త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌రు

Harish Rao | కేసీఆర్ పాలనలో పెద్దపల్లి జిల్లాలో ఎకరం భూమి రూ.50 నుంచి రూ.60 లక్షలుంటే, నేడు కాంగ్రెస్ పాలనలో సగానికి పడిపోయిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

S

Telangana | Published On Jun 7, 2026, 5.48 pm IST

Harish Rao | కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌రు
Advertisement
  • పెద్ద‌ప‌ల్లిలో ఎక‌రం భూమి రూ.60 లక్ష‌లు ఉండే
  • కాంగ్రెస్ పాల‌న‌లో రైతుతో పాటు భూముల విలువ ప‌డిపోయింది
  • హిట్ల‌ర్ పేద‌ల‌ను ఊచ‌కోత కోస్తే, ఈ న‌యా హిట్ల‌ర్ పేద‌ల ఇళ్ల‌ను కూలుస్తుండు
  • రేవంత్ పాపాల‌కు ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణలు చెప్ప‌క త‌ప్ప‌దు
  • పెద్ద‌ప‌ల్లి బీఆర్ఎస్ ఆత్మీయ స‌మావేశంలో హ‌రీశ్‌రావు హెచ్చ‌రిక‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: కేసీఆర్ పాలనలో పెద్దపల్లి జిల్లాలో ఎకరం భూమి రూ.50 నుంచి రూ.60 లక్షలుంటే, నేడు కాంగ్రెస్ పాలనలో సగానికి పడిపోయిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రైతుతో పాటు రైతుల భూముల విలువ కూడా తగ్గిపోయిందని విమర్శించారు. పెద్దపల్లి పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు సాధించడం ఖాయమన్నారు.

న‌యా హిట్ల‌ర్ రేవంత్‌రెడ్డి..

హిట్లర్ అంటే ఇష్టం, ఆయనను చూసే హైడ్రా పెట్టిన అని రేవంత్ రెడ్డి స్వయంగా అనడం ఆయన అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనం. నాడు హిట్లర్ పేదలను ఊచకోత కోస్తే, నేటి నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తూ వారి బతుకులను ఆగం చేస్తున్నారు. హిట్లర్ దురాగతాలకు నేటికీ జర్మనీ క్షమాపణలు చెబుతున్నట్లే, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి పాపాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు క్షమాపణలు చెప్పక తప్పదు అని హ‌రీశ్‌రావు హెచ్చరించారు.

30 శాతం వ‌డ్లు క‌ల్లాల్లోనే ఉన్న‌య్‌...

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపి వారి భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఆగం చేసిండు. వడ్లు అమ్ముకోవడానికి రైతులు 45 రోజుల పాటు కల్లాల వద్ద పడిగాపులు కాశారు. అయినా నేటికీ 30% వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికల కోసం కాకుండా రైతుల మీద ప్రేమతో కేసీఆర్‌ రైతుబంధు తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాసంగి పంటకు రైతుబంధు ఎగనామం పెట్టింది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

3 వేల మంది రైతులు చ‌నిపోయినా బీమా రాలే..

రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నారు. బడ్జెట్‌లో చెప్పిన రూ.35 వేల కోట్లకు సగం కూడా రుణమాఫీ చేయ‌లేదు. కేసీఆర్ పాలనలో మండలానికో గోదాం కట్టి ఎరువుల కొరత లేకుండా చేస్తే, నేడు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం మళ్లీ పాత రోజుల తరహాలో క్యూలైన్లు, లాఠీచార్జీల పరిస్థితి దాపురించింది. గత నాలుగు నెలలుగా ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడం వల్ల రాష్ట్రంలో 3 వేల మంది రైతులు చనిపోయినా రైతు బీమా రాలేదు అని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు డిస్కంతో ఉచిత క‌రెంటుకు ఉరి..

రేవంత్ రెడ్డి కొత్తగా తెస్తున్న 'రైతు డిస్కం' జీవో నంబర్ 8 వల్ల వ్యవసాయానికి కేవలం పగటి పూట 7 నుంచి 8 గంటల పాటు మాత్రమే కరెంటు వస్తుంది. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఉరి వేయబోతున్నారు. భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆర్టీఏ ట్యాక్స్‌లు, మద్యం ధరలు విపరీతంగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చే పథకాలను మాత్రం ఎగ్గొట్టింది. తులం బంగారం ఇస్తామని మోసం చేయడంతో పాటు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపేసి పేదల పిల్లల చదువులను దూరం చేసింది.

జీతంలో 1.5 శాతం కోత‌..

పోలీసుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన సరెండర్ లీవ్స్, టీఏ బిల్లులు, స్టేషన్ అలవెన్స్‌లు ఇప్పుడు ఆగిపోయాయి. ఆరోగ్య భద్రతను కూడా రద్దు చేసి కొత్తగా జీతంలో 1.5% కోత పెడుతున్నారు. అందుకే కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి రైతులు, విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ మళ్లీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నారు.

పార్టీలోకి మ‌ళ్లీ తిరిగి తీసుకోం..

కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన వారిని మళ్లీ తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదు. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలబడ్డ కార్యకర్తలే తమకు దేవుళ్లు. వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపేలా నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి అని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఎవ‌రూ కాపాడ‌లేరు..

పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న బబ్లు అనే పోలీస్ అధికారి తీరు బాలేదు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నించినంత మాత్రాన కార్యకర్తలను కొట్టడం సరైంది కాదు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అక్రమాలకు పాల్పడిన అధికారులకు తగిన బుద్ధి చెబుతాం. రేవంత్ రెడ్డి కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరూ కాపాడలేరు అని హ‌రీశ్‌రావు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement