త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | పోచారం గారు సీనియ‌ర్ నాయ‌కులు.. ప‌రిస్థితిని అర్ధం చేసుకుంటార‌ని అనుకుంటున్నాం: పీసీసీ చీఫ్‌

Mahesh Kumar Goud | సిద్ధాపూర్ రిజ‌ర్వాయర్‌కు ఇప్ప‌ట్లో నిధులు ఇవ్వ‌లేమ‌ని పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్ప‌ష్టం చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) సీనియ‌ర్ నాయ‌కులు, పెద్ద మ‌న‌సుతో అర్ధం చేసుకుంటార‌ని భావిస్తున్నామ‌ని చెప్పారు.

G

Telangana | Published On Apr 13, 2026, 1.16 pm IST

Mahesh Kumar Goud | పోచారం గారు సీనియ‌ర్ నాయ‌కులు.. ప‌రిస్థితిని అర్ధం చేసుకుంటార‌ని అనుకుంటున్నాం: పీసీసీ చీఫ్‌
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: సిద్ధాపూర్ రిజ‌ర్వాయర్‌కు ఇప్ప‌ట్లో నిధులు ఇవ్వ‌లేమ‌ని పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్ప‌ష్టం చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) సీనియ‌ర్ నాయ‌కులు, పెద్ద మ‌న‌సుతో అర్ధం చేసుకుంటార‌ని భావిస్తున్నామ‌ని చెప్పారు. సిద్ధాపూర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం నిధులు మంజూరు చేయ‌డం లేద‌ని మాజీ మంత్రి పోచారం అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై పీసీసీ చీఫ్ స్పందిస్తూ.. `పోచారం గారు సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కులు.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాస్త‌వంగా పోచారం గారికి తెలియ‌ని ఇబ్బందులు కావ‌వి. నిధుల కొర‌త ఉంది. ఆయ‌న అభివృద్ధి చేయాల‌న్న ఆకాంక్ష క‌లిగిన నాయ‌కులు. కొన్ని ఇబ్బందులు అవుతుండ‌వ‌చ్చు. వారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా` అని చెప్పారు.

సిద్ధాపూర్ రిజ‌ర్వాయ‌ర్‌ను ప‌రిశీలించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. అస‌లు ప్ర‌భుత్వం ఉందా, ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన మాట త‌ప్పార‌న్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు.. ఎమ్మెల్యేల ఫోన్లు లేపరని ధ్వ‌జ‌మెత్తారు. నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి 20 సార్లు చెప్పిన‌ప్ప‌టికీ పట్టించుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాల్నా? అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

కొందరు మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను మంత్రులకు ఫోన్ చేసినా కనీస స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంద‌ని చెప్పారు. తాను గతంలో ప్రజా ప్రతినిధుల సమస్యల కోసం అర్ధరాత్రి ఫోన్ వచ్చినా స్పందించిన అనుభవం ఉందని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే నేతల ఫోన్ల‌ను కూడా లిఫ్ట్ చేయకపోవడం సరైన పద్ధతి కాద‌ని, సీనియర్ ఎమ్మెల్యేగా తనకున్న అనుభవాన్ని గుర్తుంచుకోవాల‌ని హిత‌వుప‌లికారు. తాను నిన్న, మొన్న గెలిచిన వ్యక్తిని కాద‌ని, త‌న సీనియార్టీని గౌరవించాల‌న్నారు. ప్రజా సమస్యలపై స్పందన లేకపోవడం వల్ల అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయ‌ని చెప్పారు. పెండింగ్ బిల్లులను ప్ర‌భుత్వం ఎందుకు విడుదల చేయడం లేదని ప్ర‌శ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు ఆగిపోతున్నాయ‌ని, దీంతో తాము స్వయంగా బతిమిలాడి పనులు కొనసాగించే పరిస్థితి ఉంద‌ని చెప్పారు. ఇది పాలనలో ఉన్న లోపాలను చూపిస్తున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

 

Advertisement
Advertisement