త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Future City | సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ భూముల‌ను మా రైతుల‌కు ఇవ్వండి..

Future City | ఫ్యూచ‌ర్ సిటీ కోసం రైతులు భూములు ఇవ్వాల్సిందే.. ఇది ఆగేప‌ని కాదు.. అంతా అయిపోయింది.. ఈ రోజు కాక‌పోయినా రేపైనా మీ భూములు ప్ర‌భుత్వానికి బ‌దిలీ అవుతాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. సీఎం వ్యాఖ్య‌ల‌పై ఫార్మా సిటీ వ్య‌తిరేక పోరాట క‌మిటీ రైతులు భ‌గ్గుమంటున్నారు.

S

Telangana | Published On Apr 30, 2026, 3.51 pm IST

Future City | సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ భూముల‌ను మా రైతుల‌కు ఇవ్వండి..
Advertisement

Future City | త్రినేత్ర‌.న్యూస్ : ఫ్యూచ‌ర్ సిటీ కోసం రైతులు భూములు ఇవ్వాల్సిందే.. ఇది ఆగేప‌ని కాదు.. అంతా అయిపోయింది.. ఈ రోజు కాక‌పోయినా రేపైనా మీ భూములు ప్ర‌భుత్వానికి బ‌దిలీ అవుతాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. సీఎం వ్యాఖ్య‌ల‌పై ఫార్మా సిటీ వ్య‌తిరేక పోరాట క‌మిటీ రైతులు భ‌గ్గుమంటున్నారు.

ఫ్యూచ‌ర్ సిటీ విష‌యంలో కొంత‌మందికి క‌ష్టం ఉంది. స‌రైన న‌ష్ట ప‌రిహారం రాలేద‌న్న బాధ కొంద‌రి రైతుల్లో ఉంది. ఫ్యూచ‌ర్ సిటీలో భూములు కోల్పోతున్న వారు డ‌బ్బులు తీసుకుని కొంచెం దూరంలో భూమి కొనుకోవ‌చ్చు అని సీఎం వ్యాఖ్యానించ‌డంపై బాధిత రైతులు గుర్రుగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా 2021 ఫిబ్ర‌వ‌రి 16న‌ పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్ రెడ్డి పాద‌యాత్ర చేసి.. ఫార్మా సిటీకి వ్య‌తిరేకంగా మాట్లాడిన విష‌యాన్ని రైతులు గుర్తు చేస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప‌త్రికా ప్ర‌క‌ట‌న సారాంశం ఇదే..

గౌరవ ముఖ్య మంత్రిగారికి కొన్ని విషయాలు గుర్తు చేయాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఫార్మా సిటీ బాధిత రైతులము మేము మిమల్ని కలిసి మా భూములు పొతే బ‌తకలేము, మాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు, తప్పకుండా మీ భూములు కాపాడుతామన్నారు. కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి అందరు మీరు భూములు ఇయ్యొద్దు, మేము అధికారంలోకి రాగానే మీ భూసేకరణ రద్దు చేసి మీకు పూర్తి హక్కులు కల్పిస్తాం, ఫార్మా సిటీని రద్దు చేస్తాం అని ఈ ప్రాంతంలో మాతో కలిసి పాదయాత్రలు చేశారు. ఫార్మా సిటీని రద్దు చేస్తాం, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ కడతాం, మీ భూములు ఎట్లాగైనా గుంజుకుంటాం అని ఎలక్షన్ ముందే చెప్పవలసింది. అట్లా చెప్పి ఓట్లు వేయించు కోలేదు కదా?

ఫార్మా సిటీని రద్దు చేసాం అని ఉట్టి మాటలు చెప్పి, ఇప్పటికీ ఫార్మా జీవో రద్దు చేయ‌లేదు. అప్పుడు భూములు కాపాడుతా అని హామీ ఇచ్చి ఇప్పుడు భూములు గుంజుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న నిలబడిన చోటు నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మా భూములు వదిలేయండి, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రద్దు చేయండి అని గత 46 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గిరిజన రైతుల గోస‌ ముఖ్యమంత్రి గారికి వినిపించటం లేదు. అదే ప్రాంతంలో నాడు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేసి ఈ మూడు పంటలు పండే భూములు ఎట్టి పరిస్థితిలో ఇయ్యొద్దు, మీకు మేము అండగా ఉంటాం అని నమ్మించారు.

మాకు మా భూమే కావాలని కోర్టులో స్టే తెచ్చుకున్న నాలుగు గ్రామాల రైతులని గతంలో మీ భూములు మీకే అని నమ్మించిన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు డబ్బులు తీసుకొని ఎక్కడైనా దూరంగా భూములు కొనుక్కోవచ్చు అని ఎంత తేలికగా సలహాలు ఇస్తున్నారు. "ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ భూములు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు, మీ పార్టీ నాయకులు మీ భూములని మా రైతులకి ఇవ్వండి. మాకు మీ భూములు ఇచ్చి అక్కడ మీ భూముల వద్దనే మా ఊర్లని కట్టించండి. అంత గొప్ప ఫ్యూచర్ సిటీ కోసం, దేశ భవిష్యత్ కోసం ఎకరా, రెండేకరా రైతులని త్యాగం చెయ్యమనే బదులు ఆ త్యాగాలేవో మీరు, మీ పార్టీ నాయకులు చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు".

ఇట్లు

ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు

కుందారపు నారాయణ, విస్లావత్ సత్తులాల్, నేనావత్ పంత్య, విస్లావత్ జ్యోతి, పంగ అనసూయమ్మ, బర్ల కొమరయ్య, బుక్క చెన్నయ్య, గడ్డం రవీందర్, పంగ మణెమ్మ, అందెకర్ దేవోజీ, సోమయ్య, మండలి రాములు తదితరులు

Advertisement
Advertisement