త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Future City | ముఖ్యమంత్రి గారూ.. మీ భూములు మాకివ్వండి.. అక్కడే మా ఊర్లు కట్టించండి..

Future City | ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతులు తప్పనిసరిగా భూములివ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా.. ఫార్మా సిటీని రద్దు చేసి రైతులు భూములు కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

S

Telangana | Published On Apr 30, 2026, 7.30 pm IST

Future City | ముఖ్యమంత్రి గారూ.. మీ భూములు మాకివ్వండి.. అక్కడే మా ఊర్లు కట్టించండి..
Advertisement

మా భూములు కాపాడతామని
ప్రతిపక్షంలో మాటిచ్చారు కదా
భూసేకరణ రద్దు చేస్తామన్నారు కదా
ఫార్మా సిటీ రద్దు చేస్తామన్నారు
ఆ జీవో రద్దు కాలేదు
ఇప్పుడేమో మా భూములు గుంజుకుంటున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ లేఖ

రైతుల భూములు పల్లీ బఠానీల్లా గుంజుకుంటవా..!

రంగారెడ్డి జిల్లాలో పొలాల ధరలు ఇప్పటికే బాగా పెరిగినయి. కోట్లు పలుకుతున్నాయి.. యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో ఉండే 20 వేల ఎకరాల పచ్చటి పంట పొలాలను కేసీఆర్ ఎకరా 14 లక్షలకు, 16 లక్షలకు గుంజుకుంటున్నడు. వాటిని కోటి 25 లక్షలకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నడు . కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్న. అభివృద్ధి కోసం రైతులు భూములు త్యాగం చేయాలంటున్నవ్ కదా. గజ్వేల్‌లో మీ ఫామ్ హౌస్ భూములకు మేం ఎకరాకు రూ. 25 లక్షలు కట్టిస్తం. 48 గంటల్లో పైసలు జమచేస్తం. ఇస్తవా? రైతు.. కోట్లు సంపాదించుకునేందుకు వ్యవసాయం చేయడు. బీరువాల్లో బంగారం నింపుకునేందుకు వ్యవసాయం చేయడు.ఆత్మగౌరవం కోసం వ్యవసాయం చేస్తాడు. పదిమందికి పట్టెడన్నం పెట్టేటందుకు చేస్తాడు. ఎవ్వడైనా సరే తన కన్నతల్లి మీద కన్నేసిండంటే పక్కనున్న గొడ్డలందుకొని అడ్డంగ నరుకుతడు. అట్లాంటి కన్నతల్లి లాంటి ఈ భూమి మీద కన్నేస్తే ఊరుకుంటమా? పేదోళ్లైన రైతుల భూములు పల్లీ బఠానీల్లాక గుంజుకుంటవా?

రావిర్యాల‌లో 2021 ఫిబ్రవరి 16న జరిగిన రాజీవ్ రైతు రణ భేరీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫ్యూచర్ సిటీ కోసం రైతులు భూములివ్వాల్సిందే

ఫ్యూచ‌ర్ సిటీ కోసం రైతులు భూములు ఇవ్వాల్సిందే.. ఇది ఆగేప‌ని కాదు.ఈ రోజు కాక‌పోయినా రేపైనా మీ భూములు ప్ర‌భుత్వానికి బ‌దిలీ అవుతాయి. తాత్కాలికంగా వాయిదా ప‌డొచ్చు. కానీ భూముల బ‌దిలీ జ‌రిగి తీరుతుంది. ఆనాడు పైస‌లు తీసుకుంటే క‌ల్వ‌కుర్తి అవ‌తలికి పోతే మీకు రెండింత‌ల భూమి వ‌చ్చేది. ఇప్పుడు ధ‌ర‌లు పెరిగాయి. ఈ పైస‌ల‌తో గ‌జాలు కొన‌డానికి కూడా స‌రిపోవు. జూప‌ల్లి కృష్ణారావు ఇండ‌స్ట్రీస్ మినిస్ట‌ర్‌గా (గత ప్రభుత్వంలో) ఉన్న‌ప్పుడే 90 శాతం భూములు క్లియ‌ర్ అయ్యాయి.ఆ రోజే డ‌బ్బులు తీసుకుంటే యాచారం, క‌డ్తాల్, ఆమ‌న‌గ‌ల్ వ‌ద్ద భూములు వ‌చ్చేవి. ఇప్పుడు ఆ అవ‌కాశం కూడా పోయింది. రైతులు డ‌బ్బులు తీసుకోవాలి..

కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 2026 ఏప్రిల్ 28న ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి

Future City | త్రినేత్ర.న్యూస్ :

ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతులు తప్పనిసరిగా భూములివ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా.. ఫార్మా సిటీని రద్దు చేసి రైతులు భూములు కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణను రద్దు చేసి రైతులకే పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడేమో మీ భూములు ఎట్లైనా గుంజుకుంటామని బెదిరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు స్థానిక రైతులతో కూడిన ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. ఆ లేఖ సారాంశం ఇదీ..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట గ్రామంలో ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఫ్యూచర్ సిటీ విషయంలో కొంతమందికి కష్టం ఉంది. సరైన నష్టపరిహారం రాలేదన్న బాధ కొందరి రైతుల్లో ఉంది. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న వారు డబ్బులు తీసుకుని కొంచెం దూరంలో భూమి కొనుకోవచ్చు" అని సెలవిచ్చారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారెకి కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాం.

మా భూములు మాకే.. అని హామీ ఇచ్చారు

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2021లో మీరు రాజీవ్ రైతు భరోసా పేరుతో అచ్చంపేట నుండి రావిర్యాల దాకా
పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఫార్మా సిటీ బాధిత రైతులమైన మేం మిమ్మల్ని కలిశాం. మా భూములు పోతే బతకలేం అని మా గోడు విన్నవించుకున్నాం. మాకు సాయం చేయండి అని వేడుకున్నాం. ఆ సందర్భంలో ఇప్పటి మంత్రులైన అప్పటి కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మరికొందరు నేతలు కోదండరెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు కూడా మీతో పాటే ఉన్నారు. అప్పుడు మీరంతా మాకిచ్చిన హామీ ఏమిటంటే... మీరెవ్వరూ ఫార్మాసిటీకి భూములివ్వొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూసేకరణ రద్దు చేసి పూర్తి హక్కులు తిరిగి రైతులకే కల్పిస్తాం..అని చెప్పారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామంటూ మా ప్రాంతంలో మాతో కలిసి పాదయాత్రలు చేశారు.

ఇప్పుడేమో మీ భూములు గుంజుకుంటాం...అంటున్నారు

ఇదే ప్రాంతంలో నాడు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేశారు. ఈ మూడు పంటలు పండే భూములు ఎట్టి పరిస్థితిలో ఇవ్వొద్దు. మీకు మేము అండగా ఉంటాం అని నమ్మించారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ ఫార్మా సిటీ జీవో రద్దు చేయలేదు. అప్పుడు భూములు కాపాడతామన్నారు. ఇప్పుడేమో భూములు గుంజుకుంటున్నారు. ఎలాగైనా సరే మా భూములు గుంజుకుంటామని ఎన్నికలకు ముందే చెప్పి ఉండాల్సింది.

ఎంత తేలిగ్గా సలహాలిస్తున్నారు..

ముఖ్యమంత్రిగారూ.. నిన్న మీరు సభ నిర్వహించిన చోటు నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేం.. మా భూములను వదిలేయండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రద్దు చెయ్యండి అని గత 46 రోజులు గా నిరాహార దీక్ష చేస్తున్నాం. కానీ మా గిరిజన రైతుల గోస మీకు వినబడం లేదు. మాకు మా భూమే కావాలని నాలుగైదు గ్రామాల వాళ్లం స్టే తెచ్చుకున్నాం. మీరు కూడా.. మీ భూములు మీకేనని నాడు అన్నారు. కానీ ఇప్పుడేమో డబ్బులు తీసుకొని ఎక్కడైనా దూరంగా భూములు కొనుక్కోవచ్చు అని ఎంత తేలికగా సలహాలు ఇస్తున్నారు.

మీరు, మీ పార్టీ నేతలు.. భూములిస్తారా

ముఖ్యమంత్రి గారూ.. ఇక్కడ భూములు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు, మీ పార్టీ నాయకులు మీ భూములని మా రైతులకి ఇయ్యండి. మాకు మీ భూములు ఇచ్చి అక్కడ మీ భూముల వద్దనే మా ఊర్లని కట్టించండి. అంత గొప్ప ఫ్యూచర్ సిటీ కోసం, దేశ భవిష్యత్ కోసం ఎకరా, రెండేకరా రైతులని త్యాగం చెయ్యమనే బదులు ఆ త్యాగాలేవో మీరు, మీ పార్టీ నాయకులు చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు

ఇట్లు

ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు

కుందారపు నారాయణ, విస్లావత్ సత్తులాల్, నేనావత్ పంత్య, విస్లావత్ జ్యోతి, పంగ అనసూయమ్మ, బర్ల కొమరయ్య, బుక్క చెన్నయ్య, గడ్డం రవీందర్, పంగ మణెమ్మ, అందెకర్ దేవోజీ, సోమయ్య, మండలి రాములు తదితరులు

Advertisement
Advertisement