త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోస‌మే మూడు కార్పొరేష‌న్లు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఎన్నిక‌ల కోసం, ఓట్ల కోసం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఏర్పాటు చేయ‌లేదు.. కేవ‌లం ప‌రిపాల‌న సౌల‌భ్యం కోస‌మే మూడు కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేశాన‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

S

Hyderabad | Published On Jun 7, 2026, 7.25 pm IST

CM Revanth Reddy | ఓట్ల కోసం కాదు.. ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోస‌మే మూడు కార్పొరేష‌న్లు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఎన్నిక‌ల కోసం, ఓట్ల కోసం జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఏర్పాటు చేయ‌లేదు.. కేవ‌లం ప‌రిపాల‌న సౌల‌భ్యం కోస‌మే మూడు కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేశాన‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫీసుతో పాటు ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో రేవంత్ పాల్గొని ప్ర‌సంగించారు.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్‌లో ఓట‌మి చెందాను. రాజ‌కీయంగా గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. పార్టీ ఆదేశాల‌కు మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేశాను. క‌ష్ట‌మైన ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు ఈ ప్రాంతానికి వ‌చ్చి గెలిచాను. మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం అంటే ఒక మినీ భార‌త‌దేశం. అలాంటి ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు 14 రోజుల్లోనే ఆశీర్వ‌దించి కింద‌ప‌డిపోయిన న‌న్ను బ‌లంగా నిల‌బెట్టి పార్ల‌మెంట్‌కు పంపించారు. ఆ త‌ర్వాత న‌న్ను సోనియా పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు. కార్య‌క‌ర్త‌ల స‌హ‌కారంతో తెలంగాణ మొత్తం తిరిగి 4 కోట్ల ప్ర‌జ‌ల‌కు భ‌రోసా, విశ్వాసం, న‌మ్మ‌కం క‌ల్పిస్తే ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. నేను ఇక్క‌డ రావ‌డానికి అండ‌గా నిల‌బ‌డ్డ ప్రాంతం మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ప్రాంతం. అందులో ఉప్ప‌ల్ ప్రాంతానికి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఒక్క పైసా ఆశించ‌కుండా, హామీ తీసుకోకుండా ఆడ‌బిడ్డ‌లంద‌రూ గెలిపించారు. ఐదేండ్లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కొట్లాడుతూ.. ఈ మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఉప్ప‌ల్‌లో మీరు ఆశించిన మేర‌కు అభివృద్ధి చేయ‌లేక‌పోయాను. కానీ ఐదేండ్లు తిరిగేలోపు సీఎంగా బాధ్య‌త చేప‌ట్టిన అని సీఎం తెలిపారు.

నాలుగు ర‌కాలుగా ప‌రిపాల‌న ఉండే..

నేను ఎంపీగా ఉన్న‌ప్పుడు మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప్రాంతంలో గ్రామ‌పంచాయ‌తీలు, మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, కార్పొరేటర్లు.. ఇలా నాలుగు ర‌కాల ప‌రిపాల‌న జ‌రుగుతుండే. హైటెక్ సిటీ వైపు అదే ప‌రిస్థితి. సిటీకి న‌లువైపులా ఎక్క‌డా చూసిన కూడా నాలుగు ర‌కాలుగా ప‌రిపాల‌న ఉండే. ఒక‌రి మ‌ధ్య‌లో ఇంకొక‌రికి స‌హ‌కారం, స‌మ‌న్వ‌యం లేక అభివృద్ధి చెంద‌లేదు.. అడ్డంకిగా మారాయని సీఎం పేర్కొన్నారు.

మౌలిక వ‌స‌తులు ఏర్పాటు చేసిన‌ప్పుడే అంత‌ర్జాతీయ న‌గ‌రం

హైద‌రాబాద్ అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రం అని మాట్లాడుకునేవాళ్లం. ఆ స్థాయిలో మౌలిక వ‌స‌తులు ఏర్పాటు చేసిన‌ప్పుడే అంత‌ర్జాతీయ న‌గ‌రం అవుతుంద‌ని చెప్పి రాష్ట్రానికి ఒక విజ‌న్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చాం. ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజ‌న్ డాక్యుమెంట్ తెచ్చుకుని ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. 160 కిలోమీట‌ర్ల మేర ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ లోప‌ల ఒక కోటి 34 ల‌క్ష‌ల మంది వివిధ జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి వ‌చ్చి అంత‌ర్జాతీయ కంపెనీలు పెట్టి నివ‌సిస్తున్నారు. ఈ ప్ర‌జ‌ల‌కు కావాల్సిన మౌలిక వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని, ప‌రిపాల‌న స‌మ‌న్వ‌యం ఉండాల‌ని, మూసీ ప్ర‌క్షాళ‌న చేయాల‌ని చెప్పి నిర్ణ‌యం తీసుకున్నాం. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ లోప‌లి ప్రాంతానికి క్యూర్ ప్రాంతంగా నామ‌క‌ర‌ణం చేసి మూడు మున్సిప‌ల్ కార్పొరేన్లు ఏర్పాటు చేసుకున్నాం. రాజ‌కీయ స్వార్థం కోసం, ఎన్నిక‌ల్లో ల‌బ్ధి కోసం మూడు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశార‌ని కొంద‌రు అంటున్నారు. కానీ ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం చేశాం ఎన్నిక‌ల ల‌బ్ధి కోసం చేయ‌లేదు అని సీఎం స్ప‌ష్టం చేశారు.

రాజ‌కీయాల‌కు అతీతంగా నిధులు ఇచ్చే బాధ్య‌త నాది

మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్రాంతంలో అన్ని ర‌కాల అభివృద్ధి చేస్తున్నాం. ఈ ఆఫీసును 10 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించుకుంటున్నాం. ఇది సౌల‌భ్య‌మే క‌దా..? న‌ల్లా క‌నెక్ష‌న్, ఇంటి ప‌ర్మిష‌న్ కావాల‌న్నా, అధికారిని క‌ల‌వాలంటే ట్యాంక్ బండ్ ద‌గ్గ‌రికి పోవాలి. అందుకే ప‌రిపాల‌న వీకేంద్రీక‌ర‌ణ చేశాం. అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యం కోసం మూడు కమిష‌న‌రేట్లు ఏర్పాటు చేశాం. ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి చేయ‌లేక‌పోయాను. రాజ‌కీయాల‌కు అతీతంగా ఎన్ని నిధులు కావాల‌న్నా అనుమ‌తులు కావాల‌న్నా సీఎంగా ఇచ్చే బాధ్య‌త నాది.. రోడ్లు అయినా, తాగేనీరు అయినా, చెరువుల సుంద‌రీక‌ర‌ణ అయినా ఏం కావాల‌న్నా మెట్రో విస్త‌ర‌ణ కావాల‌న్నా నేను చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాను. ఎంఎంసీ ప‌రిధిలో ఉన్న రాజ‌కీయ ప్ర‌తినిధులు ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడే ఎన్నిక‌ల గురించి మాట్లాడుదాం. అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాన‌ని సీఎం అన్నారు.

Advertisement
Advertisement