశం ఉంద‌ని ఉద్యోగులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూశారు. తాజాగా ఆర్థిక శాఖ మెమోతో ప్ర‌భుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

పెండింగ్ డీఏలు, పీఆర్సీపై రెండు రోజుల క్రితం శాస‌న‌స‌భా వేదిక‌గా తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రిగింది. ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో, ఐదు పెండింగ్‌ డీఏలు, రిటెర్మెంట్‌ ఉద్యోగుల బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని హ‌రీశ్‌రావు ప్ర‌భుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023, జూన్‌ 30తో ముగిసింది. అదే ఏడాది జులై 1వ తేదీ నుంచి రెండో పీఆర్సీ వ‌ర్తింప‌జేయాలి. కానీ అది జ‌ర‌గ‌లేదు. రెండో పీఆర్సీ క‌మిటీని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివ‌శంక‌ర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ గ‌డువు 2024 ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌మిటీ గ‌డువును మ‌రో ఆరు నెల‌లు పొడిగించారు. 2025 అక్టోబ‌ర్ 2వ తేదీ నాటికి రెండో పీఆర్సీ క‌మిటీని నియ‌మించి రెండేండ్లు పూర్త‌యింది. తాజాగా మ‌రోసారి శివ‌శంక‌ర్ క‌మిటీ గ‌డువు మ‌రో ఆరు నెల‌లు పొడిగించ‌బ‌డింది.

ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్సీ అమలుచేయాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం రెండు రోజుల క్రితం డిమాండ్‌ చేసింది. పీఆర్సీ కమిటీ నివేదికను స్వీకరించి, జూలై 2023 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది.

Advertisement

తాజావార్తలు

Advertisement